‘ప్రేమికుడు’ ఊర్వశీని రణ్‌వీర్‌ భలే పాడేశాడుగా!!

ఆర్‌ రెహమాన్‌ స్వరపర్చిన అద్భుతమైన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో ‘ప్రేమికుడు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 1994లో విడుదలైన ఈ చిత్రం ఇటు దక్షిణాదిలో అటు ఉత్తరాదిలో సినీప్రియుల్ని ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘‘ముక్కాబుల్లా..’’, ‘‘ఊర్వశీ..’’ గీతాలు నాటి నుంచి నేటి వరకు యువతరం మదిలో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ ఆల్బమ్‌లోని పాటల్లో ‘‘టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశీ’’ పాట అంటే తనకు కూడా ఎంతో ఇష్టమన్నారు రణ్‌వీర్‌ సింగ్‌. తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఈపాటను తాను ప్రతిరోజూ వింటుంటానని, అందుకే ఆ పాటను ఇప్పటికీ తన మదిలో చిరస్థాయిగా నిలిచిపోయినట్లు రణ్‌వీర్‌ తెలియజేశారు. అంతేకాదు.. ఈ పాట హిందీ వెర్షన్‌ను ఎంతో చక్కగా ఆలపించి చూపించారు రణ్‌వీర్‌. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఏఆర్‌ రెహమాన్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ సందడి చేస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.