బెల్‌బాటమ్‌’పై క్లారిటీ ఇచ్చిన అక్షయ్‌
బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో.. ఇప్పుడు మూవీ మిషన్‌గా మారిపోయారు. ఒకేసారి నాలుగైదు చిత్రాలను సెట్స్‌పైకి తీసుకెళ్తూ కుర్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘లక్ష్మీబాంబ్‌’, ‘సూర్యవంశీ’, ‘గుడ్‌ న్యూస్‌’, ‘బచ్చన్‌ పాండే’ వంటి చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ‘బెల్‌ బాటమ్‌’ అనే కొత్త చిత్రాన్నీ ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అక్షయ్‌ ఓ ఖరీదైన ఎరుపు రంగు కారుపై సూటుతో స్టైలిష్‌గా కూర్చోని దర్శనమిచ్చారు. ఆయన తలపై నుంచి ఓ విమానం ఎగురుతూ వెళ్తున్నట్లుగా ఆకట్టుకునేలా ఉంది ఆ లుక్‌. అయితే ఈ సందర్భంగానే ఈ చిత్ర కథకు సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు అక్షయ్‌. ‘‘ఇది ఏ కన్నడ చిత్రానికి రీమేక్‌’’ అంటూ ఓ నెటిజన్‌ ఆయన్ను ప్రశ్నించారు. దీనికి అక్షయ్‌ బదులిస్తూ.. ‘‘ఇది ఏ చిత్రానికీ రీమేక్‌ కాదు. 80ల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమ’’ని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ద్వితియార్థం నుంచి సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రాన్ని 2021 జనవరి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రంజిత్‌.ఎమ్‌.తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.