కష్టాలొచ్చినప్పుడు ధైర్యాన్నిచ్చే పాట

నాకు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే చాలా ఇష్టం. దర్శకుడు, సంగీత దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఆయన కథలు ఎంత బావుంటాయో పాటలు అంతే అలరిస్తాయి. కుటుంబ కథలకే అధిక ప్రాధాన్యమిచ్చే ఈయన మధ్యతరగతి జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపెడతారు. ఇలాంటి నేపథ్యంలోనే వచ్చిన ‘బడ్జెట్‌ పద్మనాభం’ చిత్రంలోని ‘ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యానా’ అనే పాట ఎప్పటికీ మర్చిపోలేను. పద్మనాభం(జగపతి బాబు) ఖర్చుకు వెనకాడే వ్యక్తి. అది కుటుంబ సభ్యులకు నచ్చదు. తన భార్య(రమ్య కృష్ణ) పద్మనాభంపై కోపగించుకునే సందర్భంలో వస్తుందీ పాట. సమస్యలు ఎదుర్కొనే ప్రతి వ్యక్తి ఈ పాట వింటే మన పరిస్థితీ ఇంతే కదా... మనకోసమే రాశారా అని అనుకోకుండా ఉండలేం. చంద్రబోస్‌ సాహిత్యం ఈ పాటకు బలాన్ని చేకూర్చింది. ఈ పాటలోని ప్రతి పదం ఆలోచింపజేస్తుంది. కష్టాలొచ్చాయని బాధపడకుండా వాటిని ఏ విధంగా స్వీకరించాలో చెప్పడంలో కృష్ణారెడ్డి,చంద్రబోస్‌ ఇద్దరూ విజయం సాధించారనే చెప్పొచ్చు. అవమానాలు వస్తే వాటిని ఆభరాణులుగా గుర్తించాలని, ఛీత్కారాలే సత్కారాలంటూ సాగే ఈ పాట ఆద్యంతం స్ఫూర్తినిస్తుంది. నేను ఇతరుల వల్ల ఫీల్‌ అయినపుడు ఈ పాట వింటే తెలియని ధైర్యం వస్తుంది.


-ఈశ్వరాచారి, సాగిపాడు గ్రామం, పశ్చిమ గోదావరిపల్లవి: ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్లే బడిలోన
పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే
అన్ని నువ్వేకావాలి అనునిత్యం పోరాడాలి
అనుకున్నది సాధించాలి

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్లే బడిలోన
పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే

చరణం: అవమానలే ఆభరణాలు
అనుమానాలే అనుకూలాలు
సందేహాలే సందేశాలు
ఛీత్కారాలే సత్కారాలు

అనుకోవాలి అడుగేయాలి
ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
అలుపొస్తున్నా కలలేకన్నా
పూల స్వర్గాన్ని అధిరోహించాలి

ఎవరికి వారే లోకంలో ఎవరికీ పట్టని శోకంలో
నీతో నువ్వే సాగాలి

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్లే బడిలోన
పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే


బలము నువ్వే బలగం నువ్వే
ఆట నీదే గెలుపు నీదే
నారు నువ్వే నీరు నువ్వే
పోత నీకే పైరు నీకే

నింగిలోన తెల్లమేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను
చెట్టుపైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను

ఒక ఉదయం ముందర చీకట్లు
విజయం ముందర ఇక్కట్లు
రావడమన్నది మామూలు

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్లే బడిలోన
పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.