అలియా.. నేను అందుకే విడిపోయాం
‘‘అలియాతో బ్రేకప్‌ వల్ల నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఆ బాధ నుంచి బయటపడటానికి నాకు చాలా రోజుల సమయం పట్టింది’’ అన్నాడు సిద్ధార్థ మల్హోత్రా. ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్‌ జోహర్‌ తెరకెక్కించిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతోనే సిద్ధార్థ్‌ - అలియా భట్‌ వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే అలియా, సిద్ధార్థల మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ల పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కానీ, ఆ తర్వాత వారిద్దరూ తమ బంధాన్ని తెంచుకున్నారు. తాజాగా ఈ బ్రేకప్‌కు గల కారణాల్ని, ప్రేమ కబర్లుని సిద్ధార్థ ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో వెల్లడించాడు. ‘‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’లో నా తొలి సన్నివేశం చిత్రీకరణ అలియాతోనే జరిగింది. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ తర్వాత ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. కానీ, బయటకు వెల్లడించలేని కొన్ని కారణాల వల్ల మా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అలియా తన కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంది. తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాలని భావించింది. ఈ నేపథ్యంలోనే మేము కలిసి ఉండొద్దని నిర్ణయించుకున్నాం. అంతేకానీ విడిపోవడంలో తప్పు ఎవరివైపు లేదు. అలా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ కారణాల వల్లే అలియాకు దూరమయ్యా. ఆ తర్వాత తనని ఎప్పుడూ కలుసుకోలేదు. అలాగని మా మధ్య ఎలాంటి కోపతాపాలు, ద్వేషాలు లేవు. కానీ, ఈ బ్రేకప్‌ కారణంగా చాలా భావోద్వేగానికి గురయ్యా. ఆ సంఘటన నుంచి బయట పడటానికి చాలా రోజులు పట్టింది. ప్రతి జీవితంలో ఇలాంటి ఒడుదొడుకులు ఉంటూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలి అని నా మనసుకు చెప్పుకుంటూ కుదుటపడగలిగా. ఏదేమైనా అలియాతో నా బంధం నాకెన్నో తీపి గుర్తులను, సంతోషకరమైన సంఘటనలను మిగిల్చింది’’ అని చెప్పుకొచ్చాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.