రివ్యూ: వై చీట్‌ ఇండియా
బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఇమ్రాన్‌ హాష్మీకి ‘సీరియల్‌ కిస్సర్‌’ అనే పేరుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో శృంగారభరితమైన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఇమేజ్‌ను పక్కనబెట్టి ‘వై చీట్‌ ఇండియా’ అనే సామాజిక అంశంతో తెరకెక్కిన కథను ఎంపికచేసుకున్నారు. ఇమ్రాన్‌ గతంలో నటించిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తు. ఇలాంటి పాత్రలో ఇమ్రాన్‌ గతంలో నటించలేదు. భారతదేశ విద్యా వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు సౌమిక్‌ సేన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇమ్రాన్‌ ఈ చిత్రంతో విజయం అందుకుంటారా? చూద్దాం.
నాలోనూ ఓ విమర్శకురాలు ఉంది
చిత్రసీమలో పొగడ్తలు, విమర్శలు మామూలే. ఒకరు పొగిడారని మనవాళ్లు అనుకోకూడదు, తిట్టారని వాళ్లను పక్కన పెట్టకూడదు అంటోంది కీర్తి సురేష్‌. ‘మహానటి’తో కీర్తి ప్రతిష్ఠ పెరిగింది. తెలుగులో అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం తన కెరీర్‌ని పరుగులు పెట్టిస్తోంది. మీ సినీ జీవితంలో అందుకున్న ఉత్తమ ప్రశంస, విమర్శ ఏది? అని అడిగితే... ‘‘చాలా ఉన్నాయి. అయితే వీటిని నేనెప్పుడూ సీరియస్‌గా పట్టించుకోను. ఎక్కడివి అక్కడే వదిలేయాలి. నాలోనూ ఓ విమర్శకురాలు ఉంటుంది కదా? తనేం చెబితే అది వింటా. ఓ నటిగా నేనేం చేయాలో నాకు తెలుసు. నటిగా నా నుంచి ఏం రాబట్టుకోవాలో దర్శకుడికి తెలుసు. మా ఇద్దరి మధ్య సమన్వయం ఉంటే పాత్ర పండుతుంది. ‘మహానటి’తో నాకు మంచి పేరొచ్చింది. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా అది. అయితే ఆ ఒక్క పాత్రే కొలమానం కాకూడదు. అలాంటి కథలు మరిన్ని చేయాలని ఉంద’’ని చెప్పింది కీర్తి.
ఫరాన్‌ బాక్సింగ్‌ తుఫాన్‌
మిల్కాభాగ్‌’... స్పోర్ట్స్‌ బయోపిక్‌ల్లో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకొంది. మిల్కాసింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫరాన్‌ అక్తర్‌.. మిల్కాగా నటించాడు. రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో క్రీడా నేపథ్యంలో సాగే మరో చిత్రం తెరకెక్కబోతుంది. బాక్సింగ్‌ కథాంశంతో సాగే ఈ చిత్రానికి తుఫాన్‌ అనే పేరుని ఖరారు చేశారు. ‘‘ఇది క్రీడా చిత్రం. బయోపిక్‌ కానీ, నిజ జీవిత కథ కానీ కాదు. ఓ కల్పిత కథ’’ అని చెప్పారు ఫరాన్‌. ఆయన ప్రస్తుతం ‘ది స్కై ఈజ్‌ పింక్‌’లో ప్రియాంక చోప్రాకు భర్తగా నటిస్తున్నారు.
మహానాయకుడి రథయాత్ర
‘ఎన్టీఆర్‌’ కథని ‘కథానాయకుడు’, ‘మహా నాయకుడు’ అంటూ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి ‘కథానాయకుడు’ విడుదలైంది. వచ్చే నెల 6న ‘మహా నాయకుడు’ వస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌ రామ్, వేలాది మంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య రథయాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా, సుమంత్‌ అక్కినేని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 22తో చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. సంగీతం: కీరవాణి.
పోరాట విద్యల ఆలయం
చైనాలో 5వ శతాబ్దంలో స్థాపించిన ‘షావోలిన్‌ టెంపుల్‌’ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి. కఠోర శిక్షణ మధ్య పోరాట విద్యలను నేర్పే బౌద్ధ గురువుల విద్యాలయంగా పేరొందిన ఇక్కడ ఆయా సినిమాల్లో హీరోలందరూ చేరి కుంగ్‌ఫూ లాంటి పోరాట విన్యాసాలు నేర్చుకుని విలన్లపై ప్రతీకారాలు తీర్చుకున్నారు. అలా 1982లో వచ్చిన హాంగ్‌కాంగ్‌ సినిమా ‘షావోలిన్‌ టెంపుల్‌’. ఇందులో అంతర్జాతీయంగా పేరొందిన జెట్‌లి హీరోగా నటించాడు. చిత్ర కథ చైనాలో చక్రవర్తుల కాలం నాటిదిగా ఉంటుంది. ఓ చక్రవర్తి ఆధ్యర్యంలో తన తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకోడానికి షావోలిన్‌ టెంపుల్‌లో చేరి యుద్ధ విద్యలు నేర్చుకుని తిరిగివచ్చిన హీరో విలన్ల పని పట్టడమే కథాంశం. ఈ సినిమాకు రీమేక్‌గా 2011లో ‘షావోలిన్‌’ పేరుతో వచ్చిన సినిమాలో జాకీచాన్‌ నటించాడు.
జనవరి 21.. (సినీ చరిత్రలో ఈరోజు)
తెలుగు సినిమా కామెడీ గురించి ప్రస్తావన వచ్చాక అది ఈవీవీ పేరు లేకుండా పూర్తి కాదు. అగ్ర దర్శకుడు జంధ్యాల దగ్గర శిష్యరికం చేసిన ఈవీవీ, గురువు బాటలోనే ప్రయాణం చేసి విజయాల్ని అందుకొన్నారు. గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకొన్నారు. తెలుగు సినిమా కామెడీ స్థాయిని పెంచిన దర్శకుల్లో జంధ్యాల తర్వాత ఈవీవీనే ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు తీసి విజయాల్ని అందుకున్న ఈవీవీ పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా, కోరుమామిడిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వెంకటరావు, వెంకటరత్నం దంపతులకి జూన్‌ 10, 1958న జన్మించారు. బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి కనబరిచేవారు. ఇంటర్‌మీడియట్‌ తప్పడంతో ఈవీవీ తండ్రి ఆయన్ను కాలేజీ మాన్పించి, పొలం పనులు అప్పజెప్పారు.


© Sitara 2018.
Powered by WinRace Technologies.