అక్కీకి సల్మాన్‌ భలే షాకిచ్చాడుగా..
ద్‌ వస్తుందంటే బాలీవుడ్‌ సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూసేది సల్మాన్‌ ఖాన్‌ కొత్త చిత్రం కోసమే. ప్రతి రంజాన్‌కు ఓ కొత్త చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించడం సల్మాన్‌కు అలవాటు. అందుకే ఆయన్ని ఈద్‌ కథానాయకుడిగా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడీయన నుంచి మరో ఈద్‌ కానుక సిద్ధమైపోయింది. రాబోయే రంజాన్‌కు ఆయన ‘రాధే’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌.. అనేది చిత్ర ఉపశీర్షిక. ‘దబాంగ్‌ 3’ తర్వాత ప్రభుదేవా - సల్మాన్‌ కలిసి చేయనున్న చిత్రమిది. తాజాగా చిత్ర విడుదలను ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా బయటకొదిలారు. అయితే ఇప్పుడీ సల్మాన్‌ ప్రాజెక్టు అక్షయ్‌ కుమార్‌కు ఓ షాక్‌ లాంటిదే అని చెప్పుకోవాలి. వాస్తవానికి ఈ చిత్రం స్థానంలో సల్లూభాయ్‌ ‘ఇన్షా అల్లా’ అనే చిత్రాన్ని తీసుకురావాల్సి ఉంది. సంజయ్‌ లీలా భన్సాలీతో చేయాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఈద్‌కు సల్మాన్‌ రావడం కష్టమే అనుకున్నారు సినీప్రియులంతా. ఈ నేపథ్యంలోనే ఈద్‌కు ఖాళీగా ఉన్న బాక్సాఫీస్‌ను ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రంతో భర్తీ చేసేందుకు రెడీ అయ్యారు అక్షయ్‌ కుమార్‌. దక్షిణాది హిట్‌ చిత్రం ‘కాంచన’కు రీమేక్‌గా ప్రముఖ దర్శకుడు రాఘవ లారెన్స్‌ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. దీన్ని రంజాన్‌ కానుకగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా ఇదే ఈద్‌ రేసులోకి సల్మాన్‌ వచ్చి చేరడంతో బాక్సాఫీస్‌ వద్ద పోరు రసవత్తరంగా మారింది. ‘లక్ష్మీబాంబ్‌’ ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుండగా.. ‘రాధే’ ఇంకా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. రంజాన్‌కు ఎలాగూ మరో 8నెలల సమయమున్న నేపథ్యంలో ఈలోపు ‘రాధే’ సిద్ధమవడం పెద్ద విశేషం కాదు. అయితే ఇప్పుడీ ఈద్‌ రేసులో సల్మాన్‌ - అక్షయ్‌లలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.