నాటికి.. నేటికి.. ‘ఏక్‌ దో తీన్‌’ ఆమే!
వెండితెరపై తళుక్కుమన్న అందాల తోక చుక్క ఆ రూపం...
రవివర్మ కుంచెనుంచి జాలువారిన అపురూప చిత్తరువు ఆ దేహం...
కైపెక్కించే కళ్లతో... యువతరానికి మత్తు జల్లి వారి మదిలో తిష్ఠవేసిన అందాల రాక్షసి.. .
కాలి అందెల సవ్వడితో... కుర్రాళ్ల గుండెల్లో గజ్జెల మోతలు మోగించిన ఇంద్రపురి మేనక...
ఎన్ని తరాలు మారినా... నేటికీ ‘‘ఏక్‌.. దో.. తీన్‌..’’ అంటూ కుర్రకారును అల్లరి చేస్తున్న కలల రాణి... ‘మోహిని’.. ఆమే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్‌.


కొంతమంది వారు చేసిన సినిమాలతో పేరు తెచ్చుకుంటారు. మరికొందరు తమదైన ప్రత్యేకమైన నటనతో పేరు తెచ్చుకుంటారు. మిగతావారు అందంతో!. కానీ మాధురీ అంటే మాత్రం.. అందం, అభినయం వాటన్నింటికీ మించి చూపు తిప్పుకోనివ్వని నాట్యంతో అలరించ గల అద్భుత డ్యాన్సర్‌. ఇదే ఆమెను బాలీవుడ్‌లో ప్రత్యేకమైన నటిగా గుర్తింపు దక్కించుకునేలా చేసింది. నేటికీ బాలీవుడ్‌లో అత్యుత్తమ డ్యాన్సర్ల పేర్లు బయటకు తీస్తే తొలిస్థానంలో నిలిచే వ్యక్తి మాధురీ అంటే అతిశయోక్తి కాదు. అది కేవలం ఏ ఒక్కరి మాటో కాదు. యావత్‌ చిత్ర సీమ మాట. దానికి నిదర్శనమే నేటికీ ప్రజల కళ్లలో మెరిసే ‘తేజాబ్‌’ (1988) చిత్రంలోని ‘‘ఏక్‌ దో తీన్‌ చార్‌ పాంచ్‌’’ గీతం. ఈ పాట వచ్చి మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. అందులో మాధురీ వేసిన స్టెప్పులు సినీ ప్రియుల మదిలో నేటికీ నిత్యనూతనంగా తాండవమాడుతునే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘బాఘీ−2’లో ఈ పాటను జాక్విలిన్‌ ఫెర్నాండేజ్‌తో రీమేక్‌ చేయించారు. కానీ నాటి మాధురీ చేసిన డ్యాన్స్‌ ముందు ఇది దిగదుడుపే అన్నట్లుగా చూశారు సినీ ప్రియులు. అదీ మాధురీ డ్యాన్స్‌లోని గొప్పదనం. మే 15 మాధురీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆనాటి ఆ ఆణిముత్యాన్ని ఓ సారి మళ్లీ చూసేద్దాం..


© Sitara 2018.
Powered by WinRace Technologies.