హంపీలో ఊపిరి... దృశ్యకావ్యం ‘మల్లీశ్వరి’

తె
లుగు చలనచిత్ర ప్రస్థానంలో మైలురాయి వాహినీ వారి ‘మల్లీశ్వరి’ (20-12-1951). ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు రాసిన ‘రాయల కరుణ కృత్యము’ రేడియో నాటికను, అదే విధంగా అప్పటి ఆంగ్ల పత్రిక ‘ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ’లో వెలువడ్డ ఓ కథనూ ఆధారంగా చేసుకుని కళాత్మక దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన వీటిని చదవక మునుపే కృష్ణదేవరాయల కాలాన్ని నేపథ్యంగా తీసుకోవాలన్న ఆలోచనకు 1938 నాటి ఒక సంఘటన స్ఫూర్తినిచ్చిందని అంటారు. వాహినీ సంస్థ కోసం బి.ఎన్‌.రెడ్డి తీసిన మొదటి చిత్రం ‘వందేమాతరం’ (1939). నాగయ్య, కాంచనమాల ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రంలో కథానాయకుడు మిత్రులతో కలసి హంపీకి వెళ్లే సన్నివేశాలున్నాయి. వాటి చిత్రీకరణ కోసం ఆ చారిత్రక నగరానికి తన బృందంతో పాటు వెళ్లిన బి.ఎన్‌.రెడ్డి అక్కడి విరూపాక్ష దేవాలయాన్ని సందర్శించారట. ఆ సందర్భంలో భావుకుడైన బి.ఎన్‌.రెడ్డికి ‘‘ఎప్పుడో వందల ఏళ్ల క్రితం ఆంధ్రభోజుడు విరూపాక్ష స్వామిని దర్శించుకున్న ప్రదేశంలోనే నేనూ నిలబడి ఉన్నాను కదా!’’ అనిపించింది. ఒక చిత్రమైన అనుభూతి కలిగిందట. అది అక్కడితో ఆగిపోకుండా, కృష్ణదేవరాయల కాలం నాటి ఇతివృత్తంతో చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనకు విత్తునాటిందట. 1938 నాటి ఆలోచన కార్యరూపం ధరించడానికి పదమూడేళ్లు పట్టింది. ఆలోగా ఆయన ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941), ‘స్వర్గసీమ’ (1945) చిత్రాల్ని నిర్మించారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.