‘ప్రస్థానం’పై బాలీవుడ్‌ చూపు

ఒకప్పుడు ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాలను తెలుగులోకి రీమేక్‌ చేసేవారు. అక్కడ మోస్తారు విజయం సాధించిన చిత్రమైనా సరే, ఇక్కడి కథానాయకుల ఇమేజ్‌కు సరిపోతుందనుకుంటే కాస్తంత తెలుగు రుచి తగిలించి వెండితెరపై తిరిగి వడ్డించేసేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి మారింది. బాలీవుడ్‌ చిత్ర సీమ టాలీవుడ్‌ రుచుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక్కడ సత్తా చాటిన ఏ చిత్రాన్ని రీమేక్‌ చేయకుండా వదలడం లేదు. ఇక ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాల దెబ్బకు ఈ టాలీవుడ్‌ కథల ఎగుమతుల జాబితా మరింత ఎక్కువైంది. ఇటీవలే తెలుగు ‘క్షణం’ చిత్రానికి రీమేక్‌ తెరకెక్కిన ‘బాఘీ-2’ బాలీవుడ్‌లో చక్కటి ఆదరణ పొందగా, తాజాగా ‘అర్జున్‌ రెడ్డి’కి బాలీవుడ్‌ రీమేక్‌ సెట్స్‌పైకి వెళ్లింది. తాజా ఈ టాలీవుడ్‌ రీమేక్‌ల జాబితాలోకి మరో చిత్రం వచ్చి చేరింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న తెలుగు చిత్రం ‘ప్రస్థానం’ బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. ‘ప్రస్థానం’ పేరుతోనే తెరకెక్కనున్న ఆ చిత్రంలో ప్రముఖ కథానాయకుడు సంజయ్‌దత్‌ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన దేవా కట్టానే రీమేక్‌ చిత్రానికీ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి రీమేక్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సంజయ్‌ దత్‌ కుమారుడిగా ఓ కీలక పాత్రలో అలీ ఫజల్‌, అతని ప్రియురాలిగా అమైరా దస్తూర్‌ నటించనున్నారు. గతంలో ‘రాస్కెల్స్‌’తో పాటు మరికొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన సంజయ్‌దత్‌ ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ చిత్రంతోనే నిర్మాణంలో అడుగుపెట్టారు. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం జూన్‌ మొదటి వారంలో సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.© Sitara 2018.
Powered by WinRace Technologies.