ఇతరుల ఆరోగ్యంపై తప్పుడు వార్తలు సరికాదు
‘‘రొకరి ఆరోగ్యం గురించి తప్పుగా వార్తలు రాయడమంటే.. వారి హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది’’ అన్నారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌. ఇటీవల ఆయన సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిగ్‌బి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై బిగ్‌బి సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టతనిచ్చారు. ‘‘తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వ్యక్తిగతంగా ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. కాబట్టి.. మరొకరి ఆరోగ్యం గురించి తప్పుగా వార్తలు సృష్టించడమంటే వారి హక్కులకు, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించడమే అవుతుంది. ఇది సామాజికంగా చట్టవిరుద్ధమైన పని. దీన్ని దృష్టిలో పెట్టుకోని ప్రతిఒక్కరూ ఎదుటివారి హక్కులను గౌరవించండి. ప్రతిసారీ అన్ని విషయాలను బయట ప్రపంచంతో పంచుకోలేము. నా మీద ప్రేమ చూపించిన వారికి, నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన వారికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు అమితాబ్‌. తాజాగా ఆయన ‘సైరా’ చిత్రంలో చిరంజీవికి గరువుగా గోసాయి వెంకన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ చిత్ర విడుదల సమయానికి బిగ్‌బి కాస్త అనారోగ్యానికి గురవడంతో ప్రచార కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు. అయితే విడుదలకు రెండు రోజుల ముందు చిరుతో కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.