బాలీవుడ్ నవ్వుల రేడు... మెహమూద్

డోసన్ చిత్రంలో పిళ్ళై మాస్టర్జీ అభినయించే ‘ఏక్ చతుర్ నార్ కర్ కే సింగార్’, లాఖోం మే ఏక్ చిత్రంలో ‘చందా ఓ చందా’, జోహార్-మెహమూద్ ఇన్ బాంబే లో ‘దో దివానే దిల్ కే’, గుమ్ నామ్ లో ‘హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై’, బూత్ బంగ్లా సినిమాలో ‘ఆవో ట్విస్ట్ కరే’ దో ఫూల్ చిత్రంలో ‘ముత్తు కుళ్ళికవారి గళ్ళ’ పాటలు బహుశా విననివాళ్ళు తక్కువమందే వుంటారు. ఈ పాటలకు అభినయం చేసింది ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు మెహమూద్. నలభై సంవత్సరాలు హిందీ చిత్ర రంగాన్ని తన హాస్య నటనతో మురిపించిన నవ్వుల రేడు మెహమూద్. అతడు కేవలం హాస్యనటుడే కాదు ఒక మంచి గాయకుడు, నిర్మాత, దర్శకుడు... అన్నిటికీ మించి మానవత్వం మూర్తీభవించిన స్నేహశీలి. అమితాబ్ బచ్చన్, రాహుల్ దేవ్ బర్మన్, రాజేష్ రోషన్ ల వంటి నిష్ణాతులకు మార్గదర్శి. మీనాకుమారి వంటి నటీమణికి టేబుల్ టెన్నిస్ ఆటలో శిక్షణ ఇచ్చిన క్రీడాకారుడు. జూలై 23న మెహమూద్ 15వ వర్ధంతి. ఈ సందర్భంగా మెహమూద్ ని ఒకసారి తలచుకుంటే...

తొలిరోజుల్లో...
మెహమూద్ గా పిలుచుకొనే బాలీవుడ్ హాస్యనటుడు అసలుపేరు మెహమూద్ ఆలి. సెప్టెంబరు 29, 1932 న మెహమూద్ బొంబాయిలో జన్మించారు. అతని తండ్రి ముంతాజ్ ఆలి చాలా కాలం క్రితమే బొంబాయి వచ్చి రంగస్థల నటుడుగా స్థిరపడ్డారు. ముంతాజ్ ఆలికి రంగస్థల నటుడిగానే కాదు, సినిమా నటుడిగా, మంచి నాట్యాచార్యుడుగా కూడా అప్పట్లో మంచి పేరుండేది. తల్లి లతిఫున్నిసా గృహిణి. మెహమూద్ కి ఒక అక్క, ఆరుగురు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వుండేవారు. అతని అక్క మీనూ ముంతాజ్ కూడా సినిమా నటిగా పేరుతెచ్చుకుంది. మెహమూద్ పూర్వీకులు తమిళులు. మెహమూద్ తాత ఆర్కాట్ నవాబుగా వుండేవారు. అతణ్ణి నవాబ్ ఆఫ్ కర్ణాటక గా కూడా పిలిచేవారు. అందుకే మెహమూద్ వాచకంలో తమిళ యాస అక్కడక్కడా కనిపిస్తూ వుంటుంది. మెహమూద్ సినీ ప్రస్థానం బాలనటుడుగా మొదలైంది. తన తండ్రితో కలిసి మెహమూద్ సినీ స్టూడియోలకు వెళుతూ వుండేవారు. అప్పుడే బాంబే టాకీస్ వారు నిర్మించిన ‘కిస్మత్’ (1943) చిత్రంలో ‘మదన్’ అనే బాలుడి పాత్రను మెహమూద్ తొలిసారి పోషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ సినిమా నిర్మాణం జరిగింది. గ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశోక్ కుమార్, ముంతాజ్ శాంతి, షా నవాజ్, చంద్రప్రభ నటించారు. ఈ సినిమా బొంబాయిలో మూడు సంవత్సరాలపాటు ఆడటం విశేషమైతే, ద్విపాత్రాభినయం చేసిన అశోక్ కుమార్ కు సూపర్ స్టార్ హోదా తెచ్చిపెట్టిన సినిమా కూడా ఇదే కావడం మరో విశేషం. ఎ.ఆర్. కర్దార్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘సన్యాసి’ (1945) చిత్రంలో కూడా మెహమూద్ బాలనటుడిగా ఒక చిన్న పాత్రలో నటించారు. కాస్త పెద్దవాడయ్యాక రాజకుమార్ సంతోషి తండ్రి దర్శకుడు పి.ఎల్. సంతోషి వద్ద మెహమూద్ డ్రైవర్ గా పనిచేశారు. కొంతకాలం మీనాకుమారికి టేబుల్ టెన్నిస్ కోచ్ గా వ్యహరించారు. అప్పుడే మీనాకుమారి అక్క మధు ని పెళ్లి చేసుకున్నారు. మధుని పెళ్లిచేసుకున్న తరవాతే మెహమూద్ కి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక కలిగింది. బిమల్ రాయ్ నిర్మించిన ‘దో బిఘా జమీన్’ చిత్రంలో చిరువ్యాపారి పాత్ర దొరికింది. తరవాత ఫిల్మిస్థాన్ వారు ఐ.ఎస్. జోహార్ దర్శకత్వంలో నిర్మించిన ‘నాస్తిక్’ (1954) చిత్రంలో రాజ్ మెహ్రా కు ఆంతరంగికుడుగా నటించారు. ఈ సూపర్ హిట్ చిత్రం 50 వారాలకు పైగా ఆడి గోల్డన్ జూబిలీ చేసుకుంది. తరవాత గురుదత్ రాజ్ ఖోస్లా దర్శకత్వంలో నిర్మించిన ‘సిఐడి’ (1956) చిత్రంలో మెహమూద్ కు కిల్లర్ షేర్ సింగ్ అనే మంచి పాత్ర లభించింది. మెహమూద్ ఎప్పుడూ హైదరాబాద్ ఉర్దు యాసలో సంభాషణలు పలికేవాడు. అది ఒక కొత్తరకం ట్రెండ్ ను సృష్టించింది. 1959లో సూపర్ పిక్చర్స్ తరఫున షేక్ ముఖ్తర్, నందా నటించిన ఆస్పి ఇరాని సినిమా ‘ఖైది నంబర్ 911’లో మెహమూద్ ‘ఆనంద్’ పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్టే. గురుదత్ దర్శకత్వం వహించి నిర్మించిన ‘కాగజ్ కే ఫూల్’ (1959)లో కూడా మెహమూద్ నటించారు. బాంబే టాకీస్ సంస్థకు పనిచేస్తున్నప్పుడు మెహమూద్ చాలామంది నటులతో పరిచయాలు పెంచుకున్నారు. వారిలో కిషోర్ కుమార్ కూడా వున్నారు. అయితే కిషోర్ కుమార్ అటు నటుడుగా, గాయకుడిగా కాస్త పైమెట్లు ఎక్కిన తరవాత స్వంతంగా సినిమా తీస్తున్నట్లు తెలిసి మెహమూద్ అతణ్ణి తనకో అవకాశం ఇమ్మని అడిగాడు. “నాకు పోటీగా నిలబడేవానికి నేనెలా అవకాశం ఇస్తాను” అని చెప్పి కిషోర్ కుమార్ తప్పుకున్నాడు. మెహమూద్ టాలెంట్ అంత గొప్పది. అయితే మెహమూద్ కిశోర్ కుమార్ నుడివిన మాటలు మరచిపోలేదు. తను సొంతంగా నిర్మించిన ‘పదోసన్’ సినిమాలో కిషోర్ కుమార్ కు మంచి పాత్ర ఇచ్చారు.


కెరీర్ బ్రేక్...
మెహమూద్ కు బాగా బ్రేక్ ఇచ్చిన సినిమా 1958లో వచ్చిన ‘పర్వరిష్’. అందులో హీరో రాజకపూర్ కు సోదరుడుగా మెహమూద్ నటించారు. తనకు సిఐడి, ప్యాసా చిత్రాల్లో పాత్రలు ఇచ్చి తన ఎదుగుదలకు సహకరించిన గురుదత్ అంటే మెహమూద్ కు గురుభావన. గురుదత్ నిలువెత్తు ఫోటో మెహమూద్ బెడ్ రూమ్ లో ఎప్పుడూ వుండేది. హాస్య నటనలో తన పూర్వ నటుడు జానీవాకర్ ను వెనక్కునెట్టి హీరోగా కూడా రాణించిన నటుడు మెహమూద్. కమెడియన్ గా మెహమూద్ కు మంచి పేరు తెచ్చిన చిత్రం ‘ససురాల్’. తెలుగులో హిట్టయిన ‘ఇల్లరికం’ సినిమాని ఎల్.వి. ప్రసాద్ 1961లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో రీమేక్ చేశారు. రాజేంద్రకుమార్, బి. సరోజాదేవి నటించిన ఈ చిత్రంలో మెహమూద్ తెలుగులో రేలంగి ధరించిన పాత్రను పోషించారు. అందులో మెహమూద్ కు మంచి పేరొచ్చింది. మెహమూద్ కు జంటగా శుభా ఖోటే నటించింది. అరవయ్యో దశకంలో మెహమూద్-శుభా ఖోటే హిట్ జంటగా పేరు తెచ్చుకొని అనేక సినిమాల్లో నటించారు. వాటిలో ‘గృహస్తి’, ‘భరోసా’, ‘జిద్ది’, ‘లవ్ ఇన్ టోక్యో’ చిత్రాలను ముందుగా చెప్పుకోవాలి. మెహమూద్ ఒక కమెడియన్ మాత్రమే కావచ్చు. కానీ ఆ సినిమాలో మెహమూద్ వున్నారంటే ప్రేక్షకులు తండోపతండాలుగా సినిమా హాల్ కు వచ్చేవారు. ‘దో ఫూల్’ వంటి కొన్ని సినిమాలు బాక్సాఫీ హిట్లయ్యాయి అంటే అది కేవలం మెహమూద్ నటించడం వలననే అనేది వాస్తవం. ‘దో ఫూల్’ లో మెహమూద్ ద్విపాత్రాభినయం ఓ అద్భుతమనే చెప్పాలి. అరవయ్యో దశకంలో మెహమూద్ లేని సినిమాలు ఉండేవి కాదు. ‘కామెడీ కింగ్’ గా మెహమూద్ మంచి హోదాను అనుభవించారు. అమితాబ్ బచన్ బొంబాయిలో సినిమాలలో వేషాలకోసం ప్రయత్నాలు జరుపుతూ కష్టాల్లో వున్నప్పుడు మెహమూద్ చేరదీసి తన గదిలో అమితాబ్ కు చోటు కల్పించి ఆర్ధికంగా కూడా ఆదుకున్నారు. అమితాబ్ కి 1972 లో ‘బాంబే టు గోవా’ చిత్రంలో హీరో పాత్ర ఇచ్చింది మెహమూదే. ఈ సినిమా చూసే సలీం-జావేద్ జంట ‘జంజీర్’ సినిమాలో అమితాబ్ కు ఇన్స్పెక్టర్ విజయ్ ఖన్నా పాత్రను మలిచి, అతనికి స్టార్డం అందించింది. అందుకు మెహమూద్ ని అభినందించాలి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ దేవ్ బర్మన్ కు ‘చోటే నవాబ్’, ‘బాంబే టు గోవా’, ‘పడోసన్’ సినిమాల ద్వారా మంచి బ్రేక్ ఇప్పించిన ఘనత మెహమూద్ దే. అలాగే ‘కున్వారా బాప్’ చిత్రం ద్వారా రాజేష్ రోషన్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు.
   మూడు వందల చిత్రాల్లో రాణించి...
మెహమూద్ దాదాపు నలభై ఏళ్ళు బాలీవుడ్ చిత్రసీమలో వెన్నుచూపని కమెడియన్ గా, హీరోగా పేరు నిలుపు కున్నారు. ఈ నలభై ఏళ్ళ కాలంలో మూడు వందల చిత్రాలకు పైగా మెహమూద్ నటించారు. అయితే 80, 90 దశకాల్లో మెహమూద్ డిమాండ్ సన్నగిల్లింది. నూతన తరం హాస్యనటులు అస్రాని, జగదీప్, పైంథాల్, దేవెన్ వర్మ, కాదర్ ఖాన్, జానీ లీవర్ ఎక్కువగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టడం మెహమూద్ డిమాండ్ పడిపోవడానికి కారణం గా భావించాలి. ‘దుష్మన్ దునియా కా’ అనే సొంత చిత్రానికి 1996 లో మెహమూద్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. జితేంద్ర, సుమలత నటించిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలు పోషించారు. మెహమూద్ కుమారుడు మంజూర్ ఆలి చేత ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషింపజేశారు. అయితే ఆ తరవాత మంజూర్ మరే ఇతర సినిమాల్లోనూ నటించలేదు. లక్కీ ఆలి (మఖ్సూద్ ఆలి) కూడా మెహమూద్ కుమారుడే. సినిమా ఓ మోస్తరుగా ఆడింది. రాజ్ కుమార్ సంతోషి నిర్మించిన ‘అందాజ్ అప్నా అప్నా’ లో మెహమూద్ చివరిసారి నటించారు. మెహమూద్ నటించిన చిత్రాల్లో గొప్పవిగా పరిగణించాల్సినవి... సాంఝ్ అవుర్ సవేరా, జోహార్ మెహమూద్ ఇన్ బాంబే, దో దిల్, బూత్ బంగాళా, ప్యార్ కియే జా, లవ్ ఇన్ టోక్యో, గుమ్ నామ్, పత్తర్ కే సనమ్, ఆంఖే, నీల్ కమల్, దో కలియా, వారిస్, మై సుందర్ హూ, జోహార్ మెహమూద్ ఇన్ హాంగ్ కాంగ్’, బాంబే టు గోవా, కున్వారా బాప్, పాకెట్ మార్, దేశ్ పరదేశ్, ఏక్ బాప్ ఛే బేటే, నౌకర్, లేడీస్ హాస్టల్ మొదలైనవి.

                             
అవార్డులు...
‘దిల్ తేరా దీవానా’ (1963) సినిమాలో నటనకు మెహమూద్ కి ఉత్తమ సహాయనటుడిగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఉత్తమ హాస్యనటుడిగా ‘ప్యార్ కియే జా’, ‘వారిస్’, ‘పారస్’, ‘వర్దాన్’ సినిమాల్లో నటనకు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. ‘లవ్ ఇన్ టోక్యో’, ‘మెహర్బాన్’, ‘నీల్ కమల్’, ’సాధు అవుర్ సైతాన్’, ‘మేరి భాభి’, ‘హమ్ జోలి’ వంటి 25 సినిమాల్లో నటనకు ఫిలింఫేర్ బహుమతికోసం మెహమూద్ పేరు ప్రతిపాదించబడింది. అలాగే ఆరు సార్లు మెహమూద్ పేరు ఉత్తమ సహాయనటుడు బహుమతికోసం నామినేట్ చేయబడింది. బాలీవుడ్ నటి అరుణా ఇరాని తో మెహమూద్ ప్రేమాయణం నడిపారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని పుకార్లు కూడా లేచాయి. కానీ వాళ్ళలో ఏ ఒక్కరూ ముందుకు వచ్చి తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చెయ్యలేదు. తొలి భార్య మధు కి విడాకు ఇచ్చిన తరవాత మెహమూద్ నాన్సీ కరోల్ (తాహిర) అనే వనితను  పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ కలిసి ఏడుగు సంతానం కలిగారు. మెహమూద్ కు గుండె జబ్బు రావడంతో చికిత్స కోసం అమెరికాలోని పెన్సిల్వేనియా కు వెళ్ళారు. 23 జూలై 2004 న అమెరికాలోనే మరణించారు. అతని పార్ధివ దేహాన్ని ముంబై తీసుకొనివచ్చి అభిమానుల సందర్శనార్ధం మెహబూబ్ స్టూడియోలో ఉంచారు.

ఆచారం షణ్ముఖాచారి  


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.