24కోట్లు.. 25కోట్లు.. 29కోట్లు.. ‘సాహో’కి ఏంటీ క్రేజ్‌!!

‘బాహుబలి’తో ఉత్తరాదిలో ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడిందని ఇప్పటి వరకు సినీవర్గాలు చెబుతూ వచ్చాయి. కానీ, ఇప్పుడా క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో ప్రతి ఒక్కరికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి ‘సాహో’ హిందీ వసూళ్లు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రానికి సినీప్రియులు, సినీ విశ్లేషకుల నుంచి నెగిటీవ్‌ టాక్‌ వచ్చినప్పటికీ అది హిందీ ప్రేక్షకులను ఏ మాత్రం ప్రభావితం చేయట్లేదు. అందుకే ‘సాహో’ హిందీ వెర్షన్‌కు రోజురోజుకూ వసూళ్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తొలిరోజు ఈ చిత్రాన్ని అక్కడ రూ.24.40 కోట్ల షేర్‌ దక్కగా.. శనివారం అది రూ.25.20 కోట్లకు పెరిగింది. ఇక ఆదివారం మరింత జోరు చూపించిన ఈ చిత్రం ఏకంగా రూ.29.48 కోట్ల కలెక్షన్లను రాబట్టి సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే మూడు రోజులకు గానూ ‘సాహో’ హిందీలో రూ.79.08 కోట్ల షేర్‌ను దక్కించుకున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక ఈరోజు వినాయక చవితి సెలవు కావడంతో నేడు కూడా బాక్సాఫీస్‌ వద్ద ఇదే జోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం హిందీలో ప్రభాస్‌కు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే మరో రెండు, మూడు రోజుల్లో రూ.100 కోట్ల మార్కును చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక దక్షిణాది వైపు చూసినా ఇక్కడ కూడా ‘సాహో’ వసూళ్లు నిలకడగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్లాప్‌ టాక్‌ ప్రభావం వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఈ నేపథ్యంలోనే మూడు రోజులకు గానూ ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల షేర్‌ రాబట్టినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అయితే ముందుగానే ఈ చిత్రానికి మంగళవారం వరకు అడ్వాన్సు బుకింగ్‌లు పూర్తయిన నేపథ్యంలో రేపటి నుంచి వసూళ్లు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ‘సాహో’కు దక్కుతున్న ఆదరణ చిత్ర నిర్మాతలకు కాస్త ఉపశమనాన్ని ఇస్తోందనే చెప్పొచ్చు.


సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.