సోనమ్‌ తళుకులు.. మల్లికా మెరుపులు


71వ కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వైభవంగా కొనసాగుతోంది. కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై హాలీవుడ్‌, బాలీవుడ్‌ ముద్దుగుమ్మల హంస నడకలు హొయలొలికిస్తున్నాయి. తాజాగా నవ వధువు, ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌ కపూర్‌ కేన్స్‌ ఎర్ర తివాచిపై మెరుపులు మెరిపించింది. ఇటీవలే ఆనంద్‌ ఆహుజాను పెళ్లి చేసుకొన్న సోనమ్‌ తాజాగా కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై రాల్ఫ్‌ అండ్‌ రస్సో లెహంగాలో ఆకట్టుకుంది. సోనమ్‌ చేతులకున్న మెహందీ ఇంకా పోలేదు. మెహందీ కనపడాలనే గౌనుకు బదులుగా లెహంగాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ‘రయీస్‌’ భామ మహీరా ఖాన్‌ నల్లగౌనులో ఆకట్టుకునేలా ముస్తాబై వచ్చింది. ఈ ఇద్దరూ భామలతో పాటు పలువురు హాలీవుడ్‌ సుందరీమణులు కూడా రెడ్‌కార్పెట్‌పై కనువిందు చేశారు. కేన్స్‌ వేదికగా ఈ వేడుకలో బాలికల సంరక్షణ కోసం మల్లికాషెరావత్‌ వినూత్న రీతిలో సాగించిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం మల్లిక ‘ఫ్రీ ఎ గర్ల్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. మహిళల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కేన్స్‌ వేడుకల్లో ఓ బోనులోకి వెళ్లి తనకు తానే లాక్‌ చేసుకొని నిరసన తెలిపింది మల్లిక. ‘‘నేను కేన్స్‌ వేడుకల్లో పాల్గొనడం ఇది తొమ్మిదో ఏడాది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసన తెలియజేయడానికి ఇదే సరైన వేదిక. నేను బోనులోకి వెళ్లినట్టే బాలికల్ని బలవంతంగా తీసుకెళ్లి ఇలాంటి బోనుల్లోనే బంధిస్తున్నారు. నిమిషానికో మహిళపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఇలా చేశాను’’ అని చెప్పింది.© Sitara 2018.
Powered by WinRace Technologies.