ఆస్కార్‌ రేసుకు ‘గల్లీబాయ్‌’
బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ 'గల్లీబాయ్‌' ప్రపంచ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ సినిమా 92వ ఆస్కార్‌ అవార్డుల బరిలోకి దిగింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా భారత్‌ తరపున ఆస్కార్‌ రేసులో పోటీపడనుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ''గల్లీబాయ్‌' 92వ ఆస్కార్‌ అవార్డుల బరిలో పోటీపడేందుకు ఎంపికైంది. మన టైం వచ్చేసింది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. జోయా అక్తర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ తదితర చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు'’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ కోసం జ్యూరీ వివిధ భాషలకు చెందిన 28 సినిమాలను ఎంపిక చేశారు. వీటిలో తెలుగు నుంచి 'డియర్‌ కామ్రేడ్' కూడా పోటీలో నిలిచింది. అన్నీ చిత్రాల్ని చూసిన జ్యూరీ సభ్యులు చివరికి 'గల్లీబాయ్‌'ను ఎంపిక చేశారు.


'గల్లీబాయ్‌'లో రణ్‌వీర్‌, ఆలియా జంటగా నటించారు. జోయా అక్తర్‌ దర్శకత్వం వహించారు. మురికివాడలో జన్మించిన రణ్‌వీర్‌ సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేయాలని కలలే కనే వ్యక్తిగా కనిపించాడు. ఎంతో కష్టపడి ర్యాప్‌ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. ఈ కథాంశంతో రూపొందిన సినిమా ఫిబ్రవరి 14న విడుదలైన మంచి విజయం అందుకుంది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సుమారు రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.