సెట్స్‌పైకి ‘పృథ్విరాజ్‌’

ఇటీవలే ‘హౌస్‌ఫుల్‌ 4’తో ప్రేక్షకుల్ని పలకరించిన అక్షయ్‌ కుమార్‌.. ఇప్పుడు ‘గుడ్‌న్యూస్‌’ చిత్రంతో సినీప్రియుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. అయితే తాజాగా అక్షయ్‌ మరో శుభవార్తను వినిపించారు. తన కొత్త చిత్రం ‘పృథ్విరాజ్‌’ను ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించినట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోనూ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇది అక్షయ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం. 1178 నుంచి 1192 మధ్య కాలంలో అజ్మేర్, దిల్లీ ప్రాంతాలను పాలించిన మహారాజా పృథ్విరాజ్‌ చౌహాన్‌ జీవితాధారంగా రూపొందిస్తున్నారు. భారత దేశానికి చెందిన అత్యంత పరాక్రమవంతులైన రాజుల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. దీన్ని ప్రముఖ దర్శకుడు చంద్రప్రకాశ్‌ ద్వివేది తెరకెక్కించనుండగా.. ప్రఖ్యాత యష్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. అక్షయ్‌కు జోడీగా మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషీ చిల్లర్‌ కనిపించబోతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.