ధనా... ధన్‌ నటుడు

తుపాకుల మోతెక్కించే పోలీస్‌ ఆఫీసర్, గన్‌ఫైటర్, ప్రతీకారాలతో కూడిన సినిమాల్లో కనిపించే నటుడిగా చార్లెస్‌ బ్రాన్సన్‌ గుర్తుండిపోతాడు. అమెరికాలో 1921 నవంబర్‌ 3న పుట్టిన ఇతడు చేసినవన్నీ అలాంటి యాక్షన్‌ చిత్రాలే. పదేళ్లకే తండ్రిని కోల్పోయిన ఇతడు బాల్యంలో పేదరికాన్ని అనుభవించాడు. దుస్తులు లేక అక్క గౌన్లు వేసుకుని స్కూలు వెళ్లేవాడు. బొగ్గు గనుల్లో పని చేశాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మిలిటరీలో చేరాడు. ఎయర్‌ఫోర్స్‌లో పనిచేసి 25 మిషన్స్‌లో పాల్గొని యుద్ధ విమానాల ద్వారా విరుచుకు పడి ఆ సేవలకు ‘పర్పుల్‌ హార్ట్‌’ అవార్డు పొందాడు. యుద్ధం తర్వాత ఏవేవో ఉద్యోగాలు చేసి చివరకి నాటకాల్లో నటుడిగా మారాడు. ఆపై హాలీవుడ్‌లో ‘యువార్‌ ఇన్‌ ద నేవీ నౌ’, ‘ద మాబ్‌’, ‘ద పీపుల్‌ ఎగైనెస్ట్‌ ఓహరా’, ‘బ్లడ్‌హూండ్స్‌ ఆఫ్‌ బ్రాడ్వే’, ‘బ్యాటిల్‌జోన్‌’, ‘టార్గెట్‌ జీరో’, ‘ద డర్టీ డజన్‌’, ‘డెత్‌ విష్‌’, ‘ద గ్రేట్‌ ఎస్కేప్‌’ లాంటి సినిమాల ద్వారా యాక్షన్‌ నటుడిగా గుర్తింపు పొందాడు. అనేక అవార్డులు పొందిన ఇతడు 2003 ఆగస్టు 30న కాలిఫోర్నియాలో తన 81 ఏట మరణించాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.