మను‌షుల మమ‌తల గుర్తు‌చే‌సిన చిత్రం
మహా‌కవి శ్రీశ్రీ ఒకా‌నొక సంద‌ర్బంలో తనను విమ‌ర్మిం‌చిన ఒక సినీ‌కవి కౌశ‌లాన్ని దుయ్య‌బ‌డుతూ ‌‘‌‘పీఏ‌పీలో రాసిన ఒక సగం పాట కతి‌కేవు.‌.‌ ఎందుకు నీ నీతులు నా ఎంగిలి తిని బ్రతి‌కేవు’‌’‌ అని రాశారు.‌ ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థకు ఆ మహా‌కవి ఇచ్చిన ప్రాము‌ఖ్యత అలాం‌టిది.‌ యల్వీ ప్రసాద్‌ నిర్థే‌శ‌క‌త్వంలో వచ్చిన ‌‘‌‘పెంపుడు కొడుకు’‌ (1953) నుంచి 1992 లో వచ్చిన ‌‘పోలీస్‌ బ్రదర్స్‌’‌ దాకా పీఏపీ సంస్థ ఇరవై సిని‌మా‌లకు పైగా నిర్మిం‌చింది.‌ ఇల్ల‌రికం, భార్యా‌భ‌ర్తలు, కుల‌గో‌త్రాలు పున‌ర్జన్మ సిని‌మాలు.‌.‌ వేటి‌కవే ఆణి‌ము‌త్యాలు.‌ ఈ సంస్థ అధి‌నేత ఏ.‌వి.‌ సుబ్బా‌రావు అభి‌రుచి గల నిర్మాత.‌ అక్కి‌నేని నాగే‌శ్వ‌ర‌రావు ఈ సంస్థకు మూల స్థంభం.‌ రెండు జాతీయ అవార్డు చిత్రా‌లను రూపొం‌దిం‌చిన ప్రత్య‌గాత్మ చేతి మీదనే 1965 లో ‌‘మను‌షులు−‌ మమ‌తలు’‌ సినిమా నిర్మించి మరొక జాతీయ అవా‌ర్డును సొంతం చేసు‌కుంది పీఏపీ సంస్థ.‌ తెలు‌గులో సెన్సారు వారు మొద‌టి‌సారి ‌‘ఎ’‌ సర్టి‌ఫి‌కేటు మంజూ‌రు‌చే‌సిన ఈ సినిమా 27, ఆగస్టు 1965న విడు‌దలై యాభై సంవ‌త్స‌రాల చరి‌త్రను మూట‌క‌ట్టు‌కుంది.‌ మాన‌వీయ విలు‌వ‌లకు పట్టం‌క‌ట్టిన ఈ చిత్ర విశే‌షాలు కొన్ని.‌.‌.‌

* సినిమా కథ.‌.
జమీం‌దారు రాజా‌రావు (గుమ్మడి) ఏకైక కూతురు రాధ (సావిత్రి) వర‌దల్లో సర్వస్వం కోల్పో‌యిన వేణు (అక్కి‌నేని), అతని తల్లిని రాజా‌రావు చేర‌దీ‌స్తాడు.‌ వేణు ఇంజ‌నీరు కావా‌లని పట్టు‌బట్టి చదు‌వు‌తాడు.‌ రాధకు వేణు అంటే అభి‌మానం.‌ అతని మీద అను‌రాగం పెంచు‌కుం‌టుంది.‌ కానీ ఇంజ‌నీరు కావా‌లనే దీక్షలో రాధ మను‌సుని వేణు అర్థం చేసు‌కో‌లే‌క‌పో‌తాడు.‌ రాధ పుట్టి‌న‌రోజు రాజా‌రావు మేన‌ల్లుడు శేష‌గిరి (ప్రభా‌క‌ర‌రెడ్డి) రాధకు కాను‌కగా సెంటు సీసా అని భ్రమిం‌చేలా బ్రాందీ సీసా బహు‌క‌రి‌స్తాడు.‌ రాజా‌రా‌వుకు కోప‌మొచ్చి శేషుని బయ‌టకు పంపి, తన కూత‌రితో అత‌నికి వివాహం జర‌గ‌దని ప్రక‌టి‌స్తాడు.‌ దాంతో రాజా‌రావు కుటుంబం మీద శేష‌గిరి పగ పడ‌తాడు.‌ రాజా‌రావు స్నేహి‌తుడు చీఫ్‌ ఇంజ‌నీరు గోపా‌ల‌రావు (రమ‌ణా‌రెడ్డి) అన్న‌కొ‌డుకు బాస్కర్‌ (జగ్గయ్య)తో రాధ పెళ్లి జరు‌గు‌తుంది.‌ వేణును ఇంజ‌నీ‌రింగు చది‌విం‌చేం‌దుకు రాధ పట్నంలో వున్న గోపా‌ల‌రావు ఇంటిలో అత‌నికి బస ఏర్పాటు చేస్తుంది.‌ వేణు మంచి‌తనం, అమా‌య‌కత్వం గోపా‌ల‌రావు కూతురు ఇందిర (జయ‌ల‌లిత)ను ఆక‌ర్షి‌స్తుంది.‌ వేణుని ఇందిర ప్రేమి‌స్తుంది.‌ రాజా‌రావు మీద పగ‌బ‌ట్టిన శేషు రాధ భర్త భాస్క‌ర్‌తో స్నేహం కలిపి అత‌నికి మద్యాన్ని, రాణి (రాజశ్రీ) అనే విటు‌రాలి సాంగ‌త్యాన్ని అల‌వాటు చేస్తాడు.‌ రాధ జీవితం చీకటి మయ‌మ‌వు‌తుంది.‌ భర్తను మంచి‌త‌నంతో దారికి తెచ్చు‌కు‌నేం‌దుకు రాధ ప్రయ‌త్నిం‌చినా అత‌డిని వ్యస‌నాల నుండి బయట పడే‌యడం అసా‌ధ్యంగా మారు‌తుంది.‌ చివ‌రకి వ్యాపారం కూడా శేష‌గిరి చేతి‌లోకి వెళ్లి‌పో‌తుంది.‌ వేణుకు విద్య పూర్తి‌చే‌సు‌కో‌గానే సాగర్‌ డ్యాంలో గోపా‌ల‌రావు వద్దే ఉద్యోగం లభి‌స్తుంది.‌ శేష‌గిరి కాంట్రా‌క్టులో చేసిన అవ‌క‌త‌వ‌క‌లకు బిల్లు మంజూరు కాక‌పో‌వ‌డంతో శేష‌గిరి పగ‌బట్టి డ్యామ్‌కు బాంబు పెడ‌తాడు.‌ దానిని వేణు భగ్నం‌చేసి డ్యామ్‌కు జర‌గ‌బోయే ప్రమా‌దాన్ని నివా‌రి‌స్తాడు.‌ చివ‌రకు బాస్క‌ర్‌కు బార్య త్యాగ‌ని‌రతి, వేణు మంచి‌తనం తెలిసి మార‌తాడు.‌ వేణుకు ఇంది‌రకు వివాహం జర‌గ‌డంతో సినిమా సుఖాం‌త‌మ‌వు‌తుంది.‌

* ప్రత్య‌గాత్మ ప్రతిభ..
ఈ సినిమా విశే‌షాలు చెప్పు‌కునే ముందు ప్రత్య‌గాత్మ గురించి కొంచెం తెలు‌సు‌కో‌వాలి.‌ రాజ‌కీ‌యో‌ద్యమం వైపు మొగ్గు చూపిన ప్రత్య‌గాత్మ చద‌వుకు స్వస్తి చెప్పి గుంటూరు నుంచి వెలు‌వడే ‌‘నవ‌యుగ’‌ పత్రి‌కలో కొంత‌కాలం పని‌చే‌శారు.‌ నలభై దశ‌కంలో జరి‌గిన కమ్యూ‌నిస్టు భూపో‌రా‌టంలో అరె‌స్ట‌యిన నెల‌రో‌జుల పాటు రాజ‌మండ్రి కేంద్ర కారా‌గా‌రంలో జైలు శిక్ష అను‌బ‌విం‌చారు.‌ ‌‘ప్రజా‌శక్తి’‌ పత్రి‌కకు విలే‌ఖ‌రిగా పని‌చే‌శారు.‌ తరు‌వాత మద్రాసు చేరి ‌‘జ్వాల’‌ పత్రిక మొద‌లె‌ట్టారు.‌ ప్రజా నాట్య‌మం‌డలి కార్య‌క్రమాల ద్వారా ప్రముఖ సినీ‌ద‌ర్శ‌కుడు తాతి‌నేని ప్రకా‌శ‌రావు సాంగత్యం దొరి‌కింది.‌ ఆయన ప్రత్య‌గాత్మ చేత ‌‘నిరు‌పే‌దలు’‌ సిని‌మాకి కథ రాయిం‌చారు.‌ జయం‌మ‌నదే, ఇల్ల‌రికం సిని‌మా‌లకు ప్రత్య‌గాత్మ సహా‌య‌ద‌ర్శ‌కు‌డిగా పని‌చే‌శారు.‌ ‌‘మాయింటి మహా‌లక్ష్మి’‌ చిత్రా‌నికి సంభా‌ష‌ణలు కూర్చారు.‌ పీఏపీ సంస్థ నిర్మాత ఏ.‌వి.‌ సుబ్బా‌రావు తొలి‌సారి భార్యా‌భ‌ర్తలు సినిమా దర్శ‌క‌త్వ‌బా‌ధ్య‌తలు ప్రత్య‌గా‌త్మకు అప్ప‌గిం‌చారు.‌ ఒక తమిళ నవల ఆధా‌రంగా ప్రత్య‌గాత్మే ఆ సిని‌మాకు కథ −‌ స్కీన్‌ప్లే సమ‌కూర్చి సిని‌మాను సూప‌ర్‌హిట్‌ చేశారు.‌ 1961 ప్రాంతీయ చిత్రాల కేట‌గ‌రీలో ‌‘భార్య‌భ‌ర్తలు’‌ సిని‌మాకు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి రజత పతకం లభిం‌చింది.‌ 1962లో అదే సంస్థ నిర్మిం‌చిన ‌‘కుల‌గో‌త్రాలు’‌ సిని‌మా‌కూడా విజ‌య‌వం‌తమై జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ప్రశం‌సా‌పత్రం గెలు‌చు‌కుంది.‌ తర‌వాత వర‌సగా ‌‘పున‌ర్జన్మ’‌ ‌‘మంచి‌మ‌నిషి’‌ సిని‌మా‌లకు పని‌చే‌శాక 1965లో ‌‘మను‌షులు −‌ మమ‌తలు’‌ సిని‌మాకు దర్శ‌కత్వం వహిం‌చారు.‌ ఈ సిన‌మాకు కూడా జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ప్రశం‌సా‌ప‌త్రాన్ని సాదించి పెట్టిన ఘనత ప్రత్య‌గా‌త్మదే.‌ హిందీలో ప్రత్య‌గాత్మ దర్శ‌కత్వం వహిం‌చిన ‌‘చోటా భాయి’‌ ‌‘రాజా అవుర్‌ రంక్‌’‌ సిని‌మాలు కూడా మంచి విజయం సాధిం‌చాయి.‌

* సినిమా విశే‌షాలు..
‌‘చదు‌వు‌కున్న అమ్మా‌యిలు’‌ చిత్రం ద్వారా తొలి‌సారి సినిమా ప్రపం‌చం‌లోకి అడు‌గు‌పె‌ట్టిన యుద్ద‌న‌పూడా సులో‌చ‌న‌రాణి ‌‘మను‌షులు−‌మమ‌తలు’‌ సిని‌మాకు కథ సమ‌కూ‌ర్చగా ఆచార్య ఆత్రేయ సంభా‌ష‌ణలు రాశారు.‌ 1962లో వచ్చిన గురు‌దత్‌ సినిమా సాహెబ్‌ బిబి‌అ‌వుర్‌ గులాం’‌లోని కొన్ని సన్ని‌వే‌శాలు ఈ సిని‌మాకు ప్రేరణ.‌ సినిమా చూస్తే ఒక విషయం స్ఫుర‌ణకు రాక‌మా‌నదు.‌ అదే మహా‌నటి సావిత్రి జీవితం మాత్రం దుః‌ఖ‌మయం! అంతే తేడా.‌ సిని‌మాలో సావిత్రి కేవలం కంటి ద్వారా, పెద‌వుల ద్వారా చూపిన అభి‌నయం అపూర్వం.‌ ఇందులో అక్కి‌నే‌నికి సావిత్రి ఇడ్లీలు తిని‌పించే సన్ని‌వే‌శ‌మొ‌క‌టుంది.‌ ‌‘తిని‌పిం‌చాలేం పాపం’‌’‌ అంటూ గోముగా తిని‌పిస్తూ అమా‌య‌కపు ప్రేమను వ్యక్తి‌క‌రి‌స్తు‌న్న‌ప్పుడు ఆమె చూపే హావ‌భా‌వా‌లను అక్కి‌నేని అర్థం చేసు‌కో‌లేక పోవడం ఈసి‌ని‌మాకు మలుపు.‌ ఇక జయ‌ల‌లిత విష‌యా‌నికి వస్తే ఆమెను హీరో‌యి‌న్‌గా చిత్రసీ‌మకు పరి‌చయం చేసింది.‌ దర్శ‌క‌ని‌ర్మాత శ్రీధర్‌ తన ‌‘వెన్ని‌రాడై’‌ సిని‌మాలో తర‌వాత సినిమా ‌‘మను‌షులు −‌ మమ‌తలు’‌ ఈ సిన‌మాలో నటిం‌చే‌నా‌టికి జయ‌ల‌లిత వయసు కేవలం 16 సంవ‌త్స‌రాలే! నిర్మాత ఏ.‌వి.‌ సుబ్బా‌రా‌వుకు జయ‌ల‌లిత తల్లి సంధ్య అంటే అభి‌మానం.‌ ఆ అభి‌మా‌నం‌తోనే జయ‌ల‌లిత ఈ సిని‌మాలో ఏకంగా అక్కి‌నేని సర‌సన నటిం‌చ‌గ‌లి‌గింది.‌ ‌‘పొండి డాడీ’‌’‌ అంటూ గోముగా ఆమె పలికే చిలక పలు‌కులు సినిమా విజ‌యా‌నికి సహ‌క‌రిం‌చాయి.‌ ఇందులో మమ‌తల విలు‌వలు పెంచే ఆత్రేయ డైలాగు ఒక‌టుంది.‌ ‌‘‌‘ఏమి సుఖ‌ముం‌దని యిలా తాగు‌తారు? ఇకపై దాని జోలికి పోను అన్న‌వా‌ళ్లం‌తా‌తా‌గు‌డుకి బాని‌స‌లై‌న‌వాళ్లే.‌ చెడి‌పో‌వ‌డా‌నికి డబ్బే కార‌ణ‌మైతే డబ్బు‌లే‌ని‌వాడు ఎందుకు చెడి‌పో‌తు‌న్నాడు? మని‌షిని డబ్బుతో కట్టే‌యలేం.‌ మన‌సుతో, మమ‌తతో తప్ప’‌’‌ అని.‌ ఇలాంటి ఆలతి పదా‌లతో ఆత్రేయ చెప్పిన వేదాంత రహ‌స్య‌మిది.‌ ఇంత పెద్ద సిని‌మాలో కామెడీ కొరత మాత్రం పెద్దదే.‌ రమ‌ణా‌రెడ్డి, ‌‘ఓయ్‌.‌.‌.‌ ఓయ్‌’‌ అనే ఊత‌పదం మాత్రమే ఇందులో కామెడీ.‌ హైందవ స్త్రీ మద్యం ముట్టు‌కో‌వడం మన ఆచా‌రం‌కాదు.‌ కానీ భర్తను వెల‌యా‌లికి దూరంగా ఉంచా‌లని, మద్యం మత్తు‌నుంచి రక్షిం‌చు‌కో‌వా‌లని, తనే మద్యం పుచ్చు‌కోని భర్త కోరిక తీర్చడం ఈ సిని‌మాలో సావిత్రి చేసే సాహసం.‌ ఈ సన్ని‌వేశం సిని‌మాకు అవ‌సరం.‌ అందుకే దీన్ని తొల‌గిం‌చ‌లేక, సెన్సారు వారు ‌‘ఆడల్ట్‌’‌ సర్టి‌పి‌కేట్‌ ఇచ్చారు.‌ ఈ సర్టి‌ఫి‌కేటు పొందిన తొలి తెలుగు సినిమా ‌‘మను‌షులు−‌ మమ‌తలు’‌.‌ సావిత్రి ఈ సన్ని‌వే‌శంలో నటిం‌చ‌డా‌నికి సాహెబ్‌ బిబి అవుర్‌ గులాం’‌ సిని‌మాలో మీనా‌కు‌మారి నటిం‌చిన ‌‘న జావో సయ్యా.‌.‌ఛడాకు భయ్యా’‌’‌ పాట ప్రేరణ.‌ అక్కి‌నే‌నిని ఆట‌ప‌టిస్తూ అర్థ‌నగ్న దుస్తుల్లో స్విమ్మిం‌గ్‌ఫూ‌ల్‌లో జయ‌ల‌లిత నర్తిం‌చడం కూడా ‌‘అడల్ట్‌’‌ సర్టి‌ఫి‌కేటు ఇచ్చేం‌దుకు దోహ‌ద‌ప‌డింది.‌ ప్రత్య‌గా‌త్మకు మూడు జాతీయ అవా‌ర్డులు తెచ్చి‌పె‌ట్టిన సిని‌మాల్లో మను‌షులు−‌ మమ‌తలు మూడ‌వది.‌ ఈ సిని‌మాకు అసో‌సి‌యే‌షట్‌ దర్శ‌కు‌డిగా వ్యవ‌హ‌రిం‌చిన తాతి‌నేని రామా‌రావు తద‌నం‌త‌ర‌కా‌లంలో విజ‌య‌వం‌త‌మైన దర్శ‌కు‌నిగా ఎద‌గ‌డమే కాకుండా అనేక హిందీ సిని‌మా‌లకు కూడా దర్శ‌కత్వం వహించి మంచి పేరు తెచ్చు‌కు‌న్నారు.‌ సినిమా మొత్తాన్ని హైద‌రా‌బా‌దులో శ్రీ సారథి స్టూడి‌యోలో నిర్మిం‌చారు.‌ కళా‌ద‌ర్శ‌కులు టి.‌వి.‌యస్‌ శర్మ.‌ బాపు, కేతా వంటి ముగ్గురు నిష్ణా‌తులు ఈ సిని‌మాకు పబ్లి‌సిటీ ఆర్టి‌స్టు‌లుగా పని‌చే‌యడం కూడా అపూ‌ర్వమే.‌ వ్యాపా‌ర‌ప‌రంగా కూడా విజ‌య‌వం‌త‌మైన చిత్రం మను‌షులు−‌మమ‌తలు దేశ‌రక్షణ కోసం ప్రాణా‌లొ‌డ్డు‌తున్న వీర‌జ‌వా‌నుల సంక్షేమం కోసం జోలి‌కట్టి నిధుల సేక‌రణ చేస్తున్న నట‌రత్న యన్టీ‌రా‌మా‌రావు విజ‌య‌వా‌డలో అడు‌గు‌పె‌ట్టిన రోజే ఈ సినిమా అలం‌కార్‌ టాకీ‌సులో వంద‌రో‌జులు పూర్తి‌చే‌సు‌కో‌వడం విశేషం.‌ మొత్తం‌మీద మను‌షులు −‌ మమ‌తలు సినిమా నాలుగు కేంద్రా‌లలో వంద‌రో‌జుల పండగ జరు‌పు‌కుంది.‌

* చల‌పతి రుస‌గు‌ళి‌కలు..
ఈ చిత్రా‌నికి సంగీత స(స్వ)రాలు కూర్చింది తాతి‌నేని చల‌ప‌తి‌రావు.‌ ఇత‌నిది కూడా ప్రజా‌నాట్య మండలి నేప‌థ్యమే.‌ కొంత‌కాలం సాలూరు రాజశ్వ‌ర‌రావు వద్ద సహా‌య‌కు‌డిగా పని‌చేసి, ‌‘అమ‌ర‌దీపం’‌ సిని‌మాతో పూర్తి‌స్థాయి సంగీ‌త‌ద‌ర్శ‌కు‌నిగా ఎది‌గారు.‌ తరు‌వాత ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్సు వారి ‌‘ఇల్ల‌రికం’‌ సిని‌మాకు అద్భు‌త‌మైన సంగీతం సమ‌కూ‌ర్చారు.‌ ఆ సినిమా సూపర్‌ హిట్టై 200 రోజు‌లకు పైగా ఆడ‌డంతో చల‌ప‌తి‌రావు పీఏ‌పీకి ఆస్థాన సంగీత దర్శ‌కు‌డ‌య్యారు.‌ ఈ సిన‌మాలో మొత్తం తొమ్మిది పాట‌లు‌న్నాయి.‌ ‌‘‌‘ఒంట‌రిగా వున్నా‌రంటే ఒంటికి మంచిది కాదు’‌’‌ పాటను ఆత్రేయ రాయగా సుశీల సావిత్రి కోసం పాడింది.‌ ఇందులో అక్కి‌నేని ఆశ‌యా‌లను గుర్తు‌చేస్తూ ‌‘‌‘వంతెన వేస్తావు.‌.‌ వారధి కడ‌తావు.‌ వంతెన చేసి వారధి కట్టి ఇంజ‌నీ‌రు‌వు‌తావు.‌ మనసూ మన‌సుకు మమ‌తల వంతెన వేశా‌వంటే మని‌షౌ‌తావు’‌’‌ అంటూ తన ప్రేమను తెలు‌పు‌తుంది.‌ కానీ చదు‌వులో నిమ‌గ్న‌మైన అక్కి‌నేని సావిత్రి మనసు గ్రహిం‌చ‌లేదు.‌ ‌‘‌‘ఇనుప తలు‌పుల ఆన‌క‌ట్టకు వర‌దలు ఆపే‌స్తావు.‌ వలపు తల పూలు, వయసు పొంగులు ఉర‌కలు వేస్తే ఏంజే‌స్తావు’‌ అంటూ సాంకే‌తిక బాషలో పాట సాగు‌తుంది.‌ ఇక దాశ‌రథి రాసిన ‌‘వెన్నె‌లలో మల్లి‌యలు.‌.‌ మల్లె‌లలో ఘమ‌ఘ‌మలు’‌ పాట‌కూడా సావి‌త్రిదే.‌ వెన్నెల నేప‌ద్యంతో చిత్రీ‌క‌రిం‌చిన ఈ పాట కర్ణ‌పే‌యంగా ఉంటుంది.‌ సినారె గీతం సిగ్గే‌స్తోందా.‌.‌ సిగ్గే‌స్తోందా’‌’‌ పాటలో స్విమ్‌ డ్రెస్‌లో‌వున్న జయ‌ల‌లిత ఆ రోజుల్లో యువ‌తను గంగ‌వె‌ర్రు‌లె‌త్తిం‌చింది.‌ ‌‘‌‘నీడలో నిలి‌చినా −‌ నీటిలో ముని‌గినా తోడు నీవు లేనిదే వేడిగా ఉందిలే’‌’‌ అంటుంది జయ‌ల‌లిత.‌ ఘంట‌సాల గళంలో అక్కి‌నేని ‌‘‌‘నీడలో లేదులే −‌ నీటిలో లేదులే.‌.‌.‌ అది నీ వయసు లోన ఆరి‌పోని వేడిలే’‌’‌ అంటారు.‌ జగ్గ‌రయ్య అభి‌రు‌చికి అను‌గు‌ణంగా నడి‌చేం‌దుకు ఉద్యు‌క్తు‌రాలై, ఆదు‌ని‌కంగా తయారై, చేతిలో మద్యం గ్లాసు పట్టు‌కొని మత్తు‌మ‌త్తుగా విని‌పించే సుశీల పాట దాశ‌రథి రాసిన ‌‘‌‘నిన్ను చూడనీ.‌.‌.‌.‌ నన్ను పాడనీ’‌’‌ హిందూ‌స్తానీ కర్నా‌టక బాణీలో ‌‘దానీ’‌ అనే రాగంలో హిందీ సంగీత దర్శ‌కుడు రవి ‌‘యే రాస్తే హై ప్యార్‌కే’‌ లో ‌‘‌‘ఏ కామో‌షియా.‌.‌ యే తన్హా‌యియా.‌.‌.‌ మోహ‌బ్బత్‌ కి దునియా హై కిత్ని జవాన్‌’‌’‌ పాటను స్వర‌ప‌రి‌చారు.‌ మంచు పర్వ‌తా‌లలో సునీ‌ల్‌దత్, లీలా‌నా‌యుడు పాడు‌కునే యుగళ గీత‌మది.‌ చల‌ప‌తి‌రావు ఆ ట్యూను ని యధా‌త‌ధంగా వాడు‌కొంటూ తెలు‌గులో ‌‘‌‘షరాబీ’‌’‌ పాటగా మలి‌చారు.‌ ఈ పాటకు మంచి గుర్తిం‌పు‌వ‌చ్చింది.‌ మరో అద్భు‌త‌మైన పాట చల‌ప‌తి‌రావు సహా‌య‌కుడు టి.‌ఆర్‌.‌ జయ‌దేవ్‌ జాన‌కితో కలిసి ఆల‌పిం‌చిన దాశ‌రథి గీతం ‌‘‌‘నీ కాలికి నే నంది‌యనై.‌.‌.‌ నీ కన్ను‌లలో కాటు‌కనై.‌.‌ ఉండి‌పోనా నీతోనే.‌.‌ నిండి‌పోనా నీలో నే’‌’‌ ఒక రస గుళిక.‌.‌ జగ్గయ్య రాజశ్రీ మీద చిత్రీ‌క‌రిం‌చిన విధానం ప్రత్య‌గాత్మ సృజ‌నా‌త్మ‌క‌తను తెలి‌య‌జే‌స్తుంది.‌ ‌‘‌‘పలు‌మారు రాదోయి ఇటు‌వంటి రేయి.‌ అధ‌రాల మధు‌రాలు నిను‌కోరె నోయి’‌’‌ అని రాజశ్రీ అంటే, దాశ‌రథి గాలిబ్‌ గీతాల సర‌ళిలో ‌‘‌‘నీవెలే నా మధు‌శాల.‌.‌ నీవేలే నామ‌దిలో జ్వాల.‌.‌ నీవేలే నా జీవి‌తమూ.‌.‌.‌ నీకేలే అంకి‌తమూ’‌’‌ అని జగ్గయ్య చేత మధువు గ్రోలుతూ అని‌పి‌స్తారు.‌ దాశ‌రథి రచ‌నకు చల‌ప‌తి‌రావు స్వర‌ర‌చన అద్భు‌తంగా అమ‌రింది.‌ జగ్గయ్య తెల్లని దోవతి, లాల్చి ధరించి ఈ పాటలో కన్పి‌స్తారు.‌ ఈ సిని‌మాలో ఒక తాగుడు పాట వుంది.‌ అది‌కూడా దాశ‌రథి రాసిందే.‌.‌ నేను తాగ‌లేదు.‌.‌ నాకు నిషా‌లేదు’‌ అనే ఈ పాటను నాంపల్లి వీధుల్లో, ఆల‌నాటి రిట్జ్‌ హోటల్‌ పరి‌స‌రాల్లో చిత్రీ‌క‌రిం‌చారు.‌ ఈ పాటలో మంచి సెటైర్లు వున్నాయి.‌ ‌‘‌‘కొంద‌రికి డబ్బు నిషా, కొంద‌రికి క్లబ్బు నిషా, కొంద‌రికి పదవి నిషా, కొంద‌రికి పెదవి నిషా, కొంద‌రికి వధువు నిషా, కొంద‌రికి మధువు నిషా’‌’‌ అని చెబుతూ ‌‘‌‘లోకంలో అంద‌రికీ చీక‌టిలో బలే నిషా’‌’‌ అంటూ ముగి‌స్తారు కవి.‌ ఇవి కాకుండా జానకి పాడిన ‌‘‌‘ ఒకడు కావాలి.‌.‌ అతడు రావాలి ’‌’‌ (కొస‌రాజు), ‌‘‌‘నీవు ఎదు‌రుగా వున్నావు.‌ బెదిరి పోతు‌న్నావు’‌’‌ (సినారె−‌ ఘంట‌సాల, సుశీల), ‌‘‌‘కన్ను‌మూ‌సింది లేదు.‌.‌ నిన్ను మరి‌చింది లేదు.‌ ఓ ప్రియ‌తమా’‌’‌ (దాశ‌రథి −‌ సుశీల) పాటలు కూడా జన‌రం‌జ‌కాలే.‌
− ఆచారం షణ్ము‌ఖా‌చారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.