ఆదుర్తిని అందలమెక్కించిన ‘తోడికోడళ్లు’
సమష్టి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, తోడికోడళ్ల మధ్య ఉత్పన్నమయ్యే సంఘర్షణల నేపథ్యంలో అన్నపూర్ణా వారు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన రెండవ చిత్రం ‘తోడికోడళ్లు’. ఎప్పటికైనా ఈర్ష్య, అసూయలతో జీవితాలు బాగుపడవని, అందరూ కలిసి మెలిసి ఉండాలనే నినాదంతో నడిచే ఈ సినిమా కథకు శరత్‌ రచించిన బెంగాలీ నవల ‘నిష్కృతి’ ఆధారం. ఆదుర్తి సుబ్బారావు, మాస్టర్‌ వేణు తొలిసారి అన్నపూర్ణా సంస్థలో పనిచేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 1957 జనవరి 11న విడుదలై ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. జాతీయ స్థాయిలో దీనికి రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది. తమిళంలో కూడా ఏకకాలంలో ‘ఎంగళ్‌ వీట్టు మహాలక్ష్మి’ పేరుతో నిర్మించిన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించి రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్ర విశేషాలు కొన్ని...


అన్నపూర్ణాలోకి ఆదుర్తి
1948లో ప్రసిద్ధ నాట్యకారుడు ఉదయశంకర్‌ ‘కల్పన’ పేరుతో ఒక నృత్య ప్రధానమైన హిందీ సినిమాను సొంతంగా మద్రాసు జెమినీ స్టూడియోలో నిర్మిస్తూ సహాయ దర్శకునిగా, సహాయ ఎడిటర్‌గా ఆదుర్తి సుబ్బారావును నియమించారు. ఆ అనుభవంతో ‘పారిజాతాపహరణం’, ‘పేట్రత్తాయ్‌’ వంటి తమిళ సినిమాలకు, ‘కన్నతల్లి’, ‘సంక్రాంతి’ వంటి తెలుగు చిత్రాలకు ఆదుర్తి ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే ‘మంగళసూత్రం’, ‘ఒకరోజు’, ‘సర్కస్‌ రాజు’ వంటి కొన్ని తెలుగు సినిమాలకు పాటలు రాశారు. ప్రకాష్‌ స్టూడియో అధినేత కె.ఎస్‌.ప్రకాశరావు వద్ద ‘దీక్ష’ సినిమాకు సహాయ దర్శకత్వం, కూర్పు నిర్వహించారు. అలా కొంతకాలం ఎడిటర్‌గా పనిచేశాక ఆదుర్తికి దర్శకత్వం నిర్వహించే అవకాశం వచ్చింది. ప్రకాష్‌ స్టూడియోలో మేనేజర్లుగా పనిచేస్తున్న ఎస్‌.భావనారాయణ, డి.బి.నారాయణ కలిసి 1954లో సాహిణీ పిక్చర్స్‌ స్థాపించి ‘అమరసందేశం’ సినిమా నిర్మిస్తూ దర్శకత్వం బాధ్యతలు ఆదుర్తికి అప్పగించారు. ఆ సినిమా ఆశించినంత విజయవంతం కాకపోయినా ఆదుర్తి దర్శకత్వం సినీ పండితుల ప్రశంసలు అందుకుంది. ఆ రోజుల్లోనే అక్కినేని నాగేశ్వరావు, దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణా సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి నేతృత్యంలో ‘దొంగరాముడు’ సినిమా నిర్మించి 1955లో విడుదల చేసినప్పుడు అది ఘనవిజయం సాధించింది. తరువాత నిర్మించే తమ చిత్రాలకు దర్శకుని అన్వేషించే పనిలో వుండగా ఆదుర్తి సుబ్బారావు వారి దృష్టిలో మెదిలారు. దానితో అతడికి తమ రెండవ చిత్రం ‘తోడికోడళు’్ల, తమిళ వర్షన్‌ ‘ఎంగళ్‌ వీట్టు మహాలక్ష్మి’ దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. మానవ మనస్తత్వాలకు అద్దంపట్టిన ‘తోడికోడళు’్ల సినిమా అఖండ విజయం సాధించడంతో ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణా వారి అస్థాన దర్శకునిగా స్థిరపడిపోయారు. అన్నపూర్ణా సంస్థ తదుపరి నిర్మించిన ‘మాంగల్యబలం’, ‘ఇద్దరు మిత్రులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘వెలుగు నీడలు’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘పూలరంగడు’, ‘విచిత్రబంధం’, ‘బంగారు కలలు’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు ఆదుర్తి సుబ్బారావే దర్శకుడు.


ఇదీ నేపథ్యం...
‘తోడికోడళ్లు’ సినిమా దర్శకత్వం కోసం అక్కినేని, దుక్కిపాటి ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లను పరిశీలించారు. కానీ వారంతా ఇతర సినిమాలకు దర్శకత్వం నిర్వహిస్తూ బిజీగా ఉండటంతో, కాశ్మీరులో ఘాటింగ్‌ కోసం వెళ్తున్న అక్కినేనిని ఎవరైనా సూచించమని దుక్కిపాటి అడిగారు. కాశ్మీరు వెళ్లిన అక్కినేని దుక్కిపాటికి ఉత్తరం రాస్తూ ఆదుర్తి పేరును సూచించారు. అందుకు అంగీకరించిన దుక్కిపాటి ఆదుర్తిని పిలిచి కథ గురించి చర్చించారు. వారికి బెంగాలి రచయిత శరత్‌ చంద్ర మెదిలాడు. శరత్‌ సాహిత్యం తెలుగువారి సంప్రదాయలకు అనుగుణంగా ఉంటుంది కనుకనే దేవదాసు, బాటసారి వంటి చిత్రాలు తెలుగులో విజయవంతమయ్యాయి. అలా శరత్‌ చంద్ర రాసిన ‘నిష్కృతి’ కథను ఎంపిక చేసి, ఆ కథలో కేవలం సారాన్ని మాత్రం గ్రహించి బెంగాలీ వాసనలు దరి చేరకుండా ఆత్రేయ చేత కథను అల్లించారు. బెంగాలీ కథలో ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు సొంత అన్నదమ్ములు మరొక పినతండ్రి కొడుకు కలిసి వుంటారు. ఇద్దరు అన్నదమ్ములూ న్యాయవాదులు కాగా పినతండ్రి కొడుకు మాత్రం నిరుద్యోగి. ఆ నిరుద్యోగి భార్యే ఉమ్మడి కుటుంబ భారాన్ని మోస్తుంటుంది. ఈ కథనే కాస్త అటూ ఇటూ మార్చి ‘తోడికోడళ్ళు’ సినిమాగా మలిచారు.

సంక్షిప్త కథ
ఉమ్మడి కుటుంబానికి మతిమరుపు లాయర్‌ కుటుంబరావు (ఎస్‌.వి.రంగారావు) పెద్ద. అతని సొంత తమ్ముడు రమణయ్య (రేలంగి) పల్లెటూరిలో వారికి పెద్దల ద్వారా సంక్రమించిన పొలంలో వ్యవసాయం చేయిస్తూ భార్య అనసూయ (సూర్యకాంతం), కొడుకు వాసు (మాస్టర్‌ కుందు)తో కాపురం చేస్తూ ఉంటాడు. కుటుంబరావు తమ్ముడి కొడుకు సత్యం (అక్కినేని నాగేశ్వరరావు) చదువు పూర్తి చేసుకొని అన్నగారి వద్దే ఉంటాడు. అతనికి విద్యాధికురాలైన భార్య సుశీల (సావిత్రి), కొడుకు (మాస్టర్‌ శరత్‌ బాబు) ఉంటారు. సుశీల తలలో నాలికలా ఉంటూ కుటుంబరావు కూతురు (పార్వతి)తోబాటు, తోడికోడలు (కన్నాంబ)ను కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటుంది. పల్లెటూరులో కుటుంబారావుకు ఒక రైసు మిల్లు వుంటే దాని ఆలనాపాలనా అనసూయ తమ్ముడు వైకుంఠం (జగ్గయ్య) వెలగబెడుతూ వుంటాడు. అక్కతో మంతనాలాడి రమణయ్య కుటుంబాన్ని వైకుంఠం పట్నంలోని కుటుంబరావు ఇంటికి చేరుస్తాడు. అనసూయను రెచ్చగొట్టి ఉమ్మడి కుటుంబంలో కలతలు రేపుతాడు. సుశీల మీద చాడీలు చెప్పించి సత్యం కుటుంబాన్ని పల్లెకు వెళ్లేలా చేస్తాడు. పల్లెటూరిలో సత్యం వ్యవసాయం చేస్తూ బంజరు భూముల్ని సస్యస్యామలం చేస్తాడు. రమణయ్యను వైకుంఠం నవనీతం (రాజసులోచన) అనే సాని కొంపకు చేర్చి పేకాట వంటి దుర్గుణాలను వంటబట్టిస్తాడు. మతిమరుపు కుటుంబరావుకు నెమ్మదిగా ఇంటి పరిస్థితులు అర్థమౌతాయి. ఇన్ని కష్టాలకు తన నిర్లక్ష్యం, మతిమరుపుతనం కారణమని గ్రహించి వైకుంఠంను శిక్షించి, పరిస్థితులను చక్కబరచి ఉమ్మడి కుటుంబాన్ని నిలుపుతాడు. సినిమా ఆద్యంతం మన ఇళ్లలో జరిగినట్లే అనిపిస్తుంది. ఇతర పాత్రల్లో వడ్డీ వ్యాపారి తిరపతయ్యగా చదలవాడ కుటుంబరావు, అయోమయంగా అల్లు రామలింగయ్య, నటించారు. సెల్వరాజ్‌ ఛాయాగ్రహణం, కృష్ణారావు కళాదర్శకత్వ చిత్రానికి వన్నెతెచ్చాయి.


‘వేణు’గాన లహరి
అన్నపూర్ణ వారి తొలి చిత్రం ‘దొంగరాముడు’కు పెండ్యాల సంగీతం సమకూర్చగా ‘తోడికోడళ్లు’ చిత్రానికి మాస్టర్‌ వేణు తొలిసారి సంగీత దర్శకత్వం నిర్వహించారు. శ్రీశ్రీ, ఆత్రేయ, కొసరాజు, తాపీ ధర్మారావు పాటలు రాశారు. అక్కినేని ఆలపించే ఘంటసాల పాట ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దాన’ను శ్రీశ్రీ రాసారని భ్రమపడిన వారున్నారు. కానీ అది ఆత్రేయ గీతం. ఈ పాట సినిమా కోసం రాసింది కాదు. నెల్లూరులో జమీన్‌ రైతు పత్రికకు సహాయ సంపాదకునిగా పనిచేస్తున్నప్పుడు ఒకసారి కస్తూరి దేవి విద్యాలయం వైపు నడిచి వెళ్తుంటే, ఒక ధన వంతుని కూతురు కారులో దర్పంగా ఆ పాఠశాల నుంచి బయటకు వెళ్లడం చూసి స్పందించి తన డైరీలో రాసుకున్న గీతమిది. ఈ పాటను అభ్యుదయ భావాలు కలిగిన హీరోకు అనుగుణంగా ఒక సన్నివేశాన్ని కల్పించి చిత్రీకరించారు. కొసరాజు రచించిన యుగళగీతం ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది’ పాటలో చేలకు వెదురు బొంగు గూడతో నీళ్లు అందించే పద్ధతిని అద్భుతంగా చిత్రీకరించారు. పాట మొత్తం గూడ వేయడంతోనే చిత్రీకరించినా ప్రేక్షకునికి ఎక్కడా బోరు కొట్టదు. గూడ వేయటంలో సహజత్వం కోసం సావిత్రి మూడు రోజులపాటు శిక్షణ తీసుకుంది. ఈ పాటను గూడూరుకు దగ్గరలో వున్న జనపసత్రం అనే గ్రామంలోని శ్రీనివాసులు నాయుడు పొలంలో చిత్రీకరించారు. శ్రీశ్రీ రాసిన ‘నలుగురు కలిసి పొరుపులు మరిచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం’ పాటలో ‘ఒక్కొక్క వ్యక్తీ సమస్త శక్తి ధారపోసి పనిచెయ్యాలి... ధనధాన్యరాసులే పెంచాలి’ అనే ప్రబోధం గోచరిస్తుంది. ఆ రోజుల్లోనే భూసంస్కరణల గురించి శ్రీశ్రీ చెప్పటం విశేషమే. తాపీ ధర్మారావు రాయగా సుశీల ఆలపించిన ‘కలకాలమీ కలత నిలిచేది కాదు... కనుమూసి కాసేపు నిదురించు బాబు’ పాటను సావిత్రి మీద చిత్రీకరించారు. ఈపాట సరళి మాస్టర్‌ వేణు గురువు నౌషాద్‌ శైలిని గుర్తుచేస్తుంది. ‘టౌను పక్కకెళ్లొద్దురా డింగరి డాంబికాలు పోవొద్దురా’ అనే కొసరాజు పాటను ఘంటసాల, జిక్కి ఆలపించగా ఇ.వి.సరోజ, నృత్యదర్శకుడు ఎ.కె.చోప్రా మీద చిత్రీకరించారు. ఇది కూడా ఒక ప్రబోధ గీతం వంటిదే! ఆత్రేయ రాసిన ‘ఎంతెంత దూరం కోసెడు దూరం... నీకూ మాకూ చాలాచాలా దూరం’ పాటను సుశీల, రాణి బృందం పాడగా చిన్న పిల్లలమీద చిత్రీకరించారు. అలాంటిదే కొసరాజు రచించిన ‘గాలిపటం గాలిపటం రంగురంగుల గాలిపటం’ పాట కూడా. అలాగే దసరా పండుగకు పిల్లలు పాడే ‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు, సున్నివుండలు చాలు చిన్నిపిల్లలకు’ పాటను సుశీల బృందం ఆలపించింది. మాధవపెద్ది, జిక్కి పాడిన కొసరాజు రచన ‘నీ సోకు చూడకుండా నవనీతమ్మా... నీ నీడ వదిలి ఉండలేనే ముద్దులగుమ్మా’ పాటను రాజసులోచన, రేలంగి మీద చిత్రీకరించారు. తమిళ చిత్రంలో పాటల్ని ఉడుమలై నారాయణకవి, మురుత్తకాశి రాయగా మాస్టర్‌ వేణు సంగీతం సమకూర్చారు. తెలుగు బాణీలనే తమిళంలో కూడా వాడుకున్నారు.


మరిన్ని విశేషాలు...
* నిష్కృతి కథాంశాన్ని బెంగాలీలో రెండుసార్లు సినిమాగా మలిచారు. 1953 పశుపతి చటర్జీ, 1978లో సునిల్‌ బసుమల్లిక్‌ ఇదే కథను సినిమాగా నిర్మించారు. బెంగాలీలో అనూప్‌ కుమార్, మాధవి ముఖర్జి నటించగా, హిందీ వర్షన్‌ను బసు చటర్జీ అమోల్‌ పాలేకర్, షబానా అజ్మితో నిర్మించారు.
* ‘తోడికోడళ్లు’ సినిమాతో సమాంతరంగా తమిళంలో నిర్మించిన ‘ఎంగళ్‌ వీట్టు మహాలక్ష్మి’ 01-02-1957న విడుదలైంది. యస్వీ రంగారావు, కన్నాంబ, అక్కినేని, సావిత్రి తమిళ చిత్రంలో తమ తమ పాత్రలనే పోషించగా, రేలంగి పాత్రను తంగవేలు, సూర్యకాంతం పాత్రను సుందరిబాయి, జగ్గయ్య పాత్రను నంబియార్‌ పోషించారు. తమిళ వర్షన్‌కు అప్పటికింకా దర్శకునిగా ఎదగని ప్రముఖ దర్శకుడు సి.వి.శ్రీధర్‌ సంభాషణలు సమకూర్చడం విశేషం.

* తెలుగులో వెండితెర నవలగా వచ్చిన మొదటి చిత్రం ‘తోడికోడళు’్ల. ఈ నవలను రాంచంద్‌ రాయగా దుక్కిపాటి ప్రచురించారు. ఆ వెండితెర నవల గురించి దుక్కిపాటి వ్యాఖ్యానిస్తూ ‘ఇడ్లీకన్నా చెట్నీ బాగుంది’ అంటూ ప్రశంసించారు.

* అంతవరకూ పిల్లలకు, రెండవ హీరోయిన్‌లకు పాటలు పాడుతున్న గాయని పి.సుశీల, హీరోయిన్‌ సావిత్రికి పాడటం ఈ సినిమాతోనే ప్రారంభమైంది.

* ప్రముఖ దర్శకుడు వీరమాచనేని మధుసూదనరావు ఆదుర్తికి సహాయకుడుగా పనిచేసిన మొదటి సినిమా ‘తోడికోడళ్లు’. ఆదుర్తి - దుక్కిపాటితో చెరేనాటికి ‘తోడికోడళ్లు’ సినిమా కథ తయారైపోయింది. అయితే ఆత్రేయతో కలిసి స్క్రిప్టు తయారు చేయడంలోను, స్క్రీన్‌ ప్లే తయారు చేయడంలోను ఆదుర్తి, మధుసూదనరావు సహకారమందించారు. తరువాతి కాలంలో వి.మధుసూదనరావు జగపతి సంస్థకు ‘అన్నపూర్ణ’, ‘ఆరాధన’, ‘ఆత్మబలం’, ‘అంతస్తులు’, ‘అదృష్టవంతులు’, ‘ఆస్తిపరులు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి విక్టరీ మధుసూదనరావుగా పేరు గడించారు.

* ఆదుర్తి సుబ్బారావు ‘తోడికోడళ్లు’ సినిమాకు దర్శకత్వం నిర్వహించడమే కాకుండా ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా నిర్వహించారు. ‘తోడికోడళ్లు’ ఎడిటింగ్‌ అత్యున్నత ప్రమాణాలతో వుంటుంది. తరవాతి కాలంలో మంచి దర్శకునిగా ఎదిగిన టి.కృష్ణ, డి.వెంకటరత్నంలు ఆదుర్తికి ఎడిటింగ్‌లో సహయకులుగా పనిచేశారు.

* కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఈ సినిమాకు సౌండ్‌ ఇంజనీరుగా పనిచేయడం విశేషం. నృత్య దర్శకుడు ఎ.కె.చోప్రా, ఇ.వి సరోజతో కలిసి నృత్యం చేయడం కూడా ఒక విశేషమే!

* నిజానికి ఇందులో అక్కినేని నాగేశ్వరరావు హీరో కాదు. కన్నాంబ, సావిత్రి, ఎస్‌.వి.రంగారావులే అసలైన హీరోలు. ఈ విషయాన్ని అక్కినేని కూడా సమర్థించారు. ఇందులో కుటుంబరావు కూతురుగా నటించిన పార్వతి తదనంతర కాలంలో మంచి డబ్బింగ్‌ కళాకారిణిగా ఎదిగింది. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జిమ్మీ (అసలు పేరు రూడ్‌) అనే కుక్కపిల్ల మదనపల్లికి చెందిన ఆర్‌.జానకీరామ్‌ చౌదరిది.

* ఈ సినిమా శతదినోత్సవ సంబరాలు ఏప్రిల్‌ 20-24 మధ్య వరసగా తెనాలి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాలలో జరిగాయి.

* ఆదుర్తి తొలిసారి దర్శకత్వం వహించిన ‘అమరసందేశం’ టైటిల్‌ కార్డులో, వాల్‌ పోస్టర్లలో ఆదుర్తి అని మాత్రం వేశారు. పూర్తిపేరు టైటిల్‌ కార్డు, వాల్‌ పోస్టర్లులో పడిన సినిమా ‘తోడికోడళ్లు’. ఈ సినిమా చివర ఆదుర్తి ‘శుభం’ కార్డుకు బదులు ‘జైహింద్‌’ అని వేయించేవారు. ఆయనకు శుభం, మంగళం, సమాప్తి వంటి పేర్లు నచ్చేవి కావు.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.