షారుఖ్‌పై కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాలీవుడ్‌ బాద్షాగా.. సినీ ప్రియుల మదిలో కింగ్‌ ఖాన్‌గా.. భారతీయ చిత్ర సీమలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకడిగా షారుఖ్‌కు అనేక ప్రత్యేక గుర్తింపులున్నాయి. అయితే మరో వర్గం మాత్రం షారుఖ్‌ అంటే పక్కా కమర్షియల్‌.. డబ్బు కోసం ఎంతటి చెత్త సినిమా అయినా చేస్తుంటాడు. ప్రముఖుల ఇంట శుభకార్యాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేయడానికి వెనుకాడడు అని విమర్శిస్తుంటారు. అయితే తాజాగా ఈ ఉత్తరాది హీరో గురించి విశ్వనటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. కమల్‌ నటించిన తాజా చిత్రం ‘విశ్వరూపం2’ హిందీలోనూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కమల్‌ ఇటీవల ఓ హిందీ ఛానెల్‌తో ముఖాముఖీలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో షారుఖ్‌ డబ్బు మనిషా కాదా అన్న అంశంపై తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. ‘‘నేను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘హేరామ్‌’ అనే సినిమాలో షారుఖ్‌ ఓ కీలక పాత్రలో నటించాడు. అయితే ఆ పాత్ర చేసినందుకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నాతో కలిసి నటించాలన్న కోరికతోనే షారుఖ్‌ ఇలా చేశాడని తెలిసింది. చిత్ర బడ్జెట్‌ పెరిగిపోయిందని తెలిసి ఆయన అడగలేదు. అయితే ఆ చిత్రం విడుదలయ్యాక హిందీ హక్కులు మొత్తం షారుఖ్‌ రాసిచ్చా’’ అని.. షారుఖ్‌ డబ్బు మనిషి కాదనడానికి ఈ ఒక్క ఉదహరణ చాలు అని చెప్పుకొచ్చాడు కమల్‌.


© Sitara 2018.
Powered by WinRace Technologies.