నాడు మృత్యు కోరల్లో.. నేడు హిమ శిఖరాల్లో

‘బొంబాయి’, ‘భారతీయుడు’, ‘ఒకేఒక్కడు’ వంటి హిట్‌ చిత్రాలతో 90ల్లో యువతరంలో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న నేపాలి ముద్దుగుమ్మ మనీషా కొయిరాల. అటు ఉత్తరాది.. ఇటు దక్షిణాది అని తేడా లేకుండా అన్ని భాషల్లోని అగ్ర కథానాయకులతో ఆడిపాడి సినీప్రియుల్ని ఉర్రూతలూగించింది మనీషా. తాజాగా ఈ భామ తన నిజ జీవితానికి సంబంధించిన ఓ స్ఫూర్తిదాయకమైన ఫొటోను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె రెండు లుక్స్‌లో దర్శనమిచ్చింది. వీటిలో ఒకటి.. 2012లో ఆమె క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్న రోజుల్లో ఆస్పత్రి బెడ్‌పై నిస్సహాయంగా పడిఉన్న లుక్‌ కాగా, మరొకటి ప్రస్తుతం హిమ శిఖరాల్లో విజయగర్వంతో నిల్చొని ఉన్నది. ఇంతకీ ఆమె విజయ గర్వం మరెందుకో కాదు.. తనలోని క్యాన్సర్‌ వ్యాధిపై విజయం సాధించడమే. మనీషా 2012లో అండాశయ క్యాన్సర్‌కి గురైన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి వల్ల దాదాపు మృత్యుకోరల్లో చిక్కుకున్న ఆమె.. దాదాపు రెండేళ్ల పాటు ఎంతో గుండె నిబ్బరంతో పోరాటం చేసి తనలోని రక్కసి వ్యాధిపై పైచేయి సాధించింది. క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకొని ప్రస్తుతం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతోంది. నాటి తన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూనే తాజాగా ఈ ఫొటోలను నెట్టింట చేసింది. ‘‘నా జీవితానికి దక్కిన ఈ పునర్జన్మ ఎప్పటికీ గొప్పదే. నా జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా గడిపేందుకు ఇదొక గొప్ప అవకాశాన్నిచ్చింది’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చింది మనీషా.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.