పొట్టి డ్రెస్‌పై గట్టి జవాబు!

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2’ నటి తారా సుతారియా వెండితరపై నటించింది కేవలం రెండు చిత్రాల్లోనే. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఆమెపై కావల్సినన్ని వార్తలు వస్తున్నాయి. కారణం ఆమె వేసుకున్న డ్రెస్‌పై సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ విరివిగా వస్తుండడమే. ఈ మధ్య ఓ విందు కార్యక్రమానికి హాజరైనపుడు ఆమె వేసుకున్న స్కర్ట్‌ ప్రతి ఒక్కరి దృష్టిని తనవైపు తిప్పుకుందట. మరీ ఇలాంటి పొట్టి దుస్తులు ధరించి వస్తే ఫోటోగ్రాఫర్స్‌ ఊరుకుంటారా? ప్లాఫ్‌ల మీద ఫ్లాష్‌లు కొట్టి కెమెరాల్లో బంధించారు. తరువాత ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఆ డ్రెస్‌పై అంతర్జాలంలో ఒకటే కామెంట్లు. ఈ వార్తలపై ఓ సందర్భంలో తార మాట్లాడుతూ..‘‘కొన్ని కామెంట్లు చాలా బాగుంటాయి. మరికొన్ని హృదయాన్ని గాయపరిచే విధంగానూ ఉంటాయి. కానీ ఇవన్నీ కెరీర్‌లో భాగమే. మంచి సూక్తులను, చెడు మాటలను రెండింటిని స్వీకరించాల్సిందే - తప్పదు. కొన్ని సార్లు అనుకోకుండా నేను కూడా తప్పులు చేయవచ్చు. నాపై వచ్చే కొన్ని వార్తలు మా కుటుంబ సభ్యులను బాధ పెట్టినా, తరువాత అర్థం చేసుకొని, వాటిని పట్టించుకోవడం లేదు’’ అంటూ చెప్పింది. ఈనెల 15న తెరపైకి వచ్చిన ‘మార్జావాన్‌’ చిత్రంలో రితేష్‌ దేశ్‌ముఖ్, సిద్ధార్‌ మల్హోత్రా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లతో కలిసి నటించింది. తారా ప్రస్తుతం మిలాన్‌ లూథారియా దర్శకత్వంలో ‘తడప్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. సుతారియా సినిమాల్లోకి రాకుముందు బుల్లితెరపై సందడి చేసింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.