ఫైర్‌బ్రాండ్‌ నోరు తెరిస్తే...

కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లో ఓ ఫైర్‌ బ్రాండ్‌. మనసుకు నచ్చినట్టు ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఇప్పుడు ఏకంగా తన తోటినటుల మీదే ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో జరిగిన ఓ సామాజిక కార్యక్రమానికి ఆమె హాజరైంది. ఆ సమయంలో దేశంలోని సమస్యలపై బాలీవుడ్‌ ఎందుకు అంతగా మాట్లాడటం లేదు? అని ఓ విలేకరి అడగ్గా... ఒకర్ని వేలెత్తి చూపకుండా సమస్యలపై గళం విప్పడం ఓ పౌరుడిగా అందరి బాధ్యత అని చెప్పింది. ‘‘విజయాలతో దూసుకెళ్లే మమ్మల్ని కెమెరాల్లో బంధించడానికి క్లిక్కుల వర్షమే కురుస్తుంటుంది. అలాంటి తారలు దేశంలోని సామాజిక సమస్యలపై నోరు విప్పకపోతే వారు సాధిస్తున్న విజయాలకు అర్థం ఉండదు. స్టార్‌ డమ్‌ అనేది ఊరికే రాలేదు. ప్రేక్షకులు ఇచ్చారు. అలాంటి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటం ఎంతైనా అవసరం. ‘‘మాకు నీటి సమస్య లేదు, విద్యుత్‌కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. అలాంటప్పుడు ఆ సమస్యలు గురించి మేమెందుకు మాట్లాడాలి’ అని కొంతమంది తారలు నాముందే మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నన్ను ఎంతగానో బాధించాయి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశ ప్రజలు వల్ల వచ్చిన స్టార్‌డమ్‌ను అనుభవిస్తూ సమస్యలు పట్టనట్టు మాట్లాడటం దారుణం’’అని ఘాటుగా స్పందించింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అంటే ‘‘రాజకీయాల్ని ఓ కెరీర్‌గా ఎప్పుడూ భావించకూడదు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే బంధుప్రీతికి దూరంగా ఉండాల’’ని హితవు పలికింది కంగనా.© Sitara 2018.
Powered by WinRace Technologies.