‘మేజర్‌ చంద్రకాంత్‌’ కోసం పరుచూరిని ఎన్టీఆర్‌ కొట్టారట!

నందమూరి తారక రామారావు కథానాయకుడుగా 1993లో వచ్చిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుతం అది. కథ, మాటలు పరుచూరి సోదరులు అందించారు. అప్పటికే ఎన్నో సినిమాలకు కథలు రాసినా.. వీళ్లు ఇలాంటి గొప్ప చిత్రానికి కథ రాసేందుకు చాలా సమయం తీసుకుని ఉంటారనుకోవచ్చు. కానీ, ఈ చిత్రం విషయంలో అలా జరగలేదు. ఎన్టీఆర్‌ పరుచూరి గోపాలకృష్ణను కొట్టడం వల్లే ఈ కథ వెండితెరపై ఆవిష్కరించుకుంది. అప్పట్లో అగ్ర కథానాయకుడుగా ఉన్న ఎన్టీఆర్‌ రచయితను కొట్టడమేంటి అనుకుంటున్నారా? సీరియస్‌గా కాదండోయ్‌. అసలు విషయం ఏంటంటే.. పరుచూరి సోదరులతో కథ రాయించుకోవాలని ఎన్టీఆర్‌ ఎప్పటి నుంచో అనుకునేవారట. కానీ, వాళ్లు ఏం సమాధానం ఇచ్చేవారు కాదు. ఈ నేపథ్యంలో పరుచూరి ఓ వేడుకకు హాజరవ్వగా అదే సమయంలో ఎన్టీఆర్‌ అక్కడకు వెళ్లారట.


ఆ క్షణంలో ఎన్టీఆర్‌ను చూసిన గోపాలకృష్ణ ఏమకున్నారో ఆయన మాటల్లో.. ‘ఆయన మళ్లీ కథ అడుగుతారనే భయంతో మేము కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించాం. కానీ, ఆయన అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చి కొట్టారు. ఏం బ్రదర్స్‌ కథ ఏమైంది? అన్నారు. సిద్ధం కాలేదని చెప్తే ఈ సారి ఏం చేస్తారో అని అయిపోయింది అని సమాధానం చెప్పా’ అని ఓ సందర్భంలో గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. దీంతో అసలు నిద్రపోకుండా సోదరులిద్దరూ రాత్రంతా చర్చించుకుని కథ రాశారట. ఇదీ ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా తెరకెక్కడానికి ప్రధాన కారణం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.