నా విచిత్రమైన వైఖరి ఈనాటిది కాదు!!

‘‘నా చేష్టలు.. విచిత్రమైన వైఖరి.. విభిన్నమైన అలవాట్లు నిన్నమొన్న పుట్టినవి కావు’’ అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌. ఈ యువ హీరో పేరు చెప్పగానే యువతరంలో ఓ తెలియని పూనకం మొదలైపోతుంది. ఆయన వైవిధ్యమైన వస్త్రధారణ.. కిరాకు పుట్టించే యాటిట్యూడ్‌.. చలాకీతనానికి చిరునామాగా నిలిచే ఆయన మాటలు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. అంతేకాదు ఈ లక్షణాలే ఆయన్ని కుర్రకారుకు మరింత దగ్గర చేశాయి. మరి బహిరంగ వేదికలపై ఇంత ఎనర్జిటిక్‌గా కనిపించే రణ్‌వీర్‌ నిజ జీవితంలో ఎలా ఉంటాడు? ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఆయన అభిమానులతో పాటు సినీప్రియుల్లోనూ కనిపిస్తుంటుంది. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు రణ్‌వీర్‌. ‘‘ప్రజల ముందు నేనెప్పుడూ నా నిజ స్వభావాన్నే ప్రదర్శిస్తుంటా. నాది ఓ విభిన్నమైన మనస్తత్వం అని నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. దాన్ని నేనెప్పుడూ దాచి పెట్టే ప్రయత్నం చేయలేదు. చాలా మంది నేను అందరిలా ప్రవర్తించనని అంటుంటారు. కానీ, నా వ్యవహార శైలి చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. దాన్ని మార్చుకోవడం ఇష్టం ఉండదు. వేరే వారిలాగా మారడాన్ని ఎప్పుడూ ఇష్టపడను. నన్ను నాలా.. నిష్కల్మషమైన దృష్టితో చూసేవాళ్లు కేవలం నా బాల్య మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే. వాళ్లకు మాత్రమే తెలుసు.. నా ఈ విచిత్రమైన చేష్టలు.. వైవిధ్యమైన వైఖరి నిన్నమొన్న పుట్టుకొచ్చినవి కావని. నా వస్త్రధారణ సైతం మొదటి నుంచి ఇలా విభిన్నంగానే ఉంది. మూడో తరగతిలోనే మోహాక్‌ హెయిర్‌ స్టైల్‌ ట్రై చేశా. దాని ఇటీవల సోషల్‌ మీడియాలోనూ షేర్‌ చేశా. అలాంటి చిత్రాలు నా దగ్గర బోలెడన్ని ఉన్నాయి. వాటన్నింటినీ జనాలు చూస్తే.. నా అలవాట్లు, ఆలోచనా తీరుని ఇంకా మెరుగ్గా గ్రహించగలుగుతారు. ఇదంతా నేను ఏదో నాకు ప్రచారం దక్కాలని, అందరి దృష్టినీ ఆకర్షించాలని చేస్తున్న పనులైతే కావు. అందుకే నా వ్యక్తిత్వంపై వచ్చే విమర్శలను ఎప్పుడూ పట్టించుకోదలచుకోలేదు’’ అన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.