
‘బాహుబలి’లో భల్లాల దేవుడిగా రానా ఎంట్రీ ప్రతిఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఓ భీకరమైన ఎద్దుతో అదిరిపోయే పోరాటం చేసి దాన్ని ఒక్క దెబ్బతో మట్టి కరిపిస్తాడు. అయితే అందులో ఆయన ప్రతినాయకుడిగా ఎంత క్రూరంగా ప్రవర్తించినా మనిషి అందగానే దర్శనమిచ్చాడు. కానీ, ఇప్పుడు మరో క్రూరమైన ఆహార్యంతో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు రానా. తాజాగా అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతిసనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హెచ్ఎఫ్ 4’. ఈ చిత్రంలో రానానే ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా అందరి దృష్టినీ విశేషంగా ఆకట్టుకుంది రానా రూపమే. గడ్డం, ముఖం నిండా గాట్లుతో అతడు తోడేలుతో చేసే పోరాటం భీతిగొల్పేలా కనిపించింది. ఇది ‘పద్మావత్’ చిత్రంలో అల్లాఉద్దీన్ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ పాత్ర ఆహార్యంకు దగ్గరగా కనిపించింది. 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకుడు.