అలా చెప్పమాకండి.. కట్‌ కట్‌!
భానుమతి మూడో చిత్రం ‘ధర్మపత్ని’ చిత్రీకరణ జరుగుతోంది. భానుమతి ఓ సన్నివేశంలో ....‘అలా చెప్పమాకండి’ అని సంభాషణ చెబుతుండగా ఓ మూల నుంచి ‘కట్‌’ అని వినిపించింది. అది చెప్పింది ఎవరా? అని దర్శకుడు పి.పుల్లయ్య చూశారు. ‘నేనే..’ అంటూ భానుమతి తండ్రి వెంకట సుబ్బయ్య ముందుకొచ్చి ‘ఈ డైలాగ్‌ రాసింది ఎవరండీ?’ అని అడిగారట. సన్నగా పొడుగ్గా ఉన్న ఒకాయన లేచి నిలబడి ‘నేనేనండీ..’ అన్నారట. అప్పుడు వెంకట సుబ్బయ్య ‘సినిమాను అన్ని ప్రాంతాల తెలుగువారూ చూస్తారు. డైలాగ్‌ అందరికీ అర్థం కావాలి. లేకపోతే ఆక్షేపణలు వస్తాయి కదా?’ అన్నారట. పొడుగాటి వ్యక్తి ‘అవునండీ’ నిజమే ‘అలా చెప్పకు’ అని రాయవచ్చు..’ అన్నారట. దానికి వెంకట సుబ్బయ్య సంతోషిస్తే, పి.పుల్లయ్య ‘వెంకట సుబ్బయ్య గారూ యూ ఆర్‌ బ్రూటల్లీ ఫ్రాంక్‌’ అని నవ్వారట. పొడుగాటి వ్యక్తి పక్కన ఉన్న మరో వ్యక్తి ‘ఆయన చెప్పింది నిజమే..’ అన్నారట. ‘ధర్మపత్ని’కి సంభాషణలు రాసిన ఆ పొడుగాటి వ్యక్తి తర్వాతి కాలంలో నాగి రెడ్డితో కలిసి విజయా సంస్థను నెలకొల్పిన చక్రపాణి కాగా, ఆయన పక్కనున్న మరో వ్యక్తి సుప్రసిద్ధ రచయిత కొడవగంటి కుటుంబరావు.© Sitara 2018.
Powered by WinRace Technologies.