మీడియాపై విరుచుకుపడిన ఫైర్‌బ్రాండ్‌

ముక్కుసూటిగా మాట్లాడుతూ.. మనసుకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఫైర్‌ బ్రాండ్‌లా చెలరేగిపోయే కంగనా రనౌత్‌ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఈ భామ ఓ జర్నలిస్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తన తాజా చిత్రం ‘జడ్డిమెంటల్‌ హై క్యా’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ‘మణికర్ణిక’ గురించి మీరెందుకు నీచంగా రాశారు అంటూ అక్కడే ఉన్న ఓ జర్నలిస్టుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడింది. దీంతో కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అంతవరకు తాము కంగన చిత్రానికి మీడియా కవరేజి చేయమ’ని ప్రకటించారు. దీనిపై చిత్ర నిర్మాత ఏక్తా కపూర్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ కంగనా ఏమాత్రం తగ్గట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాను క్షమాపణలు చెప్పేది లేదని పట్టుదలతో ఉందట. అంతేకాదు.. మరోసారి జర్నలిస్టులపై నోరు పారేసుకుంటూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ‘‘ఫ్రీగా భోజనాలు చేసేందుకు వీళ్లంతా ప్రెస్‌మీట్లకు వస్తున్నారు. నా పేరు వాడుకోని వీళ్లు పేరు సంపాదించుకోవడం నాకిష్టం లేదు. నాకు మీడియా కవరేజి ఇవ్వొద్దు’’ అంటూ ఆ వీడియోలో ఆమె తీవ్రస్థాయిలో విరుచుకు పడింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు సైతం ఈ వివాదాన్ని మరింత ఉద్ధృతం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సినీ ప్రముఖులనే టార్గెట్‌ చేస్తూ వచ్చిన కంగనా.. ఈసారి ఏకంగా మీడియాతోనే పోరుకు సిద్ధపడటంతో ఆమె భవిష్యత్తు ఏం కానుందా అని అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.