కృష్ణుడంటే ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు అనుకునేలా ఆయన కృష్ణుడి పాత్రకు జీవం పోసిన సంగతి తెలిసిందే. కానీ ఆయన నటించిన కొన్ని సినిమాల పేర్లు చూస్తే రాముడంటే ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటే రాముడు అనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా 16 చిత్రాల్లో ఆయన పాత్ర పేరు రాముడు అని ఉండటమే కాదు.. ఆయా సినిమాల టైటిల్స్‌లోనూ రాముడు అనే పేరు కనిపించడం విశేషం. 1954లో వచ్చిన ‘అగ్గిరాముడు’తో మొదలైన ఆ రామనామ స్మరణ 1982లో వచ్చిన ‘కలియుగ రాముడు’ వరకూ అప్రతిహతంగా కొనసాగింది. మంచి వాడిగా ‘శభాష్ రాముడు’ అనిపించుకున్న ఆయనే మొండి దొంగగా మారి ‘బండ రాముడు’ అని పిలిపించుకున్నారు. డ్రైవర్ అవతారంలో ‘టాక్సీ రాముడు’ అయ్యారు. గజ దొంగగా పోలీసుల పాలిట ‘టైగర్ రాముడు’గా మారారు. వీటితో పాటు రాముడు భీముడు, పిడుగు రాముడు, రాముని మించిన రాముడు, డ్రైవర్ రాముడు, శృంగార రాముడు, ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, సరదా రాముడు.. లాంటి టైటిల్స్‌తో అలరించారు ఎన్టీఆర్. ఆయన కెరీర్లోనే మరపురాని విజయాన్నందించిన మరో చిత్రమూ ఈ కోవలోనే ఉంది. అదే ‘అడవి రాముడు’. ఈ అరుదైన ఘనత మరే హీరోకీ దక్కకపోవచ్చు.