డ్రాగన్‌ దేశంలో.. ‘పియానో ప్లేయర్‌’

చక్కటి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ వైవిధ్యభరిత నటుడిగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయుష్మాన్‌ ఖురానా. ఈ యువహీరో గతేడాది ‘అంధాధున్‌’ చిత్రంతో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ‘పియానో ప్లేయర్‌’ పేరుతో చైనా ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సామాజిక మాధ్యమాల వేదికగా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ‘‘నా చిత్రం చైనాలో విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది. 10ఏళ్ల క్రితం నేను చైనా వెళ్లా. బీజింగ్‌ కేఫ్‌ రోడ్డులో నడస్తూ వెళ్తుంటే బిగ్‌ స్క్రీన్‌పై బాలీవుడ్‌ సినిమా నడుస్తోందని తెలిసి అక్కడి వెళ్లా. అది నాసీర్‌ హుస్సేన్‌ నటించిన ‘కార్వన్‌’ చిత్రం. అది భారతీయుల ఫేవరెట్‌ మూవీ అని అక్కడి వారికి చెప్పా. ఇన్నాళ్లకు నా చిత్రం కూడా అక్కడ విడుదలవుతోంది. దీనికోసం నేనెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఓ డార్క్‌ కామెడి థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆయుష్‌ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించగా.. ఆయనకు జోడీగా రాధికా ఆప్టే నటించింది. అలనాటి హీరోయిన్‌ టబు ముఖ్య పాత్రలో దర్శనమిచ్చింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.