ఈ దేశీ అవెంజర్స్‌ సర్‌ప్రైజ్‌ చూశారా..

క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీని రన్‌ మిషన్‌ అన్నట్లు ఇకపై చిత్రసీమలో అక్షయ్‌ కుమార్‌ను మూవీ మిషన్‌గా చెప్పుకోవాలేమో. ఎందుకంటే సినిమాల విషయంలో ఆయన చూపిస్తున్న దూకుడు అలా ఉంది మరి. సీజన్‌కి ఓ చిత్రమన్నట్లు లెక్కపెట్టుకోని మరీ ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలను బాక్సాఫీస్‌ ముందుకు పట్టుకొస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘కేసరి’, ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన అక్షయ్‌.. ఇప్పుడు ‘హౌస్‌ఫుల్‌ 4’తో వినోదాల జల్లుల్లో తడిపేయబోతున్నాడు. ఇది దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పుడీ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడిపేస్తూనే.. మరోవైపు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సూర్యవంశీ’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇందులో ఆయన ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర ఫొటో బయటకొచ్చింది. ఈ ఫొటోలో అక్షయ్‌తో పాటు మరో ఇద్దరు పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారులు దర్శనమిచ్చారు. ఇంతకీ వాళ్లు మరెవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రణ్‌వీర్‌ సింగ్, అజయ్‌ దేవగణ్‌. వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో తళుక్కున మెరవబోతున్నారు. ఈ చిత్రాన్ని అక్షయ్‌ తన ట్విటర్‌లో పంచుకుంటూ ఓ ఆసక్తికర వ్యాఖ్యను కూడా జోడించారు. ‘‘దేశీ అవెంజర్స్‌ ఆఫ్‌ ద కాప్‌ యూనివర్స్‌’’ అంటూ ‘సింగం’, ‘సింబా’ మీట్స్‌ ‘సూర్యవంశీ’ అని పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 2020 మార్చి 27న విడుదల చేయబోతున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. అజయ్, రణ్‌వీర్‌ ఇప్పటికే రోహిత్‌ దర్శకత్వంలో ‘సింగం’, ‘సింబా’ చిత్రాల్లో పోలీస్‌ పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడా స్నేహంతోనే ‘సూర్యవంశీ’లో అతిథి పాత్రలు చేసేందుకు ముందుకొచ్చారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.