కోర మీసం.. కోరి ఇచ్చిన వేషం!
ప్రతీ బియ్యం గింజ మీదా తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. సినిమా వేషానికీ ఇది వర్తిస్తుందేమో. వేయబోయే వేషం మీద ఆ పాత్రధారి పేరు రాసి ఉంటుంది కాబోలు. కె.విశ్వనాథ్‌ కథే అందుకు ఉదాహరణ. గాయకుడు బాలు ‘శుభ సంకల్పం’ చిత్రం స్క్రిప్ట్‌ సమయంలో అందులోని రాయుడు పాత్ర డైలాగ్స్‌ని దర్శకుడు కె.విశ్వనాథ్‌ వివరించిన తీరుకు ముగ్ధుడై ఆయన్ని ఒప్పించి ఆ వేషాన్ని బలవంతంగా ఆయన చేతనే వేయించడం, ఆ తర్వాత విశ్వనాథ్‌ నటుడుగా కొనసాగడం తెలిసిందే! అదే విశ్వనాథ్‌ ‘కలిసుందాం రా’ చిత్రంలో వేషం వెయ్యడం కూడా అనుకోకుండా జరిగింది. ఆ చిత్రంలో హీరో వెంకటేష్‌ తాత పాత్ర పేరు వీర వెంకట రాఘవయ్య. ఆ పాత్ర కోసం చాలా మందిని ఆలోచించిన నిర్మాత సురేశ్‌బాబుకు ఎవరూ నచ్చలేదట. చివరికి షూటింగ్‌ దగ్గర పడటంతో రాజీ పడి సత్యనారాయణను ఎంపిక చేయాల్సివచ్చిందట. అయితే సురేశ్‌బాబుకి లోలోపల ఏదో వెలితిగానే అనిపించిందట. ఆ నేపథ్యంలో ఓ రోజు దర్శకుడు కె.విశ్వనాథ్‌ తమ బంధువులకు రామానాయుడు స్టూడియోను చూపించాలని తీసుకువచ్చారట. అప్పట్లో ఆయన కోరమీసాలు పెంచేవారు. వాటితో కొత్తగా కనిపించిన విశ్వనాథ్‌ని చూడగానే సురేశ్‌ బాబుకి తాను ఊహించుకున్న ‘వీర వెంకట రాఘవయ్య’ పాత్ర ప్రత్యక్షమైనట్లు అనిపించిందట. ‘నిర్మాత తలచుకుంటే వేషానికి కొదవా?’. వెంటనే సురేశ్‌బాబు అప్పటికప్పుడు విశ్వనాథ్‌ని ఒప్పించారట. ఆ తర్వాత ప్రేక్షకుల్ని మెప్పించి, మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి రప్పించడం విశ్వనాథ్‌ వంతయింది.


© Sitara 2018.
Powered by WinRace Technologies.