బిగ్‌బి ప్రాణాపాయం నుంచి బయటకొచ్చిన వేళ!!
* వైరల్‌ అవుతున్న 37 ఏళ్ల నాటి వీడియో..

సరిగ్గా 37 ఏళ్ల క్రితం.. 1982 జులై 26వ తేదీన జరిగిన ఓ సంఘటన బాలీవుడ్‌ ప్రేక్షకులనే కాదు.. యావత్‌ భారతీయ సినీప్రియులను కలవరపాటుకు గురిచేసింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఆరోజు దాదాపు మృత్యుకోరల వరకు వెళ్లి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ‘కూలీ’ చిత్రీకరణ సమయంలో జరిగిన ఈ ప్రమాదం వల్ల ఆయన తీవ్రంగా గాయపడి దాదాపు రెండు నెలల పాటు పూర్తిగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకోని 1982 సెప్టెంబరు 24న ఆయన క్షేమంగా ఆస్పత్రి నుంచి తన ఇంట్లోకి అడుగుపెట్టారు. అందుకే ఈ రోజు బిగ్‌బి అభిమానులు ఆయన రెండవ పుట్టినరోజుగా అభివర్ణిస్తుంటారు. దాదాపు 37 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఏరోజునైతే ఆయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారో.. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత అదే రోజు ఆయనకు చలన చిత్రసీమలోని అత్యున్నత పురస్కారమైన ‘దాదాసాహెబ్‌ పాల్కే’ను ప్రకటించినట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం. తాజాగా నెట్టింట సందడి చేస్తోన్న ఈ వీడియోలో బిగ్‌బి ఆస్పత్రి నుంచి తన ఇంటికి కారులో రావడం. కారు దిగగానే అమితాబ్‌ తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ కాళ్లకు ఆయన నమస్కరించడం వంటివి ఈ వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఆయన తన తల్లి తేజీ బచ్చన్‌ వద్దకు వెళ్లి ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. చివర్లో బిగ్‌బి తాను ప్రమాదం నుంచి బయటపడిన తీరును ఇంటర్వ్యూలో వెళ్లడిస్తూ కనిపించారు. ప్రస్తుతం దీనికి నెట్టింట ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.