అమితాబ్‌ ఆ కారు అమ్మేశారు
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ కారును అమ్మేశారు. బిగ్‌బి గ్యారేజ్‌లో ఖరీదైన లగ్జరీ కార్లలో ఫాంటమ్‌ ఒకటి. ఈ రోల్స్‌ రాయిస్‌ కారును ప్రముఖ నిర్మాత విధు వినోద్‌ చోప్రా ఆయనకు కానుకగా ఇచ్చారు. 2007లో చోప్రా నిర్మాతగా వ్యవహరించిన ‘ఏకలవ్య’ అనే సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకుంది. ఇందులో అమితాబ్‌ కీలక పాత్ర పోషించారు. సినిమా హిట్‌ అయిన సందర్భంగా బిగ్‌బికి ఈ కారును కానుకగా ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.


అప్పట్లో ఈ కారు ఖరీదు రూ3.5 కోట్లు. అయితే ఇప్పుడు ఈ కారును ఇటీవల మైసూరుకు చెందిన రుమన్‌ ఖాన్‌ అనే వ్యక్తికి అమ్మేశారు. రుమన్‌కు ఇలాంటి లగ్జరీ కార్లను సేకరించడమంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఆయన గ్యారేజ్‌లో ఇలాంటి ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ఈ కారును అమితాబ్‌ అమ్మేయడానికి గల కారణాలు తెలియరాలేదు. ఎంత ధరకు అమ్మారన్న వివరాలు కూడా బయటికి రాలేదు. ఇదే కారులో బచ్చన్‌ ఫ్యామిలీ ముంబయి రోడ్లపై ఎక్కువగా ప్రయాణించేవారు. అందులోనూ అమితాబే ఎక్కువగా కారును నడుపుతూ కెమెరా కళ్లకు చిక్కిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం బిగ్‌బి గ్యారేజ్‌లో మెర్సిడెజ్‌-మేబ్యాక్‌ 5500, బెంట్లీ కాంటినెంటల్‌ జీటీ, ల్యాండ్‌ రోవర్‌, టొయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్సీ 200, పోర్షే కేమ్యాన్‌, రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ, ఆడీ ఏ8ఎల్‌, టొయోటా క్యామ్రీ, మిని కూపర్‌ ఉన్నాయి. ఇటీవల లెక్సస్‌ ఎల్‌ఎక్స్‌ 570 ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ప్రస్తుతం బిగ్‌బి ‘బద్లా’, ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.