బరువైన భావోద్వేగాల చిత్రణ...
‘డాక్టర్‌ చక్రవర్తి’ ‘అన్నపూర్ణా’ సంస్థకు తెలుగు చలన చిత్ర చరిత్రలో అద్వితమైన స్థానముంది. 1951లో పురుడు పోసుకున్న ఈ సంస్థ, సామాజిక బాధ్యతను గుర్తుచేసే సినిమాలను నిర్మించి విజయాలు సాధించింది. ‘దొంగరాముడు’, ‘తోడికోడళ్లు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘ఇద్దరుమిత్రులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’ వంటి ఎన్నో మంచి చిత్రాలు అన్నపూర్ణ సంస్థ ద్వారా వచ్చినవే. ఆ కోవలోనిదే ‘డాక్టర్‌ చక్రవర్తి’. తెలుగులో నిర్మించిన తొలి నవలా చిత్రంగా పేరొందిన ఈ సినిమా జులై 10, 1964న విడుదలై విజయఢంకా మోగించింది. యాభై ఐదు వసంతాలు పూర్తిచేసుకున్న ఈ చలన చిత్ర విశేషాలను మననం చేసుకునేందుకు ఒకసారి పూర్వాశ్రమంలోకి వెళ్దాం.

అన్నపూర్ణ సంస్థ ఆవిర్భావం
తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధమున్న దుక్కిపాటి మధుసూదనరావు 1951లో అన్నపూర్ణ పిక్చర్స్‌ సంస్థను స్థాపించారు. అక్కినేని నాగేశ్వరరావు అధ్యక్షునిగా, దుక్కిపాటి మేనేజింగ్‌ డైరక్టరుగా, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావులు డైరక్టర్లుగా తొలుత ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన మధుసూదనరావుని సవతి తల్లి అన్నపూర్ణే పెంచి, ప్రయోజకునిగా తీర్చిదిద్దింది. ఆమె పేరుమీదే ‘అన్నపూర్ణ పిక్చర్స్‌’ సంస్థ వెలిసింది. ఈ సంస్థ మొదటి సినిమా కె.వి.రెడ్డి నిర్దేకత్వంలోనే రావాలనే ఉద్దేశంతో రెండేళ్లు నిరీక్షించి మరీ ‘దొంగరాముడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘దొంగరాముడు’ తర్వాత నిర్మించే చిత్రానికి ‘అమర సందేశం’ తీసిన ఆదుర్తి సుబ్బారావు దొరికారు. ఇక ఆ సంస్థకు ఆదుర్తే ఆస్థాన విద్యాంసులు అయ్యారు.

తొలి నవలా చిత్రం నిర్మాణ నేపథ్యం
‘ఇద్దరు మిత్రులు’ సినిమా నిర్మాణ సమయంలోనే నిర్మాత దుక్కిపాటి ‘కాలతీత వ్యక్తులు’ అనే నవల చదివారు. రచయిత్రి డా।। పి. శ్రీదేవిని పిలిపించి ఆ నవలను సినిమాగా తీస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని చర్చించారు. ఆ నవల కథాంశం సినిమాకు పనికిరాదని గ్రహించి, చదువుకుంటున్న ఆడపిల్లల సమస్యల నేపథ్యంలో ఒక కథను అల్లమని ఆమెతో చెప్పారు. ఆ సబ్జెక్టు చర్చల స్థాయిలో ఉండగానే శ్రేదేవి కాలం చెయ్యడంతో, త్రిపురనేని గోపీచంద్‌ చేత మాటలు, యద్దనపూడి సులోచనారాణి చేత స్క్రీన్‌ప్లే రాయించి ‘చదువుకుంటున్న అమ్మాయిలు’ సినిమా నిర్మించారు. అయితే, పూర్తి నిడివి నవలా చిత్రాన్ని తీయాలనే ఆలోచన దుక్కిపాటిని వదలలేదు. 1962లో ఆంధ్రప్రభ వారు ఉగాది నవలల పోటీ నిర్వహిస్తే కోడూరి కౌసల్యాదేవి నవల ‘చక్రభ్రమణం’కి ప్రథమ బహుమతి లిభించింది. న్యాయ నిర్ణేతల సంఘంలో సభ్యుడుగా వ్యవహరించన దుక్కిపాటి స్నేహితుడు గోపీచంద్‌ ఈ నవలను సినిమాగా తీయవచ్చని సలహా ఇచ్చి, హక్కులు కొనమన్నారు. దుక్కిపాటి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. ఈ లోగా ఆ నవల మార్కెట్‌లో విడుదలై విపరీతమైన జనాదరణ పొందింది. పాఠకులు దానిని సినిమాగా తీస్తే యేయే నటీనటులు ఆయా పాత్రలకు సరిపోతారో సూచిస్తూ అన్నపూర్ణ సంస్థకు అసంఖ్యాకంగా ఉత్తరాలు రాశారు. అప్పుడు దుక్కిపాటి రాజమండ్రి వెళ్లి ఆ నవల హక్కుల్ని కొని, కౌసల్యాదేవినే సినిమాకి సంభాషణలు రాయవలసిందిగా కోరారు. ఇరవై ఏళ్లు కూడా నిండని ఆమెను మద్రాసు పంపడం ఇష్టం లేదని ఆమె తల్లితండ్రులు తేల్చి చెప్పడంతో, ఆచార్య ఆత్రేయతో మాటలు రాయించారు. సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఉండాలని కౌసల్యాదేవే ఈ సినిమాకి ‘డాక్టర్‌ చక్రవర్తి’ అనే పేరును సూచించారు. ‘చక్రభ్రమణం’ నవల ధారావాహికంగా వెలువడినప్పుడు ఆంధ్రప్రభలో సబ్‌-ఎడిటర్‌గా పనిచేసిన మారుతీరావుకు ఆ నవల గురించి సంపూర్ణ అవగాహన ఉండడం చేత, స్క్రీన్‌ప్లే బాధ్యతలు అతనికి అప్పచెప్పారు. నిజానికి స్క్రీన్‌ప్లే రచనలో కె.విశ్వనాథ్‌, ఆదుర్తి, దుక్కిపాటి కూడా పాలుపంచుకున్నా, మారుతీరావు ప్రతిభను ప్రోత్సాహించాలని టైటిల్‌ కార్డులో ఆయన పేరు మాత్రమే వేశారు. అప్పట్లో హైదరాబాద్‌ ఆకాశవాణిలో పనిచేస్తున్న మారుతీరావు సినీ ప్రస్థానం ఈ సినిమాతోనే మొదలైంది. కళాతపస్వీ విశ్వనాథ్‌ అంతకు ముందు వాహినీ స్టూడియోలో రికార్డింగ్‌ ఇంజనీరుగా పనిచేస్తుండేవారు. మూడు చిత్రాలకు వరుసగా అసోసియేట్‌గా పనిచేశాక, అతనికి దర్శకుడిగా అవకాశం ఇచ్చే ఒప్పందంపై ఆయన అన్నపూర్ణ సంస్థలోకి అడుగుపెట్టడం జరిగింది. ఒప్పందం మేరకు ‘డాక్టర్‌ చక్రవర్తి’ సినిమాకి దర్శకత్వం వహించమని దుక్కిపాటి, విశ్వనాథ్‌ని కోరారు. కానీ, ఎంతో ప్రజాదరణకు నోచుకున్న నవలా చిత్రం కావడం చేత విశ్వనాథ్‌ వెనక్కి తగ్గడంతో ఆదుర్తి సుబ్బారావే ‘డాక్టర్‌ చక్రవర్తి’ దర్శకత్వం వహించారు.చిత్రకథలో ఏముంది?
మనుషుల మనస్తత్వాలు, అనురాగాలు, అనుమానాలు, అపార్థాలు, పశ్చాత్తాపాలు వంటి వివిధ భావోద్వేగాల అల్లికే ఈ సినిమా మూలకథ. డాక్టర్‌ చక్రవర్తి (అక్కినేని)కి చెల్లెలు సుధ (గీతాంజలి) అంటే అంతులేని అనురాగం. క్యాన్సరు వ్యాధితో బాధపడుతున్నా, అన్న చదువు పాడవుతుందని జబ్బు విషయాన్ని తెలియనివ్వదు. విదేశాల నుండి డాక్టరు చదువు పూర్తి చేసుకొని వచ్చిన అన్నయ్యతో తన ఆడపడుచు నిర్మల (షావుకారు జానకి)ని పెళ్లి చేసుకొని, కృతజ్ఞతా పూర్వకంగా భర్త శేఖర్‌ (మురళీకృష్ణ) రుణం తీర్చుకోమని మాట తీసుకొని ప్రాణం విడుస్తుంది. చక్రవర్తి అప్పటికే తన స్నేహితురాలు డాక్టర్‌ శ్రీదేవి (కృష్ణకుమారి)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సుధ స్మృతి కోసం చక్రవర్తిని నిర్మలతో పెళ్ళికి శ్రీదేవి ఒప్పిస్తుంది. చనిపోయిన చెల్లెల్ని, మిత్రుడు రవీంద్ర (జగ్గయ్య) భార్య మాధవి (సావిత్రి)లో చూసుకుంటూ వారి కుటుంబానికి చక్రవర్తి సన్నిహితమౌతాడు. వంట మనిషి కాంతమ్మ (సూర్యకాంతం) మాటలు విని, నిర్మల అసూయతో చక్రవర్తికి, మాధవికి అక్రమ సంబంధాన్ని అంటకట్టి మాధవిని భర్త రవీంద్ర అనుమానించే స్థితికి చేరుస్తుంది. పుట్టింటికి చేరి చావుబతుకుల మధ్య పోరాడుతున్న గర్భవతైన మాధవిని చక్రవర్తి బతికిస్తాడు. పతాక సన్నివేశంలో రవీంద్ర తన పొరపాటును తెలుసుకొని మాధవిని దక్కించుకుంటాడు. మాధవికి పుట్టిన బాబుకి చక్రవర్తి పేరు పెట్టడంతో సినిమా సుఖాంతమౌతుంది.

ఆదుర్తి దర్శక ప్రజ్ఞ
‘చక్రభ్రమణం’ వంటి జనాదరణ పొందిన నవలను సినిమాగా మలచటం అంత సులువు కాదు. నవల చదివిన పాఠకుల అంచనాలు సినిమాపై అధికంగా ఉంటాయి. సినిమా పరంగా చేసే మార్పులు ఎంతో బాగుంటేగాని అంగీకరించలేరు. ‘చక్రభ్రమణం’ నవలలో చక్రవర్తి పాత్రను ఒక ధనవంతుడిగా సృష్టిస్తే, సినిమాలో ఆ పాత్రను ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, చెల్లెలి భర్త సహాయంతో విదేశాలలో చదువుకున్న వాడిలా మార్చారు. నవలలో భర్త సంకుచిత మనస్తత్వానికి బలైపోయిన సుధ పాత్రను సంపన్న కుటుంబ మహిళగా.. ఆమె భర్తను సహృదయునిగా, ఆమె మరణం క్యాన్సర్‌ కారణంగా జరిగిన ఘటనగా మార్చారు. నవలలో సుధ ఎవరనేది చివరి దాకా సస్పెన్స్‌లో సాగి ఆమె ఎవరన్నది ఆఖరున తెలుస్తుంది. కానీ సినిమాలో ఆ సస్పెన్స్‌ ఉండదు. ఇలాంటి మార్పులను అందరినీ ఒప్పించేలా ‘డాక్టర్‌ చక్రవర్తి’ సినిమాని మమతానుబంధాల కథగా మలిచారు. సినిమాలో మాధవిగా నటించిన సావిత్రి పాత్ర అద్వితీయం. ఆ పాత్ర మహిళాలోకాన్ని ఎంతగా ఆకట్టుకుందంటే విజయవాడ అలంకార్‌ థియేటరులో పదివారాలపాటు, కింద తరగతి టిక్కెట్లు కేవలం మహిళలలకే ఇచ్చేవారు. బాల్కని టిక్కెట్లను బ్లాకులో పదిరూపాయలకు అమ్మిన సంఘటనలు ఉన్నాయి. సావిత్రి అన్నపూర్ణ సంస్థలో నటించిన ఆఖరి చిత్రం డాక్టర్‌ చక్రవర్తి. షావుకారు జానకి ఈ సంస్థలో నటించిన మొదటి సినిమా కూడా ఇదే. జగ్గయ్య తండ్రి జగన్నాథరావుగా నాటి హిందుస్థాన్‌, ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సంగమేశ్వరరావు, గీతాంజలి భర్త శేఖర్‌గా సికింద్రాబాద్‌ నవయుగ ఫిలింస్‌ పంపిణీ సంస్థ మేనేజరు మురళీకృష్ణ నటించడం విశేషం. స్థానిక రంగస్థల నటులను ప్రోత్సహించాలని భానుప్రకాష్‌కు ఇందులో చిన్న పాత్ర ఇచ్చారు. ఇదే భానుప్రకాష్‌కి తరవాత వచ్చిన ‘పూలరంగడు’ చిత్రంలో విలన్‌ పాత్ర ఇచ్చారు. సినిమాకు ఆచార్య ఆత్రేయ రాసిన పదునైన మాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. రవీంద్ర తనకు వచ్చిన ఆకాశరామన్న ఉత్తరాన్ని నిప్పుల్లో వేసినప్పుడు ఎగిసేజ్వాలలో చక్రవర్తి, మాధవి సన్నిహితంగా వుండే సన్నివేశాన్ని జోడించడం ఆదుర్తి దర్శకత్వ ప్రతిభకు తార్కాణం. ఆదుర్తికి కొన్ని సెంటిమెంట్లున్నాయి. సినిమా చివర్లో ‘శుభం’ కార్డు వెయ్యకుండా ‘జైహింద్‌’ అని వెయ్యడం అతనికి అలవాటు. ‘తోడికోడళ్లు’ సినిమా నుంచీ ఈ ప్రక్రియ కొనసాగింది.

పాటలు తేనెపాకపు గారెలు
అన్నపూర్ణా వారి సినిమాల్లో పాటలకు ప్రత్యేకస్థానం వుంది. పెండ్యాలతో మొదలై, మాస్టర్‌ వేణుతో కొనసాగి, సాలూరు రాజేశ్వరరావుతో పరాకాష్టకు చేరుకున్న ప్రస్థానం ఆ పాటలది. ‘డాక్టర్‌ చక్రవర్తి’లో పాటలన్నీ తేనెపాకంలో ముంచిన గారెల్లాగే వుంటాయి. సాలూరు రాజేశ్వరరావు పాడిన లలిత గీతంలో ‘తుమ్మెదా ఒకసారి ననుజూచి పొమ్మని చెప్పవే నా మాట నా చిలుకతోడ’ అనే వరసని పద్మనాభం హార్మోనియం వాయిస్తూ పాడినట్లు చిత్రీకరించడం, ఆ సంగీత దర్శకుని పట్ల అన్నపూర్ణ సంస్థకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది. తొలిపాట చక్రవర్తి, శ్రీదేవి రైల్లో ప్రయాణం చేస్తూ పాడుకునే యుగళగీతం ‘‘ఈ మౌనం, ఈ బిడియం, ఇదేనా ఇదేనా చెలియ కానుకా’’ అంటూ సాగే ఈ ఆరుద్ర గీతాన్ని రాజేశ్వరరావు ‘మోహనరాగం’లో స్వరపరిచారు. రైలు కూతను నేపథ్య సంగీతంగా మలచడం సాలూరికే సాధ్యమైంది. ఈ పాట కోసం పెరంబూరు ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి వర్కర్లను హైదరాబాదు పిలిపించి, ఫస్టుక్లాసు రైలుపెట్టెను సారథి స్టూడియోలో తయారు చేయించి, చిత్రీకరణ జరిపారు. దీనికోసం స్టూడియోలో ప్రత్యే ప్లాట్‌ఫారాన్ని, ట్రాక్‌ని నిర్మించారు. మహాకవి శ్రీశ్రీ రాసిన ‘‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము’’ అనేది మరో చిరస్మరణీయమైన పాట. నాగార్జునసాగర్‌ నిర్మాణం పూర్తి కావస్తున్న సమయంలో, పైలాన్‌కు నిర్మాణం పూర్తికావస్తున్న సమయంలో, పైలాన్‌ దగ్గరవున్న ఉద్యానవనంలో ఈ పాటను చిత్రీకరించారు. రాజేశ్వరరావు మీద బెంగాళీ సంగీత ప్రభావం చాలా వుంది. చిన్నతనంలో ఆయన సినిమాల్లో వేషాలు వేస్తూ, కలకత్తాలో ఉంటూ సంగీతం నేర్చుకున్నారు. ఉత్తమ్‌కుమార్‌ నటించిన ‘శాపమోచన్‌’ అనే బెంగాళీ సినిమాలో హేమంతకుమార్‌ స్వరపరిచి ఆలపించిన పాట ట్యూనుని యథాతధంగా వాడుకొని, ఈ పాటగా మలిచారు. ‘జయా జయావంతి’ రాగంలో సాగే ఈ పాటను మనసు కవి ఆత్రేయ రాశారేమో అనే సందేహం చాలామందికి కలిగింది కూడా. ఇక ఆత్రేయ రాసిన రెండు వీణ పాటలు ‘‘పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా’’ (గీతాంజలి), ‘‘పాడమని నన్నడగతగునా పదుగురెదుటా పాడనా’’ (సావిత్రి) వేటికవే రసగుళికలు. గీతాంజలి పాడే పాటలో అన్న కోరికపై పాడుతున్న సంతోషం ఒకవైపు, ఆ ఉద్వేగంలో పరాకాష్టకు చేరిన అనారోగ్యాన్ని భరిస్తూ వ్యక్తం కానీయని వేదన, భర్త ముఖంలో ఆందోళన, అక్కినేనికి అర్థంకాని ఉద్వేగం. గీతాంజలి ఆరోగ్య పరిస్థితి తెలిసిన జానకి ఆమెకేమౌతుందో అని తల్లడిల్లే భావాల చిత్రీకరణను అద్భుతంగా రక్తికట్టించారు ఆదుర్తి. ఇక రెండో వర్షన్‌లో సావిత్రి తనకు పరాయి పురుషుని ముందు పాడడం ఇష్టం లేని పరిస్ధితిని గుర్తుచేస్తూ, జగ్గయ్యను కృష్ణునిగా భావించి పాడుతున్నప్పుడు, అక్కినేనిలో భావోద్వేగం, జానకిలో అసహనం, జగ్గయ్యలో కించిత్‌ గర్వం, సావిత్రిలో సంస్కారాన్ని గొప్పగా చిత్రీకరించారు. ఈ పాటను హిందుస్థానీ సంప్రదాయ ‘ఖమాస్‌’ రాగంతో మట్లుకట్టడం రాజేశ్వరరావు ప్రతిభకు పరాకాష్ట. ‘‘నీవు లేక వీణ పలుకలేనన్నది’’ అనే విరహ వల్లరి కూడా ఆత్రేయ రచనే. ‘మోహన’ రాగంలో పలికించిన ఈ పాట జగ్గయ్య రాక కోసం పరితపించే విరహిణి గీతం. ఇక ‘కీరవాణి’ రాగంలో స్వరపరిచిన మరో ఆత్రేయగీతం ‘‘ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలియైనారు’’ పాటను రెండుసార్లు చిత్రీకరించారు. మొదటి చిత్రీకరణ ఆదుర్తికి నచ్చలేదు. రెండవసారి సాగర్‌వద్ద, హైదరాబాద్‌ నౌబత్‌ పహాడ్‌ (ఇప్పుడు బిర్లా మందిరం వున్న చోటు) వద్ద షూట్‌ చేశారు. ‘‘నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళా’’ పాటను కూడా నౌబత్‌ పహాడ్‌, పబ్లిక్‌ గార్డెన్లలో జానకి బృందం, జగ్గయ్య-సావిత్రిల మీద చిత్రీకరించారు. ఇందులో గీతాంజలి చెల్లెలు స్వర్ణ కూడా నృత్యం చేసింది. దాశరథి రాసిన ‘‘ఓ ఉంగరాల ముంగురుల రాజా’’ పాటను పంజాబీ బాంగ్రా నృత్యంగా జానకి పుట్టినరోజు సందర్భంగా చిత్రీకరించారు. ఈ పాటకు స్వయంగా పంజాబీ అయిన నృత్యదర్శకులు హీరాలాల్‌ అతని భార్యతో కలిసి డ్యాన్‌ చెయ్యడం విశేషం.

ఇతర విశేషాలు..
1964 సంవత్సరానికి ‘డాక్టర్‌ చక్రవర్తి’ సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చలనచిత్రంగా ఎన్నికై రాష్ట్రపతి రజత పతకాన్ని గెలుచుకుంది. 1964లోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తమ చలనచిత్రాలకు నంది అవార్డులను ప్రవేశపెట్టింది. ప్రథమ బహుమతిగా తొలి బంగారు నంది పురస్కారం ఈ చిత్రానికే దక్కటం విశేషం. ‘డాక్టర్‌ చక్రవర్తి’ సినిమా 5 కేంద్రాల్లో 100 రోజులపైనే ఆడింది. నాగార్జునసాగర్‌ డ్యాం నిర్మాణ సమయంలో రవాణా కోసం నిర్మించిన వంతెన నీటి ఉధృతికి తెగిపోయి, కృష్ణానదిలోకి వరదలొచ్చాయి. మాచెర్ల ప్రాంతంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగటంతో శతదినోత్సవ కార్యక్రమాలను రద్దుచేసి, అన్నపూర్ణా సంస్థ యాజమాన్య తరఫున ముఖ్యమంత్రి సహాయనిధికి యాభైవేల రూపాయలు విరాళంగా ఇచ్చి తమ వితరణ చాటుకున్నారు. ఈ సినిమా విజయంతోనే అక్కినేని, ఆదుర్తి ‘చక్రవర్తి చిత్ర’ సంస్థను స్థాపించి ‘సుడిగుండాలు’, మరో ప్రపంచం’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించారు.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.