తెలుగు చిత్రసీమకు కొత్త ట్రెండ్‌ ‘అడవి రాముడు’

‘అడవి రాముడు’ 28 ఏప్రిల్‌ 1977లో ఎన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అడవి రాముడు’ 28 ఏప్రిల్‌ 1977లో విడుదలైంది. సత్య చిత్ర నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలకూ ఇది తొలి చిత్రమే. ఎన్టీఆర్, జయప్రద తొలిసారి జోడీ కట్టింది కూడా ఈ సినిమాతోనే. తెలుగు సినిమాలలోని కథ, కథనం, సంగీతం, స్టెప్పులకు ఈ చిత్రం ఓ కొత్త ఒరవడిని పరిచయం చేసింది. జంధ్యాల సంభాషణలు, వేటూరి సుందర రామ్మూర్తి పాటలు, మామ కె.వి మహదేవన్‌ సంగీతం, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల నేపథ్య గానం వీటన్నింటినీ ఉపయోగించుకుంటూ అప్పట్లో కొత్తదనంతో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన దర్శకత్వ ప్రతిభ మనకి కనిపిస్తుంది. కథలోకి వెళితే అటవీ ప్రాంతంలో నాగభూషణం, కొడుకు సత్యనారాయణతో కలిసి కలప స్మగ్లింగు, జంతువుల అక్రమ రవాణా వంటి చీకటి వ్యాపారాలు చేస్తూ అక్కడి ప్రజల్ని దోపిడీ చేస్తుంటాడు. రాము (రాముడు, ఎన్టీఆర్‌) ప్రజల పక్షాన నిలిచి నాగభూషణాన్ని ఎదుర్కొంటాడు. అక్కడి ప్రజలలో చైతన్యం తెస్తాడు. అటవీ శాఖాధికారి కూతురు జయప్రద అతన్ని ప్రేమిస్తుంది. అక్కడి గూడెంలో ఉండే యువతి (జయసుధ) రామూను అన్నగా ప్రేమిస్తుంది. దీన్ని మొదట అపార్థం చేసుకున్న జయప్రద తర్వాత నిజం తెలుసుకుంటుంది. రాము అడవిలో ఉంటే తమకు ఇబ్బంది అని నాగభూషణం బృందం అతన్ని అడవి నుంచి పంపించి వేయడానికి గూడెంలో ఉన్న శ్రీధర్‌ అనే వ్యక్తిని వాడుకుంటుంది. ఐతే రాము అక్కడి విషయాలు తెలుసుకోవడానికి మామూలు వ్యక్తిగా వచ్చిన ఫారెస్ట్‌ ఆఫీసరని వారెవరికీ తెలియదు. చిత్రం రెండవ సగంలో కథ రాము ఫ్లాష్‌బ్యాక్, ప్రతినాయకుల ఆట కట్టించడంతో చిత్రం సుఖాంతం అవుతుంది. కన్నడ రాజ్‌ కుమార్‌ నటించిన ‘గందద గుడి’ చిత్రం ఈ సినిమాకు కొంత ఆధారం. అప్పటి వరకు ఉన్న రామారావు ఇమేజిని మారుస్తూ రాఘవేంద్రరావు ఆయన ఆహార్యం, దుస్తుల విషయంలో ఎంతో కొత్తదనం చూపించారు. తొలిసారి విజయవాడ యాక్స్‌ టైలర్‌.. రామారావు దుస్తులకు రూపకల్పన చేశారు. ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ నుంచి హీరోఇజమ్‌ ప్రదర్శితమౌతూ వస్తుంది. అప్పటి సూపర్‌ హిట్‌ హిందీ చిత్రం ‘షోలే’లోని కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉపయోగించుకోవడం విశేషం. రోహిణిని విలన్లు చంపడం, రామును గూడెం నుంచి వెళ్లిపోమని శ్రీధర్‌ బెదిరించే సన్నివేశం, కాకరాల రామారావును అక్కడే ఉండమనడం, జయప్రద రాము కోసం గుడిలో ప్రార్ధించడం, జయసుధ వెనుక నుంచి మాట్లాడటం, జయసుధ, జయప్రదలను గుర్రపు బండి మీద సత్యనారాయణ వెంటాడటం వంటివన్నీ ‘షోలే’ నుంచి తీసుకున్నవే. అప్పట్లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, 4 కేంద్రాల్లో 365 రోజులు ఆడి రికార్డులకు కొలమానంగా నిలిచింది. చిత్రంలో పాటలన్నీ జనరంజకమైనవే. అందులో ‘‘మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ’’, ‘‘అమ్మతోడు అబ్బతోడు నీ తోడూ నాతోడూ’’, ‘ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ’’, ‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’’, కుకుకు కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’’, చూడర చూడర ఓ చూపు’’ ఇలా అన్నీ గీతాలు అప్పటికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని ఊరూరా ఎంతగానో మారుమోగుతూనే ఉన్నాయి. ఇందులోని అన్ని గీతాలను వేటూరి రాశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్‌కు కొత్త ఇమేజ్‌ను సాధించి పెట్టిన ఈ మాస్‌ క్లాస్‌ మసాలా చిత్రం అప్పటికీ ఇప్పటికీ అందరికీ నచ్చిన చిత్రం. అందుకే నాకిష్టం.

- దార్ల శ్రీనివాసులు 
  ఆచారి,నందలూరు మండలం, నాగిరెడ్డి పల్లి, కడప జిల్లా.


                                                                                                                 


© Sitara 2018.
Powered by WinRace Technologies.