ప్రపంచాన్ని థ్రిల్‌చేసిన దర్శకధీరుడు.. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌
అతని సినిమాలను చూస్తుంటే ఉత్కంఠకు తారాస్థాయి ఇదేనేమో అనిపిస్తుంది. ప్రేక్షకులను భయపెడతాడు.. వారికి సైకలాజికల్‌ థ్రిల్‌ అంటే ఏమిటో పరిచయం చేస్తాడు. అతని చిత్రాల్లో మాటలు లేకున్నా కేవలం నటీనటుల హావభావలతో కథను ఎలా రక్తి కట్టించవచ్చో చక్కగా చూపిస్తాడు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా అనేక సస్పెన్స్, సైకలాజికల్‌ థిల్లర్స్‌ నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌ కాక్‌. అందుకే ఆయన్ని మాస్టర్‌ ఆఫ్‌ సస్పెన్స్‌ అని పిలుస్తారు..

article image

* లిటిల్‌ లాంబ్‌ వితవుట్‌ ఎ స్పాట్‌!
ఆల్‌ఫ్రెడ్‌ తీసిన చిత్రాలన్నీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందాయి. ఆల్‌ఫ్రెడ్‌ 1899 ఆగస్టు 13న ఇంగ్లాండ్‌లోని లెయ్‌టన్‌స్టోన్‌లో జన్మించాడు. ఆల్‌ఫ్రెడ్‌ పూర్తి పేరు సర్‌ ఆల్‌ఫ్రెడ్‌ జోసఫ్‌ హిచ్‌ కాక్‌. తండ్రి ఎమ్మా జానే హిచ్‌ కాక్, తల్లి విలియమ్‌ హిచ్‌ కాక్‌. వీరికున్న ముగ్గురు సంతానంలో ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ చిన్నవాడు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆల్‌ఫ్రెడ్‌.. చిన్నతనం నుంచి చాలా బుద్ధిగా ఉండేవాడు. అందుకే ఆల్‌ఫ్రెడ్‌ తండ్రి అతన్ని ‘‘లిటిల్‌ లాంబ్‌ వితవుట్‌ ఎ స్పాట్‌’’ (ఎలాంటి మచ్చలు లేని మంచి గొర్రెపిల్ల) అని పిలిచేవాడు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉన్న ఆల్‌ఫ్రెడ్‌ తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంజినీరింగ్‌ చదువుకున్నాడు. 1914లో తన తండ్రి కిడ్నీ వ్యాధితో మంచాన పడటంతో తల్లికి సహాయంగా ఉండేందుకు ఆల్‌ఫ్రెడ్‌ కొన్నాళ్లపాటు టెక్నికల్‌ క్లర్క్‌గా ఓ కంపెనీలో 15 షిల్లింగ్స్‌ వేతనానికి పనిచేశాడు. ఆ తర్వాత టైటిల్‌ కార్డ్‌ డిజైనర్‌గా, టెలిగ్రాఫ్‌ కేబుల్‌ కంపెనీలో కాపీరైటర్‌గా వివిధ ఉద్యోగాలు చేశాడు. ఇలా పనిచేస్తున్న సమయంలోనే డబ్బింగ్‌ క్రియేటివిటీ రైటర్‌గా ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ మంచి నైపుణ్యం సంపాదించాడు. చిన్నచిన్న కథలు అనేకం రాశాడు. ఆ తర్వాత అడ్వర్టైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలోనే సినిమాల పట్ల ఆయనకు ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా చార్లీ చాప్లిన్, డి.డబ్లూ. గ్రిఫిత్, బస్టర్‌ కీటన్, ఫ్రిట్జ్‌ లంగ్స్‌ వంటి అమెరికన్‌ నటుల సినిమాలను విపరీతంగా చూసేవాడు. తర్వాత 1919లో ఆల్‌ఫ్రెడ్‌.. ఐస్లింగ్‌ స్టూడియోస్‌ అనే సంస్థలో టైటిల్‌కార్డ్‌ డిజైనర్‌గా పనిచేశాడు. అందులో చాలా కాలం పనిచేసిన ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ కో−రైటర్‌గా, కళా దర్శకుడిగా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా 18మూకీ సినిమాలకు పనిచేసి ఎంతో అనుభవాన్ని సంపాదించాడు.

article image

* ఆ రెండు.. ఆల్‌ఫ్రెడ్‌ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాయి!
ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన సినిమా ‘నంబర్‌ 13’. 1922లో మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాని తర్వాత 1923లో ‘ఆల్‌వేస్‌ టెల్‌ యువర్‌ వైఫ్‌’ అనే మూకీ చిత్రానికి దర్శకుడిగా మరో ఇద్దరితో కలిసి పనిచేశాడు. అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలిసారి స్వయంగా దర్శకత్వం వహించిన మూకీ చిత్రం 1925లో వచ్చిన ‘ద ప్లజర్‌ గార్డెన్‌’. ఈ సినిమా కొంతవరకు పర్వాలేదనిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘ద మౌంటైన్‌ ఈగల్‌’ కూడా ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌కు తొలి విజయాన్నందించిన సినిమా ‘లాడ్జర్‌: ఎ స్టోరీ ఆఫ్‌ ద లండన్‌ ఫాగ్‌’. 1927లో వచ్చిన ఈ మూకీ చిత్రం భారీ విజయాన్నందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక హిచ్‌కాక్‌ తెరకెక్కించిన తొలి టాకీ సినిమా 1929లో వచ్చిన ‘బ్లాక్‌మెయిల్‌’. 1930ల్లో వచ్చిన ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ సినిమాల్లో ‘ద 39 స్టెప్స్‌’ (1935), ‘ద లేడీ వానిషెస్‌’ (1938) భారీ హిట్లు అందుకున్నాయి. ఈ రెండు థ్రిల్లర్‌ సినిమాలు 20వ శతాబ్దంలో వచ్చిన అత్యంత గొప్ప బ్రిటీష్‌ చిత్రాలుగా మన్ననలు అందుకోవడంతో పాటు ఆల్‌ఫ్రెడ్‌ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాయి.

article image
* హాలీవుడ్‌లోకి అడుగు..
ఆల్‌ఫ్రెడ్‌ సినిమా కెరీర్‌ను మలుపు తిప్పిన సంవత్సరం 1939. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత డేవిడ్‌ ఒ.సెల్జినిక్‌.. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ దర్శకత్వ ప్రతిభను చూసి తన సినిమా ‘రెబెక్కా’కు దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించాడు. 1939లో మొదలైన ఈ సినిమాతోనే హిచ్‌కాక్‌ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సెల్జినిక్‌ నిర్మాతగా ఆల్‌ఫ్రెడ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రెబెక్కా’ 1940లో విడుదలైన భారీ విజయాన్నందుకుంది. ఈ సినిమా ఏకంగా 11 విభాగాల్లో అకాడమీ పురస్కారాలకు నామినేట్‌ అయి.. రెండు ‘ఉత్తమ చిత్రం’, ‘సినిమాటోగ్రఫి’ విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. అలా హాలీవుడ్‌లో తొలి సినిమాతోనే ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ అనేక సంచలనాలు సృష్టించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా ‘ఫారిన్‌ కరస్సాండెంట్‌’ (1940), ‘షాడో ఆఫ్‌ ఎ డౌట్‌’ (1943), ‘ది పారడైన్‌ కేస్‌’ (1947) సినిమాలతో వరుస విజయాలందుకున్నాడు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాయి. హిచ్‌కాక్‌ 1954లో తీసిన ‘రియర్‌ విండో’ సినీ ప్రేక్షకులను ఎంతో అలరించింది. హీరో కాలు విరిగి మంచం పాలయి ఊసుపోక కిటికీలో నుంచి చుట్టుపక్కల అపార్‌్్టమెంట్స్‌ని గమనిస్తుంటాడు. ఎదురుగా ఒక ప్లాట్‌లో ఉండే భర్త తన భార్యని హత్యచేసి ఆ శవాన్ని కనిపించకుండా ఎక్కడో దాచేస్తాడు. ఇదంతా మొదట్లో అతని ప్రియురాలు, డిటెక్టీవ్‌ మిత్రుడికి చెపితే నమ్మరు. చివరికి వాళ్ల సాయంతో ఆ రహస్యాన్ని ఎలా ఛేదిస్తాడు, చివరికి ఏమౌతుంది.. అనేది ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ ఆ సినిమాలో ఎంతో ఉత్కంఠభరితంగా చూపిస్తాడు.

article image
* ఆల్‌ఫ్రెడ్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాలు..
దీని తర్వాత 1955లో మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘టు క్యాచ్‌ ఎ థీఫ్‌’తోనూ హిచ్‌కాక్‌ మరో హిట్టు అందుకున్నాడు. ఈ సినిమాతో ఆల్‌ఫ్రెడ్‌ మరోసారి ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నాడు. 1959లో వచ్చిన ‘నార్త్‌ బై నార్త్‌ వెస్ట్‌’లో విలన్, హీరోను చంపేందుకు ప్రయత్నిస్తుండగా అతను తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా కథ నడుస్తుంది. ఇందులో విలన్‌ హెలికాఫ్టర్‌తో పై నుంచి దాడి చేస్తుంటే.. కింద హీరో గోధుమ పొలాల్లో దూరి హీరో తప్పించుకుంటుంటాడు. ఈ సందర్భంగా చిత్రంలో వచ్చే సన్నివేశాలను ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి ఆ సన్నివేశాలు. ఈ సినిమా ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌కు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక 1960ల్లో వచ్చిన ‘రియర్‌ విండో’, ‘వెర్టిగో’, ‘సైకో’ చిత్రాలు అతని కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాలుగా నిలిచాయి. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తన ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో మొత్తం 53 సినిమాలను తెరకెక్కించాడు. ఆల్‌ఫ్రెడ్‌ తీసిన చివరి సినిమా ‘ఫ్యామిలీ ప్లాట్‌’ (1976). ఆయన సినిమా రంగానికి అందించిన సేవలకు గానూ 1979లో ఎఎఫ్‌ఐ లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ 1980 ఏప్రిల్‌ 20న తన 80ఏళ్ల వయసులో కన్నుమూశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.