
‘ఒంగోలు గిత్త’ భామ కృతి ఖర్బాందా ఇప్పుడు పూర్తిగా ప్రేమమైకంలో పడిపోయింది. కొన్నాళ్ల్లుగా సహ నటుడు పులకిత్ సమ్రాట్తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అది చూసిన చాలామంది వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. కానీ అప్పుడు కృతి ఒప్పుకోలేదు. మేం కేవలం మంచి స్నేహితులం మాత్రమే అంతకు మించి మరేమి లేదంటూ బుకాయించింది. కానీ ఇప్పుడు తనే ప్రేమలో ఉన్నానంటూ చెబుతోంది. పులకిత్తో ప్రేమ గురించి మాట్లాడుతూ..‘‘అవును తొలుత నేను పులకిత్తో సన్నిహితంగానే మెలిగాను. అతను నా అభిప్రాయాలను గౌరవించాడు. మన మనసుకు దగ్గరైన వ్యక్తి, ఇష్టాలు తెలుసుకుని నడుచుకునే అబ్బాయిని ఏ అమ్మాయినా వదులుకుంటుందా? అందుకే నేను అతని ప్రేమలో పడిపోయా. ముందు ఇంట్లో వాళ్లు పులకిత్ గురించి ఒప్పుకుంటారా లేదా అని బెంగపడ్డాను. ఒక్కోసారి మనసులోని ప్రేమను తెలియజేయడానికి సంవత్సరాలు పట్టవచ్చు... కొన్ని నెలలు పట్టవచ్చు. కానీ నా విషయంలో అది నెలల కాలంలోనే నెరవేరింది. నేను చాలా అదృష్టవంతురాలిని..’’ అంటూ చెప్పింది. ప్రస్తుతం కృతి - పులకిత్లు కలిసి అనీష్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాగల్ఫంథి’లో నటిస్తున్నారు. ఇందులో అనిల్ కపూర్, జాన్ అబ్రహాం, ఇలియానా తదితరలు నటిస్తున్నారు. నవంబర్ 22, 2019న సినిమా విడుదల కానుంది.