స్నేహం కోసం రాకెట్‌ ఎక్కుతున్నారట

ప్రముఖ మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథతో తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ప్రముఖ నటుడు మాధవన్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రమిది. ట్రైకలర్‌ ఫిలింస్, విజయ్‌ మూలన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం అటు బాలీవుడ్‌ ఇటు కోలీవుడ్‌లలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అదేంటంటే.. ఈ సినిమా బాలీవుడ్‌ వెర్షన్‌లో కింగ్‌ షారుక్‌ ఖాన్, తమిళ వెర్షన్‌లో స్టార్‌ హీరో సూర్య అతిథి పాత్రల్లో మెరవబోతున్నారట. మాధవన్‌తో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన కోరిక మేరకు ఇద్దరూ అతిథి పాత్రల్లో కనిపించేందుకు అంగీకరించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఇందులో మ్యాడీకి జోడీగా సిమ్రన్‌ నటిస్తోన్నట్లు తెలుస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో నంబి నారాయణన్‌ చేసిన కృషి అసామాన్యమైనది. గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఒకానొక సమయంలో దేశ రహస్యాలను శత్రు దేశాలకు చేరవేశాడన్న ఆరోపణల కారణం దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ అనంతరం నారాయణన్‌పై వచ్చిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేయడంతో పాటు.. ఆయనపై ఆరోపణలు చేసినందుకు గానూ ప్రభుత్వాన్ని రూ.50 లక్షలు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది. ఇప్పుడీ కథతోనే ‘రాకెట్రీ’ని రూపొందించబోతున్నారట.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.