ఆ బాలీవుడ్‌ రీమేక్‌లో.. రానా - విశ్వక్‌??

అటు కథానాయకుడిగా నటిస్తూనే ఇటు అవకాశం దొరికినప్పుడల్లా ప్రతినాయక పాత్రలతోనూ అలరిస్తున్నారు రానా. అందుకే ఆయనకి అటు ఉత్తరాదిలోనూ ఇటు దక్షిణాదిలోనూ సినీప్రియుల్లో చక్కటి క్రేజ్‌ ఉంది. ఇప్పుడీ యువ హీరో ఓ బాలీవుడ్‌ హిట్‌ రీమేక్‌పై కన్నేశారట. ఓ మినీ మల్టీస్టారర్‌గా రూపొందబోయే ఈ చిత్రంలో ఆయన మరో యువ హీరో విశ్వక్‌ సేన్‌తో తెర పంచుకోబోతున్నారట. ఇంతకీ భల్లాలుడు మనసు పడిన ఆ హిందీ హిట్‌ మరేదో కాదు.. కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా నటించిన ‘సోను కే టిటు కి స్వీటీ’. ఈ సినిమాతోనే కార్తీక్‌ బాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడీ చిత్రాన్నే తెలుగులో చేయబోతున్నారట రానా. నిజానికి ఈ చిత్రాన్ని అల్లు అర్జున్‌ చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, తర్వాత త్రివిక్రమ్‌ లైన్లోకి రావడంతో బన్ని ఈ రీమేక్‌ను పక్కకు పెట్టేశారు. అయితే ఇప్పుడీ కథ రానాకు విపరీతంగా నచ్చేయడంతో దీన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడట. అంతేకాదు.. దీన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చమని ఓ స్టార్‌ దర్శకరచయితకు పనులు కూడా అప్పజెప్పారట. ఇందులో మరో కథానాయకుడి ఛాన్స్‌ ఉండటంతో ఆ పాత్ర కోసం విశ్వక్‌ సేన్‌ను తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట రానా. ఇటీవలే వీళ్లిద్దరూ కలిసినట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిజమే అయినా ఇది పట్టాలెక్కాలంటే మరింత సమయమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’, ‘హాథీ మేరీ సాథీ’ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.