అరిషడ్వర్గాలకు మానవుడు ఎప్పుడూ దాసుడే. వాటిని నియంత్రణలో వుంచుకున్నంత వరకే అతడు సౌజన్యవంతునిగా మనగలుగుతాడు. నియంత్రణ కోల్పోయినప్పుడు అతడిలోని దానవగుణం వెర్రివెతలు వేస్తుంది. అసూయాద్వేషాలు విజృంభించి ఆ క్షణంలో క్షమార్హం కాని నేరానికి ఒడికడతాడు. తీరా అనర్ధం జరిగాక పశ్చాత్తాప పడినా ప్రాయశ్చిత్తం తప్పదు. ఈ నేపథ్యంలో గుండెల్లో మారుమోగే జీవన సత్యాలను ఆవిష్కరించిన మహోన్నత చిత్రరాజం రాజలక్ష్మీ ప్రొడక్షన్సు వారి ‘గుడిగంటలు’ చిత్రం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 1964న విడుదలై 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ‘గుడిగంటలు’ చిత్ర విశేషాలు కొన్ని.
చక్కని కథ...
వాసు (ఎన్.టి.ఆర్) సంపన్న యువకుడు. ఒంటరి జీవితం. తను పదేళ్ల వయసులో వుండగా ఒక ఆట బొమ్మ కోసం జతగాణ్ణి ఊబిలో తోసివేస్తే ఆ బాలుడు చనిపోతాడు. ఆ నేరఫలితంగా వాసు బాల్యం బాలనేరస్తుల పాఠశాలలో గడుస్తుంది. యుక్తవయస్సు వచ్చాక వాసు మాత్రం తప్పు చేశానన్న బాధతో ఏకాకి జీవితంతో సతమతమౌతుంటాడు. పశ్చాత్తాపంతో కుములుతూ మంచి వాడిననిపించుకునే ప్రయత్నం చేస్తాడు. తన తండ్రి ఆర్థిక సహాయంతో చదువుకున్న హరి (జగ్గయ్య) టెన్నిస్ సహచరునిగా వాసుకి పరిచయమౌతాడు. ఓటమిని తట్టుకోలేడనే వాసు మనస్తత్వం తెలుసుకొని, ఇద్దరూ ఆడిన ఒక టెన్నిస్ పోటీలో హరి కావాలనే ఓడిపోతాడు. విషయాన్ని అర్థం చేసుకున్న వాసు హరిని ప్రాణస్నేహితునిగా గుర్తించి, తన దివాణంలోనే వుంచుకొని, తనతో సమాన హోదా కల్పిస్తాడు. హరి తీవ్ర గాయాలకు లోనై ఆసుపత్రి పాలైనప్పుడు తన రక్తమిచ్చి ప్రాణదానం చేస్తాడు. అతడు ప్రేమించిన అమ్మాయితో వివాహం కూడా జరిపిస్తానని హామీయిస్తాడు. ఒకసారి వాసు తన ఎస్టేటుకు వెళ్లినప్పుడు కస్తూరి (కృష్ణకుమారి) తారసపడుతుంది. ఆపదలో వున్న ఆమె అక్క జీవితాన్ని నిలబెడతాడు. అప్రయత్నంగా కస్తూరికి మనసిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హరి, వాసు తరపున నిశ్చితార్థానికి నగలు తీసుకెళ్తాడు. పెళ్లికూతురు తను ప్రేమించిన కస్తూరి అని తెలుసుకొని హతాశుడౌతాడు. వాసు సుఖమే కోరి తన ప్రేమను త్యాగం చేసి, కస్తూరిని పెళ్లికి ఒప్పిస్తాడు. నిశ్చితార్థం తరువాత ఒకనాడు వాసు కస్తూరికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ, తన దూరపు బంధువు భద్రయ్య (రమణారెడ్డి) చేసిన కుట్రవలన ప్రమాదానికి గురై కాళ్ల చలనం కోల్పోతాడు. కస్తూరి తండ్రిని పిలిచి తను అవిటివాడినయ్యానని, ఆమెకు వేరే వివాహం జరిపించమని హితవు పలుకుతాడు. కానీ, కస్తూరి ఒప్పుకోదు. కస్తూరికి, హరికి పూర్వపు స్నేహసంబంధాన్ని చిలవలు పలవలుగా కల్పించి చెప్పి, భద్రయ్య వాసు మనసులో విషబీజాన్ని నాటుతాడు. అప్పుడు మరుగున వున్న అతని పైశాచికత్వం జూలు విదిలిస్తుంది. పిక్నిక్ వంకతో హరిని తీసుకెళ్లి అనుమానంతో అతడిని కొండమీద నుంచి తోసివేయ ప్రయత్నించినప్పుడు, త్యాగశీలైన హరి జరిగిన చేదు నిజాన్ని వాసుకి చెప్పి తనకుతానే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడతాడు. నిజం తెలుసుకున్న వాసు పశ్చాత్తాపపడి తనే కొండమీద నుంచి దూకేస్తాడు. సముద్ర జాలర్లు వాసుని రక్షిస్తారు. దూకిన షాకు వలన వాసుకి చచ్చుబడిన కాళ్ళు మళ్ళీ వస్తాయి. సత్యదర్శనంతో కస్తూరిని వాసు పెళ్లాడతాడు. గుడిగంటలు మంగళ ధ్వానాలు వినిపిస్తాయి.
విశేషాంశాలు...
తమిళనాడు, నిర్మాత పి.ఎస్.వీరప్పన్ నిర్మించిన ‘ఆలయమణి’ (1962) సినిమాని తెలుగులో రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ నిర్మాతలు సుందర్‌లాల్ నహతా, డూండేశ్వరరావులు ‘గుడిగంటలు’గా పునర్నిర్మించారు. తమిళ చిత్రానికి కె.శంకర్, తెలుగు చిత్రానికి వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు. కథా రచన జావర్ సీతారామన్ది కాగా తెలుగులో ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాసి ఉండటం చేత మళ్లీ ఆ అవకాశం అతనికే దక్కింది. వాహినీలో చిత్రనిర్మాణం జరుపగా, అవుట్ డోర్, క్లైమాక్స్ దృశ్యాలు కేరళ పశ్చిమ తీరంలో ‘వర్కేలా’ కొండప్రాంతంలో చిత్రీకరించారు. తమిళంలో ఈ చిత్రం సూపర్ హిట్. కానీ, ఎందుకో తెలుగులో ఆ విజయాన్ని అందుకోలేకపోయింది. మొదటి రోజు విజయవాడ, హైదరాబాద్ వంటి ముఖ్య కేంద్రాల్లో సూపర్‌హిట్ అనే టాక్ వచ్చినా తరువాత ఎందుకో వెనకడుగువేసింది. మొత్తం మీద ‘గుడిగంటలు’ సినిమా 92 రోజులు అడి సెంచరీ మిస్సయ్యింది. సినిమాలో వాసు, హరి ఇద్దరూ కృష్ణకుమారినే ప్రేమిస్తూ ఆ విశేషాలు చర్చించుకునే సన్నివేశంలో, గోడమీదకు కెమెరాను ఫోకస్ చేసి రెండు పులులు మధ్య ఒక లేడి చిత్రపటాన్ని దర్శకుడు సింబాలిక్ షాట్‌గా చూపడం చాలా బాగుంటుంది. ఈ సినిమాలో రామారావు పాత్ర కొంచెం శాడిజం, అసూయ, కరుణ, ప్రేమతత్వం, మానవత్వం, క్రీడాభిమానం వంటి వివిధ లక్షణాలతో సాగుతుంది. రామారావు ఎక్కువ భాగం శివాజీ గణేశన్ నటనే అనుకరించారు. పవిత్ర గుడిగంటల మోతలు ఆత్మహత్య చేసుకోవాలనే వ్యక్తి కోరికకు తెరదించటం అద్భుత ప్రక్రియ. తెలుగులో ఆశించినంత మేరకు విజయవంతం కాకపోయినా, కథ మీద వున్న నమ్మకంతో వీరప్పన్ హిందీలో ఇదే చిత్రాన్ని ‘ఆద్మీ’ (1968) పేరిట నిర్మించారు. అలనాటి సూపర్ స్టార్ దిలీప్ కుమార్, మనోజ్ కుమార్, వహిదా రెహమాన్ వంటి అగ్రశ్రేణి నటులు, నౌషాద్ వంటి సంగీత దర్శకులు సినిమాని తీర్చిదిద్దినా సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, ఎప్పటి నుండో దిలీప్‌తో నటించాలన్న మనోజ్ అభీష్టం మాత్రం నెరవేరింది. మనోజ్‌కి దిలీప్ కుమార్ అంటే ఎంత ఆరాధనంటే, 1949లో వచ్చిన ‘షబ్నం’ సినిమాలో దిలీప్ పేరు ‘మనోజ్’. ఆ పేరునే స్క్రీన్ పేరుగా మనోజ్ కుమార్ మార్చుకున్నారు. ఆర్థిక సమస్యలతో ‘లవకుశ’ చిత్రంలాగే ‘ఆద్మీ’ చిత్రం తయారవడానికి కూడా చాలాయేళ్లు పట్టింది. ఆ చిత్ర పరాజయానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. మానసిన విశ్లేషణతో కూడిన చిత్రాలు సాధారణంగా తక్కువగా వస్తాయి. ‘పునర్జన్మ’, ‘ఆత్మబలం’ చిత్రాల కోవలోకి వస్తుందీ సినిమా. తమిళ మాతృకకు బాగా దగ్గరగానే ఉండటంతో దర్శకునికి తన పనితనం చూపే అవకాశం ఎక్కువగా మిగలలేదు. ఉత్తమ చిత్రాల నిర్మాణానికి ఊతమిస్తూ, తెలుగు సినిమాను రాజధానికి తరలించే ప్రయత్నంలో భాగంగా 1965లో రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాలను ప్రవేశపెట్టింది. 1964లో విడుదలైన మూడు ఉత్తమ తెలుగు చిత్రాలకు 1965లో పెద్ద ఉత్సవం నిర్వహించి అవార్డులను ప్రదానం చేసింది. అప్పుడు ఇచ్చింది కేవలం మూడు అవార్డులే! అలా ‘డాక్టర్ చక్రవర్తి’కి స్వర్ణ నంది, ‘కీలుబొమ్మ’కి రజత నంది, ‘గుడిగంటలు’కి కాంస్య నంది బహుమతులు లభించాయి.

సంగీత సుగంధాలు...
‘గుడిగంటలు’ తమిళ మాతృకకి విశ్వనాథన్, రామ్మూర్తి సంగీతం అందించగా తెలుగులో ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఇందులో మొత్తం 6 పాటలున్నాయి. ఎక్కువ పాటలు తమిళం నుంచి స్ఫూర్తి పొందినవే. తమిళంలో పాటలన్నీ కణ్నదాసన్ రాసినవే. నిర్మాతల్లో ఒకరైన సుందర్‌లాల్ నహతాకు హిందీలో హిట్ అయిన పాటల్ని తన సినిమాల్లో పెట్టుకోవాలనే కోరిక. ‘అభిమానం’ సినిమాల్లో ‘‘ఓహో బస్తీ దొరసానీ’’, ‘శాంతి నివాసం’లో ‘‘రాధ రావే రాణీ రావే’’ వంటి పాటలు అలా చేయించుకున్నవే. సంగీత దర్శకునికి ఇష్టమున్నా లేకున్నా ‘‘కాపీ’’ పాటల్ని స్వరపరచక తప్పదు. ‘గుడిగంటలు’ సినిమా కూడా తమిళ పాటల వరసలనే ఘంటసాల తెలుగులో అనుసరించారు. కానీ హిందీలో తీసిన ‘ఆద్మీ’ చిత్రంలో నౌషాద్ తన స్వంత బాణీలతోనే పాటలు రక్తి కట్టించారు. ‘‘న ఆద్మీ కా కోయీ భరోసా’’, ‘‘ఆజ్ పూరానీ రాహోం సే’’ పాటలు అలాంటివే. అనిసెట్టి రాసిన ‘‘జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా.. మంచి గెలిచి మానవుడిగ మారినానురా’’ పాట, పరిపూర్ణత్వం సంతరించుకున్న తరువాత ఎన్.టి.ఆర్. పాడేది. తమిళంలో ‘‘సత్తి సుత్తదడా కయ్యి విత్తదడా’’ అనే సౌందర్ రాజన్ పాడిన గీతానికి, స్వరానికి స్వేచ్ఛానువాదమే బాగా హిట్టయిన ఈ పాట. ఎన్.టి.ఆర్ అనుభవించిన వేదనంతా ఈ పాటలో కళ్లకు కట్టిన అనుభూతి కలుగుతుంది. మొదటి చరణంలో ‘‘స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా, బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా.. దైవశక్తి మృగత్వమునే సంహరించెరా, సమరభూమి నా హృదయం శాంతి పొందెరా’’; రెండో చరణంలో ‘‘క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా, బుసలుకొట్టి గుండెలోన విషముగ్రక్కెరా... ధర్మజ్యోతి తల్లివోలె ఆదరించెరా, నా మనసే దివ్యమందిరముగా మారిపోయెరా’’ అని తను గెలిచిన అరిషడ్వర్గాల దివ్యస్వరాన్ని గుడిగంటలుగా వినిపించేలా ఆలపించిన పాట చిత్రానికి హైలైట్. ఈ పాటను తమిళంలో ఉన్నట్లే, అదే లొకేషన్లో చిత్రీకరించారు. మధ్యాహ్న సమయంలో పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, ఎన్.టి.ఆర్. గెడ్డానికి అంటించిన గమ్ వలన ఇబ్బంది కలిగినా, ఆ బాధను భరిస్తూ ఎన్.టి.ఆర్. ఈ సన్నివేశంలో అద్భుతంగా నటించారు. ఇంకో పాట ఆత్రేయ రచన. తమిళ ట్యూను ‘‘పున్నై విరుంబుం బూమియిలే’’కి దగ్గరలోనే శంకారాభరణ ఛాయల్లో సాగే ‘‘ఎవరికి వారౌ స్వార్థంలో, హృదయాలరుదౌ లోకంలో... నాకై వచ్చిన నెచ్చెలివే, అమృతం తెచ్చిన జాబిలివే’’ పాట మధ్యలో ‘‘గంటలు గణగణ మ్రోగాయి’’ అనే పదాలను కూర్చి నిండుదనాన్నితెచ్చారు ఆత్రేయ. ఆరుద్ర రాయగా సుశీల పాడిన ‘‘దూరానా నీలి మేఘాలు, నాలోన కొత్త భావాలు’’ పాట కూగా తమిళ ట్యూనే. ‘‘మానాట్టం తంగ మగిలాట్టం’’ అనే మాతృక సుశీల పాడింది. ఇది చాలా హిట్టైన పాట. ప్రకృతి సోయగాలను తనకు అన్వయించుకుంటూ కృష్ణకుమారి పాడే సాధారణ పాట. సినారె గీతం ‘‘నీలికన్నుల నీడలలోనా, దోరవలపుల దారుల లోనా... కరిగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో’’ చిత్రం మొదట్లో వచ్చే యుగళగీతం. పి.బి.శ్రీనివాస్, సుశీల పాడిన ఈ పాటను జగ్గయ్య, కృష్ణకుమారిల మీద చిత్రీకరించారు. ముందు చెప్పినట్టు ఇది సుందర్‌లాల్ నహతా ఛాయిస్. ‘ఉజాలా’ సినిమాలో శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చి, మన్నాడే, లతా మంగేష్కర్ పాడిన ‘‘ఝాంతామౌసం మస్త్ మహీనా, చాంద్ సి గోరీ ఏక్ హసీనా’’ పాటకు మక్కికి మక్కీ కాపీ స్వరమే! కానీ ఘంటసాల సింధుభైరవి రాగంలో ఈ పాటకు తెలుగుదనాన్ని జోడించగలిగారు. పాట కూడా పెద్ద హిట్టై నిలిచింది. మరో పాట ‘‘నీ కనుదోయిని, నిద్దురనై, మనసున పూచే శాంతినై... ఎడబాయని నీడగా తోడౌతా, నీ కలలకు నేనే జోడౌతా’’ పాట నార్ల చిరంజీవి రచన, జానకి ఆలాపన. తమిళంలో ‘‘తూక్కవున్ కన్గలై తరువట్టమే’’ పాట కూడా జానకి పాడిందే. ఈ పాటల ట్యూనులు కూడా ఒక్కటే. దాశరథి రాసిన ‘‘నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో... ఏ కవి భావనవో’’ ఒక భావ గీతం. ఇందులో నండూరి ఎంకి, విశ్వనాథ కిన్నెరసాని, బాపిరాజు శశికళ, ఉమర్ ఖయ్యాం సాకీ, కాళిదాసు శకుంతల అందాలను ప్రేయసికి అన్వయిస్తూ పాడే ఘంటసాల గీతం వీనుల విందుగా వుంటుంది. ఇలా ఘంటసాల స్వరపరచిన పాటలన్నీ హిట్లైనాయి. ఇహానికి, పరానికి పనికొచ్చే సాహిత్యాన్ని సృష్టించే అవకాశమున్న సినిమాలు ఎప్పుడోగానీరావు. పాటలు ఇంచుమించు ట్యూన్లకి రాసినవే. అయినా అవి సాహిత్యానికి ఉపకరిస్తూ, ప్రేరణ కలిగించే విధంగా ఈ సినిమాలో ఒదిగాయి. అమృతతుల్యమైన ఆనందాన్ని కలుగజేస్తాయి!
ముక్తాయింపు...
మనిషి ఎంత సంస్కార సంపన్నుడైనా సహజంగా వుండే స్వార్థం తనలో ప్రజ్వరిల్లినప్పుడు ఎంతటి అమానుష కృత్యాన్నయినా చెయ్యడానికి వెనుకాడడు. మానవత్వం కానీ, విచక్షణా జ్ఞానం కానీ ఆ సమయంలో స్ఫురణకు రానేరావు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనే నీతిని గుర్తుచేసే సందేశాత్మక చిత్రం ‘గుడిగంటలు’.
- ఆచారం షణ్ముఖాచారి