కరీనాకపూర్ పదిహేడేళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది. దాంతో ఆమె చదువుకు ఫుల్‌స్టాఫ్ పడిపోయింది. అప్పుడనిపించిందో లేదో కానీ ఇప్పుడు మాత్రం చదువుకోలేదని బాధపడుతోంది. ‘‘కెరీర్‌ను కొంచెం తొందరగా మొదలుపెట్టేశాననే భావన నాలో ఉండిపోయింది. వేగంగా నిర్ణయం తీసేసుకొని సినిమాల్లోకి వచ్చేశాను. కానీ నేను ఇంకా చదువుకోవాల్సింది. ఈ రోజుల్లో చదువు అనేది చాలా ముఖ్యం. నేను కనీసం డిగ్రీ కూడా చేయలేకపోయానని బాధపడుతున్నాను. మా తైమూర్ విషయంలో అలా జరగకుండా జాగ్రత్తపడతాను. ముందు వాడు బాగా చదువుకోవాలి. తర్వాతే వాడికి నచ్చిన రంగంలోకి వస్తాడు’’ అని చెబుతోంది కరీనా. ఆమె భర్త సైఫ్ అలీఖాన్ కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదివినవారే. ‘‘సైఫ్ తరఫు వారు అందరూ గొప్ప చదువులు చదివారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. తన పిల్లలు సారా, అబ్రహమ్లను బాగా చదివించాడు. నేను సినిమా కుటుంబం నుంచి రావడంతో గొప్ప విద్యావంతురాల్ని కాలేకపోయాను. కానీ ప్రపంచం మొత్తం తిరుగుతూ గొప్ప వ్యక్తుల్ని కలుస్తూ కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. తైమూర్‌కు చదువు, ప్రపంచ జ్ఞానం అబ్బేలా తీర్చిదిద్దుతున్నాను’’ అని చెప్పింది కరీనా.
