వెబ్‌ సీరీస్‌ల్లో సినీ హీరోలు

బాలీవుడ్‌ అగ్రకథానాయకులకు ఒక్కో సినిమాకు అందే పారితోషికం భారీగానే ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. అక్షయ్‌ కుమార్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఆయన ఓ వెబ్‌ సిరీస్‌ కోసం తీసుకోబోతున్న పారితోషికం చూసి బాలీవుడ్‌ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థలో ప్రసారం కానున్న ‘ది ఎండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక్క సీజన్‌ కోసం ఆయనకు ఏకంగా రూ.90 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. భారత్‌లో వెబ్‌ సిరీస్‌ సంస్కృతి ఊపందుకొంటోంది. బాలీవుడ్‌లో పేరున్న నటులు కూడా వాటిలో నటిస్తున్నారు. అయితే అగ్రకథానాయకులు మాత్రం వాటి వైపు మొగ్గుచూపడం లేదు. అక్షయ్‌కు కూడా వెబ్‌ సిరీస్‌ చేయడం ఇష్టం లేదట. కానీ ఆయన కుమారుడు ఆరవ్‌ ఓ వెబ్‌ సిరీస్‌లో నటించమని అక్షయ్‌ని కోరారట. దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ అత్యధిక పారితోషికం ఇస్తామని చెప్పి అక్షయ్‌ని ఒప్పించిందట. అగ్రకథానాయకులు తమ వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తే ఆదరణ మరింత పెరుగుతుందని అమెజాన్‌ భావిస్తోందని, అందుకే అక్షయ్‌కి అంత డబ్బు ఇవ్వడానికి సిద్ధమైందని, భవిష్యత్తులో సల్మాన్‌ ఖాన్‌తోనూ ఒప్పందం కుదుర్చుకోబోందని సమాచారం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.