రొమేంటిక్‌ హీరో...రిషికపూర్‌!
రొమేంటిక్‌ హీరో...రిషికపూర్‌!
‘పృథ్విరాజ్‌ థియేటర్స్‌’ వ్యవస్థాపకులు పృథ్వీరాజ్‌కపూర్‌ది ఒక గొప్ప కళాకారుల ఖాందాన్‌. మూకీ యుగం నుంచి టాకీ యుగం దాకా నలభై ఏళ్లకు పైగా హిందీ చలనచిత్ర సీమకు మార్గదర్శిగా ఉంటూ, ఏకచత్రాధిపత్యం వహించిన చలనచిత్ర పితామహుడు ఆయన. ఆ ఒరవడిని పెద్దకుమారుడు రాజ్‌కపూర్‌ చేతబూని, ఆర్‌.కె.స్టూడియోస్‌ నిర్మించి గొప్పచిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడుగా రాణించి ‘ది గ్రేటెస్ట్‌ షో మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ’గా పేరుతెచ్చుకున్నాడు. రాజ్‌కపూర్‌ తమ్ముళ్లు షమ్మికపూర్, శశికపూర్‌లు కూడా హిందీ చలనచిత్ర పరిశ్రమకు నటులుగా, చిత్ర సమర్పకులుగా బహుముఖ సేవలు అందించారు. పృథ్వీరాజ్‌ తనయులందరికీ ‘పద్మ’పురస్కారాలు లభించాయి. రాజ్‌కపూర్‌ తనయులు రణధీర్‌కపూర్, రిషికపూర్‌లు కూడా హిందీ చలనచిత్ర సీమకు మూడవ తరం వరంగా మారి మంచి నటులుగా, దర్శకులుగా కూడా రాణించారు. వారిలో రిషి కపూర్‌ది అద్వితీయ రికార్డు. నూట ముఫ్ఫై సినిమాలకు పైగా హీరోగా, క్యారక్టర్‌ నటుడుగా రాణిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించడమే కాకుండా, నాలుగోతరానికి రణబీర్‌ కపూర్‌ని ఒక మంచి హీరోగా తీర్చిదిద్ది కపూర్‌ వంశపాలనను కొనసాగిస్తున్నారు. సెప్టెంబరు 4న ‘చింటూ’ అనే ముద్దుపేరుతో పిలిపించుకునే రిషికపూర్‌ 66వ జన్మదినం. అతడి జన్మదిన సందర్భంగా సితార డిజిటల్‌ పత్రికా పాఠకులకు కొన్ని విశేషాలు...




బాల చింటూ...
రిషికపూర్‌ రాజ్‌కపూర్‌ రెండవ కుమారుడు. సెప్టెంబరు 4, 1952న ముంబైలో జన్మించాడు. వారిది పంజాబీ కుటుంబం. అన్న రణధీర్, తమ్ముడు రాజీవ్‌తో కలిసి ముంబైలోని కూపరేజ్‌ రోడ్డులో వున్న క్యామ్పియన్‌ పాఠశాలలో చదివాడు. అజ్మీర్‌ లోని చారిత్రాత్మక మేయో కళాశాలలో పట్టభద్రుడయ్యాడు. షమ్మికపూర్, శశికపూర్‌ ఇద్దరూ రిషికి బాబాయిలు కాగా, క్యారక్టర్‌ నటుడు ప్రేమనాథ్, హాస్యనటుడు రాజేంద్రనాథ్‌ రిషి కపూర్‌కు మేనమామలు. రీతు నందా, రీమా జైన్‌ ఇద్దరూ రిషికపూర్‌కు అక్క చెల్లెళ్లు. పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి ‘మేరా నామ్‌ జోకర్‌’ సినిమాలో రిషి కపూర్‌ చిన్ననాటి రాజ్‌కపూర్‌గా నటించాడు.



బాబీతో ప్రభంజనం..
రాజ్‌కపూర్‌ సినిమాలకు ఎదురులేకుండా వున్న రోజుల్లో ఒక గట్టి ఎదురుదెబ్బ తగలడం జీర్ణించుకోలేని విషయం. నటజీవిత చరమాంకంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘మేరా నామ్‌ జోకర్‌’ (1970) సినిమా బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్‌ కావడమే కాదు, సినిమా నిర్మాణానికి ఆరు సంవత్సరాలు పట్టడంతో రాజ్‌కపూర్‌ ఆస్తులు మొత్తం హరించాయి. ఒకరకంగా రాజ్‌కపూర్‌ ఆత్మకథగా చెప్పుకునే ఈ సినిమా ఏకంగా నాలుగు గంటల పదిహేను నిమిషాల నిడివి, రెండు ఇంటర్వెల్స్‌తో నడవడంతో ప్రేక్షకులు విసుగుచెందారు. దాంతో రాజ్‌కపూర్‌కు ప్రేక్షకుల నాడి ఎలాంటిదో బోధపడింది. ఆయనలో కసి పెరిగింది. ప్రేక్షకుల్ని పిచ్చోళ్లను చేసే సినిమా తీసి విజయం సాధించాలని ఒక టీనేజి ప్రేమకథను రూపొందించాడు. అదే సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా ‘బాబీ’ (1973). టీనేజి ప్రేమికులు పారిపోయి ప్రాణత్యాగానికి సాహసించడం వంటి ఎన్నెన్నో మలుపులతో సాగిపోయే ఈ ప్రేమకావ్యాన్ని సెల్యూలాయిడ్‌ మీదకు తనదైన శైలిలో ఎక్కించడం రాజ్‌కపూర్‌కు నల్లేరు మీద బండి నడకలా సాగింది! తొలిసారి హీరోగా ఈ చాక్లెట్‌ బాయ్‌ ‘బాబీ’ సినిమాలో డింపుల్‌ కపాడియా సరసన నటించాడు. బాబీ పాత్ర కొత్తరకంగా వుండడం యువతరానికి ఎంతగానో నచ్చింది. ఆ సంవత్సరం విడుదలైన సినిమాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘బాబీ’ రికార్డు నెలకొల్పింది. రాత్రికి రాత్రే రిషికపూర్‌ స్టార్‌ అయిపోయాడు. తరువాత రిషీకపూర్‌ బాలీవుడ్‌ ప్లే బాయ్‌గా పేరుతెచ్చుకున్నాడు. బాబీ తరువాత 2000 సంవత్సరం వరకు 40 సినిమాల్లో హీరోగా నటించాడు. వాటిలో ‘లైలా మజ్ను’, ‘రఫూ చక్కర్‌’, ‘కర్జ్‌’, ‘ప్రేమ్‌ రోగ్‌’, ‘నగినా’, ‘హనీమూన్‌2, ‘చాందిని’, ‘హీనా’, ‘బోల్‌ రాధా బోల్‌’ వంటి సినిమాలు సూపర్‌ హిట్లయ్యాయి. అదే కాలంలో 13 మల్టీ హీరో సినిమాల్లో సహాయ హీరోగా నటించాడు. వాటిలో ‘ఖేల్‌ ఖేల్‌ మే’, ‘కభి కభి’, ‘హమ్‌ కిసీ సే కమ్‌ నహీ’, ‘బదల్తే రిష్తే’, ‘ఆప్‌ కే దీవానే’, ‘సాగర్‌2, ‘చాందిని’, ‘దీవానా’, ‘నసీబ్‌’, ‘కూలీ’, ‘జమానా’, ‘అమర్‌ ఆక్బర్‌ ఆంథోని’ సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి.



సహాయ నటుడుగా మారి...
90వ శకం చివరిలో రిషికపూర్‌ హీరోగా నటించిన సినిమాలు రాణించలేదు. దానితో రిషి తన పంధా మార్చుకొని సపోర్టింగ్‌ పాత్రలకు పరిమితమయ్యాడు. పైగా అతని వయసు యాభై ఏళ్లకు చేరడం కూడా ఒక ప్రతికూల అంశంగా మారింది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘ఏ హై జల్వా’ (2000) సినిమాలో రిషికపూర్‌ సల్మాన్‌ఖాన్‌కు తండ్రిగా నటించాడు. సైఫ్‌ ఆలి ఖాన్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ బహుమతిని అందించిన ‘హమ్‌ తుమ్’ (2004) సినిమాలో అతని తండ్రిగా రిషి రాణించాడు. తరవాత ‘ఫన్నా’లో జుల్ఫీకర్‌ ఆలి బేగ్‌గా, ‘నమస్తే లండన్‌’లో మన్మోహన్‌ మల్హోత్రాగా, ‘లవ్‌ ఆజ్‌ కల’ లో సైఫ్‌ ఆలి తండ్రి వీర్‌ సింగ్‌గా, ‘పాటియాలా హౌస్‌’లో బావూజీగా మంచి పాత్రలు పోషించాడు. అలాగే బ్రిటీష్‌ ఫిలిం ‘సాంబార్‌ సల్సా’, ‘డోంట్‌ స్టాప్‌ డ్రీమింగ్‌’ చిత్రాలలో కూడా నటించాడు. చాలా ఏళ్ల తరువాత భార్య నీతూ సింగ్‌ తో ‘దో దూని చార్‌’లో దంపతులుగా నటించారు. రిషికపూర్‌ నీతూసింగ్‌ని జనవరి 20, 1980న పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి జంటగా 15 సినిమాల్లో నటించారు. యువ హీరో రణ్‌బీర్‌ కపూర్, రిద్ధిమా వీరి సంతానం. 2009లో రష్యన్‌ ప్రభుత్వం రిషికపూర్‌ సినీపరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా ఘనంగా సన్మానించింది. నీతూసింగ్‌-రిషికపూర్లను ఉత్తమ జోడీగా నిర్ణయించి జీ సినీ అవార్డుల సంస్థ ఘనంగా సత్కరించింది. స్కీన్ర్, ఫిలింఫేర్‌ సంస్థలు రిషికపూర్‌కు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశాయి. ఇవి కాకుండా మరెన్నో సంస్థలు రిషికపూర్‌కు ఉత్తమ సహాయనటుడి బహుమతులు అనేకసార్లు అందజేశాయి.




ఖుల్లం ఖుల్లా...అన్‌ సెన్సార్డ్‌...
రిషికపూర్‌ది కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడే తత్త్వం. మనసులో మాటను చెబుతూ ‘ఖుల్లం... ఖుల్లా: రిషికపూర్‌ అన్‌ సెన్సార్డ్‌’ పేరిట తన ఆత్మకథను 15, జనవరి 2017న వెలువరించాడు. అందులో వెల్లడించిన కొన్ని నిజాలు కనుబొమలను ఎగరేసేవి కావడం విశేషం. పెళ్లయిన తరువాత కూడా తన తండ్రి రాజ్‌కపూర్‌ నటీమణి నర్గీస్‌తో సంబంధాలు కొనసాగించేవాడని, అలాగే వైజయంతిమాలతో సంబంధాలు నెరపినప్పుడు తన తల్లి మెరైన్‌ డ్రైవ్‌లో వున్న నటరాజ్‌ హోటల్‌కు మకాం మార్చారని, ఆ తరువాత చిత్రకూట్‌లోని అపార్ట్‌మెంట్‌లో కొంతకాలం ఉన్నామని, దాంతో రాజ్‌కపూర్‌ వివాహేతర సంబంధాలకు చెక్‌ పెట్టారని పుస్తకంలో ధైర్యంగా పేర్కొనడం రిషి సత్యసంధత్వానికి నిదర్శనం. ‘బాబీ’ సినీ నిర్మాణ సమయానికి రిషికి 21 ఏళ్లు. ఆ సినిమా నిర్మాణానికి ముందే యాస్మిన్‌ మెహతా అనే ఒక పారసీక యువతితో డేటింగ్‌ జరిపాడు. బాబీ విడుదలై స్మాష్‌ హిట్‌ అయ్యాక డింపుల్‌తో తనకు సంబంధం వున్నట్లు స్టార్‌ డస్ట్‌ పత్రిక రాయడంతో, ఆ పారశీక యువతి తన నుంచి దూరమైందని రిషి ఆ పుస్తకంలో రాశాడు. యాస్మిన్‌ మెహతా తనకు ఒక ఉంగరం బహుమానంగా ఇచ్చిందని, బాబీ షూటింగులో తను ఆ ఉంగరాన్ని డింపుల్‌కు తొడిగానని, రాజేష్‌ ఖన్నా డింపుల్‌ను పెళ్లాడబోతూ, ఈ విషయం తెలిసి ఆ ఉంగరాన్ని విసరికొట్టాడని పుస్తకంలో ధైర్యంగా పేర్కొన్నాడు. బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ కుమార్తె శ్వేత ద్వారా రిషి కుటుంబానికి బంధుత్వముంది. ‘కభి కభి’ (1976) సినిమాలో వీరిద్దరూ నటిస్తున్నప్పుడు అమితాబ్‌ ముభావంగానే వుండేవారని, తన ప్రక్కన రెండవ హీరోగా నటిస్తున్న నటుల గురించి అమితాబ్‌ సఖ్యత కనబరిచేవారు కాదని చెబుతూ, అందుకు ఉదాహరణగా ‘దీవార్‌’ (శశికపూర్‌), ‘అమర్‌ అక్బర్‌ అంథోని’ (వినోద్‌ ఖన్నా, శత్రుఘ్న సిన్హా) సినిమాలను ఉదహరించాడు. పాళీ హిల్స్‌లో తన బంగాళా ప్రక్కనే నివసించే గుల్జార్‌ తన ఆత్మకథను చదివితే సంతోషిస్తానని ఆ పుస్తకంలో రాశాడు. కారణం... రిషి నటించిన ఏ ఒక్క సినిమాకి గుల్జార్‌ పాటలు రాయలేదు. నీతూసింగ్‌ను పెళ్లాడాక రిషి నటించిన సినిమాలు చాలా ఫ్లాపులు కావడంతో ఆమెను దూషించేవాడినని, తరువాత బాధపడి ఆమెను మన్నించమని కోరిన క్షణాలు ఎన్నో వున్నాయని కూడా రిషికపూర్‌ తన ఆత్మకథలో పేర్కొనడం అతని గొప్పతనంగానే చెప్పుకోవాలి. అమితాబ్‌ బచన్‌ తనతో ‘కభి కభి’ సినిమాలో నటించేటప్పుడు చాలా గుర్రుగా ఉండేవాడని, అందుకు కారణం ‘జంజీర్‌’ సినిమాలో నటనకు తనకు రావలసిన ఫిలింఫేర్‌ బహుమానాన్ని ‘బాబీ’ సినిమాతో రిషి తన్నుకుపోయాడనే భావనలో అమితాబ్‌ వుండడం అని ఆత్మకథలో పేర్కొన్నాడు. నిజానికి ఆ బహుమతి అమితాబ్‌కే దక్కాల్సిందని, అయితే దాన్ని మూడువేల రూపాయలు లంచమిచ్చి కొనుక్కున్నాననే నిజాన్ని ఒప్పుకోవడం రిషికపూర్‌ హుందాతనాన్ని, నిఖార్సయిన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.



మరిన్ని విశేషాలు...
* రిషీకపూర్‌కు కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడడం అలవాటు. ఈ మధ్య రిషికపూర్‌ చేసిన ట్వీట్‌ కొందరి అనుమానాలకు తావిచ్చింది. డింపుల్‌-రాజేష్‌ ఖన్నా కూతురు ట్వింకిల్‌కు రిషి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ‘‘బేబీ...బాబీ’ సినిమాలో ‘అక్సర్‌ కోయి లడకీ ఇస్‌ హాల్‌ మే, కిసీ లడకే సే సోలహ్వే సాల్‌ మే’ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో నువ్వు మూడు నెలల పసికందుగా నీ తల్లి గర్భంలో ఆ పాటను ఆలకిస్తూ వున్నావు. నీకు జన్మదిన శుభాకాంక్షలు’’ ట్వీట్‌ చేశాడు. ఈ సందేశాన్ని ఆసరాగా తీసుకొని, ‘ట్వింకిల్‌ ఖన్నా పుట్టింది రాజేష్‌ ఖన్నాతో పెళ్లయాకా, లేక ముందుగానేనా’ అంటూ కొందరు తుంటరివాళ్లు ప్రశ్నించారు. రిషీకి కోపమొచ్చింది. ‘‘బాబీ’ సినిమా నిర్మాణ దశలో డింపుల్‌ టీనేజిలో ఉండగానే రాజేష్‌ ఖన్నా కాకాతో మార్చి 73లో ఆమెకు పెళ్లయింది. దీంతో చిత్ర నిర్మాణానికి అంతరాయం కలిగింది. బాబీ సినిమా 28 సెప్టెంబరు 1973న విడుదలైంది. ట్వింకిల్‌ బేటీ 29, డిసెంబరు 1973న జన్మించింది’’ అంటూ ఆ తుంటరులకు గట్టి సమాధానమిచ్చారు.


* ‘ఆ రోజుల్లో మీరు మంచి యువ రొమాంటిక్‌ హీరో కదా’ అని ఎవరో అడిగిన ప్రశ్నకు ‘సినిమాల్లో రొమాన్స్‌ చేసేవాళ్లు, హీరోయిన్‌తో పాటలు పాడేవారు, విలన్లతో ఫైటింగులు చేసేవారు హీరోలు కాలేరు. అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, రక్షణ పోలీసులు, వైద్యులే నిజమైన హీరోలు’’ అంటూ అద్భుతమైన జవాబిచ్చాడు.


* 2007లో రిషి ‘డోంట్‌ స్టాప్‌ డ్రీమింగ్‌’ అనే ఇంగ్లీష్‌ చిత్రంలో నటించాడు. షమ్మి కపూర్‌ కుమారుడు ఆదిత్య రాజ్‌కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రొమాంటిక్‌ హీరోగా రిషికపూర్‌ నటించినన్ని హిందీ సినిమాలు మరేనటుడూ నటించలేదు. అతడు నటించిన నూట ముప్ఫైకి పైగా చిత్రాల్లో వందకు పైగా చిత్రాలు రొమాంటిక్‌ హీరోగానే. రొమాంటిక్‌ హీరోగా రిషి నటించిన ఆఖరి సినిమా ‘ది బిజినెస్‌ ఆఫ్‌ లవ్‌’. అయితే అనివార్య కారణాలవలన ఈ సినిమా 2000 సంవత్సరం దాకా విడుదలకు నోచుకోలేదు.


* కరణ్‌ జోహార్‌ నిర్మించిన ‘అగ్నిపీఠ’ సినిమాలో రిషి విద్రోహకారుడిగా నటించాడు. తొంభయ్యవ దశకం చివర్లో రిషి నటించిన సినిమాలు పరాజయం చవి చూశాయి. దాంతో 2000 తరవాత సహాయక పాత్రల పోషణకు రిషి పరిమితమయ్యాడు. రిషికపూర్‌ హీరోగా నటించిన ‘హెన్నా’ అనే చిత్రం రాజ్‌కపూర్‌ దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా. రాజ్‌కపూర్‌ మరణంతో ఆ సినిమాను రిషి అన్న రణధీర్‌ కపూర్‌ పూర్తిచేశాడు. ‘మేరా నామ్‌ జోకర్‌’ సినిమాకు ముందే రిషి కెమెరా ముందుకు వచ్చాడు.


* రాజకపూర్‌ నిర్మించిన ‘శ్రీ 420’ సినిమాలో ‘ప్యార్‌ హువా ఇకరార్‌ హువా’ పాటలో చిన్నపిల్లాడిగా తప్పటడుగులు వేస్తూ కనిపిస్తాడు. ‘ఖేల్‌ ఖేల్‌ మే’, ‘కభి కభి’, ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’, ‘దూస్రా ఆద్మీ’ వంటి సినిమాల్లో రిషికపూర్‌ సరసన హీరోయిన్‌గా నీతూసింగ్‌ నటించింది. తరువాత 1980లో రిషికపూర్‌ హీరోయిన్‌ నీతూసింగ్‌ను ప్రేమించి పెళ్లాడాడు. అప్పుడు రిషి వయసు 29 ఏళ్లు. తను నీతూని వివాహమాడాలనుకుంటునట్లు చెప్పేందుకు నీతూ తల్లిదండ్రుల ఇంటికి పూర్తి జ్వరంతో వుండగా వెళ్లాడు. నీతూ తల్లిదండ్రులు ఆ స్థితిలో వచ్చిన రిషి ప్రేమకు ఫిదా అయిపోయి పెళ్లికి ఒప్పేసుకున్నారు.


* తండ్రి రాజ్‌కపూర్, సోదరుడు రణ్‌ధీర్‌కపూర్‌లాగే తను కూడా దర్శకుడుగా రాణించాలని అక్షయ ఖన్నా, ఐశ్వర్యరాయ్‌లతో 1999లో ‘ఆబ్‌ లౌట్‌ చలే’ అనే సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. తరవాత దర్శకత్వం జోలికి వెళ్లలేదు.


* తన సోదరులు రణధీర్, రాజీవ్‌ కపూర్లతో కలిసి రిషికపూర్‌ ‘ప్రేమ గ్రంథ్‌’ అనే సినిమా నిర్మించాడు. తమ్ముడు రాజీవ్‌కపూర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇన్ని సినిమాల్లో నటించిన రిషికపూర్‌కు దక్కింది ఒకే ఒక ఫిలింఫేర్‌ బహుమతి. అది ‘బాబీ’ సినిమాలో నటనకు గెలుచుకుంది. సారీ... గెలుచుకుంది కాదు తెలియని వయసులో కొనుక్కుంది. ఈ విషయాన్ని ఇటీవలే విడుదలైన తన ఆత్మకథలో నిష్కపటంగా ఒప్పుకోవడం రిషికపూర్‌ గొప్పతనమని చెప్పాలి.

                                                                                                                                                            - ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.