‘చ్చిచ్చొరే’... కుక్క తోక వంకరే!
దంగల్‌’తో సంచలన విజయాన్ని అందుకుని పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు నితేష్‌ తివారి. అప్పట్నుంచి అతని తర్వాతి చిత్రం ఎలా ఉండబోతోందా అన్న ఆసక్తి నెలకొంది. ఈసారి ఓ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు నితేష్‌. యువ నాయకానాయికలు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో ‘చ్చిచ్చొరే’ పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ఈమధ్యే ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి శ్రద్ధా పంచుకున్న ఫస్ట్‌లుక్‌ ఆసక్తి రేపుతోంది. గ్రూప్‌ ఫొటోలా ఉన్న పోస్టర్‌లో శ్రద్ధ, సుశాంత్‌లతో పాటు ఇతర కీలక పాత్రధారులు నడి వయస్కులుగా, యుక్త వయసులో ఉన్న విద్యార్థులుగా రెండు రకాల గెటప్పుల్లో కనిపిస్తున్నారు. ఇది ఇంజినీరింగ్‌ కళాశాల నేపథ్యంలో జరిగే కథ అని సమాచారం. తెంపరి తనంతో ఉండే విద్యార్థి జీవితంలో విరిసిన స్నేహబంధానికి, బరువు బాధ్యతల జీవిత గమనంలో ఎలాంటి అనుభవాలు, అనుభూతులు ఎదురయ్యాయన్న కథాంశంతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్‌కు ఉపశీర్షికగా కుక్క తోక వంకర అని అర్థం వచ్చే ‘కుత్తే కీ దమ్, తేడీ కీ తేడీ’ అనే హిందీ సామెతను పెట్టారు. దీన్ని బట్టే ఇది ఎంత సరదా చిత్రమో అర్థమవుతోంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.