ప్రతి ఆడపిల్లా లక్కీనే..

‘‘ఆడపిల్లల్ని బరువులా చూసే జనాల్ని చూసినప్పుడల్లా ఓ ఆడదానిగా సిగ్గుపడుతుంటా’’ అంటోంది నటి సోనమ్‌ కపూర్‌. అనిల్‌ కపూర్‌ నట వారసురాలిగా తెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ‘సావరియా’, ‘ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌’ వంటి ప్రేమకథా చిత్రాలతో యువతరానికి దగ్గరయింది. ‘నీర్జా’, ‘వీరే ది వెండ్డింగ్‌’ వంటి నాయికా ప్రాధాన్య చిత్రాలతోనూ సత్తా చాటింది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యక్తిగత, సినీ కెరీర్‌లకు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకుంది. ‘‘ఆడపిల్లల్ని ఓ బరువులా చూడటమన్నది సిగ్గుపడాల్సిన విషయం. నా దృష్టిలో ఈ భూమిపై పుట్టిన ప్రతి ఆడపిల్లా లక్కీనే. మనమంతా మన తల్లిదండ్రులకు కానుకల్లాంటి వాళ్లం. మా నాన్న అనిల్‌ కపూర్‌ నన్నెప్పుడూ ఓ లక్కీ గర్ల్‌లాగే చూసేవారు. నేను తనకు అదృష్టమని నమ్మేవారు’’ అని చెప్పుకొచ్చింది. ఇక తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుంది వివరిస్తూ.. ‘‘ఏ చిత్రంలోనైనా సరే నా పాత్రకు ఎంత నిడివి ఉంది అన్నది నేనెప్పుడూ పట్టించుకోను. పాత్రకు తగిన ప్రాధాన్యత ఉందా లేదా? అన్నదే గమనిస్తా. ఎందుకంటే ఏ చిత్రంలోనూ నేను ఓ డెకరేషన్‌లా మిగిలిపోకూడదని భావిస్తుంటా’’ అని చెప్పుకొచ్చింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.