గాయకుడిగా మారిన కింగ్‌ఖాన్‌..
‘జీరో’ చిత్ర ఫలితమిచ్చిన షాక్‌తో.. ఇకపై సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటున్నాడు షారుఖ్‌ ఖాన్‌. ప్రస్తుతానికైతే కొన్ని రోజుల పాటు సినిమాలకు సెలవుపెట్టి క్రికెట్‌పై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యాడు. షారుఖ్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే 12వ ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో తన జట్టును విజయపథంలో నడింపించేందుకు కింగ్‌ ఖాన్‌ స్వయంగా రంగంలోకి దిగాడు. ఇందులో భాగంగా తన జట్టు కోసం గాయకుడిగా కొత్త అవతారమెత్తాడు షారుఖ్‌. నైట్‌రైడర్స్‌ జట్టు సభ్యుల్లో, అభిమానుల్లో ఉత్సాహం నింపే విధంగా ఈ తాజా సీజన్‌ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేయించాడట బాలీవుడ్‌ బాద్షా. బప్పి లహరి కుమారుడు ఈ పాటకు స్వరాలు సమకూర్చగా.. షారుఖ్‌ స్వయంగా ఆలపించాడట. దీని కోసం పాటను అనేక సార్లు రిహార్సల్స్‌ చేశాడట కింగ్‌ ఖాన్‌. ఇప్పుడీ పాటే కోల్‌కతా జట్టు గీతంగా ఉండబోతుందట. త్వరలోనే దీన్ని ఆన్‌లైన్లో విడుదల చేయనున్నారు. 2008లో తొలి ఐపీఎల్‌ సీజన్‌ మొదలవగా.. ఇప్పటి వరకు 11 సీజన్లు పూర్తి చేసుకుంది. 2012, 2014ల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్స్‌ దక్కించుకొంది. ఇక ఈ 12వ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన తర్వాత షారుఖ్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.