‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా

‘‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో నాకు అవకాశమిచ్చినందుకు రాజమౌళి సార్‌కు ధన్యవాదాలు’’ అని చెప్తోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌. జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక మల్టీస్టారర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో రామ్‌చరణ్‌కు జోడీగా సీత అనే పాత్రలో కనిపించబోతుంది ఆలియా. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో రాజమౌళి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకోని ఆలియా ట్విటర్‌ వేదికగా జక్కన్నకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘ఈరోజు నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది. అద్భుతమైన నటులతో, మిగతా బృందంతో కలిసి ఈ అందమైన ప్రయాణాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తానా?అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. నాకీ చిత్రంలో అవకాశమిచ్చినందుకు రాజమౌళి సార్‌కు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌కు రాజమౌళి బదులిస్తూ.. ‘‘తోటి నటులతో పోటీపడటానికి నువ్వెంతో కష్టపడతావని విన్నాను. ఇప్పుడు నా చిత్రం కోసం నువ్వు అదే నిబద్ధతను చూపించబోతున్నందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు జీవితాల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందబోతుంది. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించబోతుండగా.. ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి డైసీ అడ్గార్జియోన్స్‌ నటించనుంది. అజయ్‌ దేవ్‌గణ్, సముద్ర ఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.