సెట్స్‌పైకి వెళ్తోన్న ‘తలైవి’

ప్రస్తుతం నాయికా ప్రాధాన్య చిత్రాల మాటెత్తగానే అందరి దృష్టినీ ఆకర్సిస్తోంది కంగనా రనౌతే. ఈ ఏడాది ‘మణికర్ణిక’ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ఈ లేడీ స్టార్‌.. ప్రస్తుతం ‘ధాకడ్‌’, ‘తలైవీ’ వంటి ఆసక్తికర లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో బిజీగా గడిపేస్తోంది. రజనీష్‌ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ధాకడ్‌’ ఇప్పటికే సెట్స్‌పై ముస్తాబవుతుండగా.. తాజాగా ‘తలైవి’ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది కంగనా. సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబరు తొలి వారం నుంచి ప్రారంభం కానుందట. దీనిపై సదరు చిత్ర నిర్మాత నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర సాంకేతిక సిబ్బంది జయ బయోపిక్‌ పనుల్లో బిజీ అయిపోయారని, ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు కంగనా సైతం అమ్మ పాత్ర కోసం తమిళ్‌ నేర్చుకోవడంతో పాటు క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలియజేశారు. తొలి షెడ్యూల్‌ను మైసూర్‌లో మొదలుపెట్టి.. ఆ తర్వాత చెన్నైకు తీసుకొస్తారట. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మిగిలిన ప్రాంతీయ భాషల్లోనూ అనువాదంగా రానుంది. ఈ జీవితగాథకు ప్రముఖ రచయితలు విజయేంద్రప్రసాద్‌, రాహుల్‌ అరోరా కథను అందిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.