రిజర్వేషన్‌పై శ్రీహరి వినిపించిన గళం

శ్రీహరి గారి నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కథానాయకుడిగానే కాకుండా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘కింగ్‌’.. తదితర చిత్రాల్లో అన్నయ్య పాత్రలో మెప్పించారు. ఆయన చిత్రాల్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘ఎవడ్రా రౌడీ’. అందులోని ఎమోషనల్‌గా సాగే ఇంటర్వ్యూ సీన్‌లో నటన తీరు వర్ణనాతీతం. నిరుద్యోగులు పడుతున్న బాధల్ని ప్రతిబింబిస్తుందీ సన్నివేశం. పరిస్థితుల ప్రభావం కారణంగా విద్యార్హత ఎంతున్నా.. పొట్ట నింపుకోవడానికి ఏదో ఉద్యోగం చేయాలనుకునే కుర్రాడు ఇంటర్వ్యూకు వెü™్త అక్కడ ఎదురయ్యే కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సన్నివేశంలో శ్రీహరి చెప్పే ప్రతి డైలాగు అద్భుతమే. ‘ఎంకామ్‌ చదువుకున్న వాణ్ని.. ట్యాక్సేషన్‌ గురించి అడగండి చెబుతాను. ట్రైల్‌ బ్యాలెన్స్‌ గురించి అడగండి వివరిస్తాను. అంతేకానీ హైదరాబాద్‌లో సముద్రం ఎందుకు లేదు? జయలలిత గారికి పెళ్లి ఎందుకు కాలేదు? చంద్రబాబు నాయుడు గడ్డం ఉంటే బావుంటాడా? లేకపోతే బావుంటాడా? ఇవి కాదు అడగాల్సింద’ని తన నటనతో విజృంభించారు. ‘అప్పర్‌ క్యాస్ట్‌ అంటే డబ్బున్న వాళ్లు లోయర్‌ క్యాస్ట్‌ అంటే పేదవాళ్లని ఎవరు చెప్పారు? ఈ రాష్ట్రంలో ఓ చేత్తో డిగ్రీ పట్టా, ఓ చేత్తో ఖాళీ పొట్ట పట్టుకుని తిరిగే వాళ్లలో బ్రాహ్మణుడు ఉన్నాడు, పేరు చివర రాజు, రెడ్డి, నాయుడు అని తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రులూ ఉన్నార్రా’ అంటూ రిజర్వేషన్‌ విధానాన్ని తనదైన శైలిలో ప్రశ్నించి, కులం పేరుతో ఉద్యోగాలు ఇచ్చే వారి కళ్లు తెరిపించారు. ‘ఉద్యోగం వస్తుందన్న ఆశతో బట్టల ఇస్త్రీకి 3 రూపాయలు, బస్సు ఛార్జీకి 5 రూపాయిలు, అప్లికేషన్‌కు 10 రూపాయలు.. అప్పు చేసి ఇంటర్వ్యూకు వస్తాంరా.. అంబేడ్కర్‌ బతికుంటే ఆకలేసేవాడికి ఎందుకు రిజర్వేషన్‌ పెట్టలేదని అడిగేవాణ్నిరా..’ అని చెప్పే తీరు ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకుంటుంది. అందుకే శ్రీహరి ‘రియల్‌ స్టార్‌’ అయ్యారు అనిపిస్తుంది.

- బొల్లిబోయిన వేణు, గురుభట్లగూడెం గ్రామం, పశ్చిమ గోదావరి
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.