అనుబంధం ముదురుతోంది.. బాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడో!!
విజయ్‌ దేవరకొండ.. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమ మొత్తం ఈ హీరో నామ జపమే చేస్తోంది. ఈ కుర్రహీరో కాల్షీట్ల కోసం బడా బడా నిర్మాణ సంస్థలు క్యూ కడుతుంటే.. మరోవైపు అగ్ర దర్శకులు సైతం కథలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ క్రేజ్‌ కేవలం దక్షిణాది వరకే పరిమితమైంది కాదు. ‘అర్జున్‌రెడ్డి’ పుణ్యామాని ఉత్తరాది సినీప్రియుల్లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు విజయ్‌. అందుకే ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు గతకొంత కాలంగా బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రౌడీని బాలీవుడ్‌ తెరకు పరిచయం చేసేందుకు సరికొత్త కథలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే వీరందరి కన్నా ముందు వరుసలో ఉంది మాత్రం బాలీవుడ్‌ అగ్ర నిర్మాత కరణ్‌ జోహారే అని చెప్పాలి. ఇప్పటికే విజయ్‌ కూడా పలు సందర్భాల్లో ‘కరణ్‌తో బాలీవుడ్‌ ఇంట్రీ ఇవ్వబోతున్నట్లు’ చెప్పేశాడు. అయితే ఇది ఇంతవరకు కార్యరూపం దాల్చనప్పటికీ కరణ్‌ - విజయ్‌ల అనుబంధం మాత్రం రోజు రోజుకూ ముదురుతోంది. ముంబయిలో కరణ్ ఏ వేడుక నిర్వహించినా తప్పకుండా రౌడీ హీరోను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాడు. అతను కూడా కరణ్‌ పిలవడమే ఆలస్యమన్నట్లుగా ముంబయిలో బాలీవుడ్‌ స్టార్స్‌తో కలిసి వేడుకలను తెగ ఎంజాయ్‌ చేసేస్తున్నాడు. తాజాగా కూడా ఓ పార్టీ నిమిత్తం ముంబయిలో దర్శనమిచ్చాడు విజయ్‌. కరణ్‌ ఏర్పాటు చేసిన ఈ వేడుకలో దేవరకొండే స్పెష్టల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడట. ఖరీదైన నేవీ బ్లూ షూట్‌లో అరుదైన గుస్సీ బ్రాండ్‌ స్లిప్పర్స్‌తో బాలీవుడ్‌ స్టార్లు సైతం షాక్‌ అయ్యేలా స్టైలిష్‌గా సందడి చేశాడట. ఈ సందర్భంగా మరోసారి విజయ్‌ - కరణ్‌ల మధ్య బాలీవుడ్‌ ఎంట్రీపై చర్చలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో వాస్తవమెంతన్నది కచ్చితంగా తెలియనప్పటికీ, కరణ్‌ - విజయ్‌ ఇలా తరుచూ ముంబయిలో కలుస్తుండటంతో త్వరలోనే రౌడీ బాలీవుడ్‌ ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చేటట్లు కనిపిస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.